Share News

ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 07:27 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది.

ప్రధాని మోదీకి  స్వాగతం పలికిన ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు
Narendra Modi Indonesia visit

ఇంటర్నెట్ డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. పీఎం మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు (ఎఫ్‌-16, సుఖోయ్-30) ఆకాశంలో ఎస్కార్ట్‌లా తోడుగా నిలిచి స్వాగతం పలకడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ అద్భుతమైన ఆతిథ్యానికి ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. '2018లో ఇరు దేశాల బంధాన్ని 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం'గా మార్చుకున్నాం. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నాం. అలాగే యోగ్యకర్తలోని ప్రసిద్ధ 'ప్రాంబనన్ దేవాలయ' సముదాయాన్ని సందర్శించనుండటం ఇరు దేశాల సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది' అని మోదీ పేర్కొన్నారు.


రక్షణ రంగంలో భారత్, ఇండోనేషియాల మధ్య సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. భారతదేశానికి చెందిన శక్తివంతమైన 'బ్రహ్మోస్' సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ఫిలిప్పీన్స్ 375 మిలియన్ల డాలర్లతో బ్రహ్మోస్ కొనుగోలుకు తొలి ఒప్పందం చేసుకుంది. తాజాగా ఇండోనేషియా కూడా అదే బాటలో నడవడం భారత్ రక్షణ ఎగుమతులకు దక్కిన ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చనుంది.


ఈ వార్తలనూ చదవండి:

పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి

మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్

Updated Date - Jul 06 , 2026 | 08:18 PM