బౌద్ధ గురువు దలైలామాకు అరుదైన గౌరవం..
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:15 PM
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు(మంగళవారం) ఆయన ఆ అవార్డును స్వీకరించారు. దలైలామా తరఫున గాయకుడు రఫూస్ వెయిన్‌రైట్ గ్రామీ అవార్డును అందుకున్నారు. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు దక్కింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువైన ఈయనకు గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇదే తొలిసారి. ఆదివారం రాత్రి లాస్ ఏంజిల్స్ లోని క్రిప్టోడాట్‌కామ్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 కేటగిరీలో గ్రామీ అవార్డులను ప్రకటించారు. దలైలామాకు అవార్డు దక్కడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
దలైలామాకు ‘ఆడియో బుక్స్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్’ విభాగంలో ఈ అవార్డు దక్కింది. దలైలామాతో కలిసి గాయకులు మ్యాగీ రోజర్స్, ఆండ్రా డేలు ఈ ఆల్బమ్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఈ ఆల్బమ్‌ను కబీర్ సెహగల్ నిర్మించగా.. సరోద్ విద్వాంసుడు అంజాద్ అలీ ఖాన్, ఆయన కొడుకులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, సింగర్ డెబీ నోవా తదితరులు కనిపించారు.
దలైలామా స్పందనిదే:
గ్రామీ అవార్డు రావడంపై దలైలామా స్పందించారు. ఈ అవార్డును తాను వ్యక్తిగత ఘనతగా భావించడం లేదని, దానిని కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న బాధ్యతలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని డ్రాగన్ దేశం చైనా తప్పుబట్టింది. తమ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆయనకు అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ లిన్ జియాన్ వ్యాఖ్యానించారు. మతం పేరుతో ఆయన విభజన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. ఆయనో రాజకీయ శరణార్థి అని, మతం పేరుతో చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బడ్జెట్ సమావేశాలు.. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్
హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. మంత్రికి తప్పిన ప్రమాదం..