భారత్‌తో బలమైన కొత్త అజెండా అమలుకు సిద్ధం: యూరోపియన్ యూనియన్
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:05 AM
భారత్‌తో కొత్త అజెండా అమలు చేయడానికి యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉందని కాజా కల్లాస్ ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. భారత్-యూరప్ ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత అవసరమైనదని ఆమె చెప్పారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 22: భారత్‌తో బలోపేతమైన కొత్త అజెండా అమలు చేయడానికి యూరోపియన్ యూనియన్(EU) సిద్ధంగా ఉందని ఈయూ విదేశాంగ విధానం, భద్రతా విధానాల హై రిప్రెజెంటేటివ్ కాజా కల్లాస్ ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత్-యూరప్ ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత ఆవశ్యకమన్నారు.
భారత్‌తో కొత్త సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్‌నర్‌షిప్‌పై ఈయూ అంగీకరించిందని కల్లాస్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఒప్పందం సముద్ర భద్రత, కౌంటర్ టెర్రరిజం, సైబర్ డిఫెన్స్ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తుంది. ఈ ఒప్పందం మీద వచ్చే వారం న్యూఢిల్లీలో జరిగే 16వ EU-ఇండియా సమ్మిట్‌లో సంతకం చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కాగా.. ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లీయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో కోస్టా జనవరి 25 నుంచి 27 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. జనవరి 26న నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. జనవరి 27న ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 16వ EU-ఇండియా సమ్మిట్‌లో పాల్గొననున్నారు.
ఈ సమ్మిట్‌లో 2030 వరకు అనుసరించాల్సిన కొత్త సమగ్రమైన, వ్యూహాత్మక ప్రణాళిక లేదా రోడ్‌మ్యాప్‌ను ఆమోదిస్తారు. ఈ ఒప్పందాన్ని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అని వర్ణిస్తూ, ఇది దాదాపు 2 బిలియన్ల ప్రజలకు మార్కెట్‌ను సృష్టిస్తుందని, ప్రపంచ GDPలో చాలా భాగాన్ని కవర్ చేస్తుందని కల్లాస్, వాన్ డెర్ లీయెన్ వంటి నాయకులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ ఒప్పందం భారత్, యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య క్లీన్ టెక్నాలజీస్, ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్స్ వంటి కీలక రంగాల్లో సప్లై చైన్స్‌ను బలోపేతం చేస్తుంది. 2004 నుంచి EU-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ట్రేడ్, సెక్యూరిటీ, టెక్నాలజీ, పీపుల్-టు-పీపుల్ టైస్(ప్రజల మధ్య సంబంధాలు)లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త అజెండా రూపొందించారు. ఈ సమ్మిట్, అందులో చేసుకునే ఒప్పందాలు భారత్-EU సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని భావిస్తున్నారు.
మరోవైపు.. వాణిజ్య రంగంలో భారత్-EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఇది ప్రధానంగా వాణిజ్యం (ట్రేడ్)పై ఫోకస్ చేసిన ఒక నిర్దిష్ట ఒప్పందం. టారిఫ్స్(కస్టమ్స్ డ్యూటీలు), నాన్-టారిఫ్ వాణిజ్య అవరోధాలు తొలగించడం, మార్కెట్ యాక్సెస్ పెంచడం, సప్లై చైన్స్ బలోపేతం చేయడం వంటివి ఈ డీల్‌లోని ప్రధాన అంశాలు.
ఇవి కూడా చదవండి..
కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News