పహల్గాం దాడి.. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై కేసు
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:46 PM
పహల్గాం దాడిపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ తాజాగా ఈ కేసుకు సంబంధించి అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై పలు అభియోగాలతో ఈ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడిపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ తాజాగా ఈ కేసుకు సంబంధించి అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ ఎల్ఈటీ అధినేత హఫీజ్ సయీద్‌పై పలు అభియోగాలతో ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఉపా చట్టంతో పాటు భారతీయ న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఎల్‌ఈటీ, టీఆర్ఎఫ్‌లపైనా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పహల్గాం ఉగ్రదాడి ప్రణాళిక, నిధులు సమకూర్చడం వెనుక ఈ ఉగ్ర సంస్థలు ఉన్నాయని పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ 15న ఎన్‌ఐఏ తొలి చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. పాకిస్థానీ ఉగ్రవాది సాజిద్ జాత్‌తో పాటు మరో ముగ్గురు టెర్రరిస్టులను నిందితులుగా పేర్కొంది. ఉగ్రవాదులకు ఆయుధ రవాణా, ఇతర విషయాల్లో సహకరించిన ఇద్దరు కశ్మీరీలపై కూడా కేసు నమోదు చేసింది. భద్రతా దళాలు ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించి ఈ ఉగ్రమూకలను మట్టుపెట్టిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి తరువాత అనంత్‌నాగ్ పోలీస్ స్టేషన్‌లో మొదట కేసు నమోదైంది. ఆ తరువాత ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేంద్రం హోం శాఖ కేసును ఎన్ఐఏకు బదిలీ చేసింది. ఇక ఈ దాడి వెనకున్న పాక్ కుట్ర మొత్తాన్ని బయటపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం
అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: విశ్వహిందూ పరిషత్