పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌కు సవాల్‌గా మారిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం..
ABN , Publish Date - Sep 09 , 2026 | 08:14 PM
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంతో భారత్‌కు మరోసారి సున్నితమైన దౌత్య పరీక్ష ఎదురైంది. పశ్చిమాసియా సంక్షోభంపై ఇరాన్, యూఏఈలు పరస్పర విరుద్ధ వైఖరులతో ఉండటంతో.. ఈ విభేదాలు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రభావితం చేయకుండా చూడటం న్యూఢిల్లీకి కీలకంగా మారింది.
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంతో భారత్‌కు మరోసారి సున్నితమైన దౌత్య పరీక్ష ఎదురైంది. పశ్చిమాసియా సంక్షోభంపై ఇరాన్, యూఏఈలు పరస్పర విరుద్ధ వైఖరులతో ఉండటంతో.. ఈ విభేదాలు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రభావితం చేయకుండా చూడటం న్యూఢిల్లీకి కీలకంగా మారింది. ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్.. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి ఢిల్లీ డిక్లరేషన్‌ను వెలువరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, పశ్చిమాసియా పరిణామాలు, ఇరాన్-యూఏఈ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ఈ సమావేశానికి సవాలుగా మారాయి.
గతంలోనే విభేదాలు బహిర్గతం..
ఇరాన్, యూఏఈల మధ్య పశ్చిమాసియా యుద్ధంపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరుదేశాల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా సంయుక్త ప్రకటన వెలువడలేదు. దీంతో భారత్ అధ్యక్ష హోదాలో ప్రత్యేకంగా ‘చైర్ స్టేట్‌మెంట్’ విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి నేతల సమావేశంలోనూ తలెత్తకుండా ముందస్తు కసరత్తు జరుగుతోంది. బ్రిక్స్ షెర్పాలు ఇప్పటికే సమావేశమై ఢిల్లీ డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం, పాలస్తీనా అంశాలపై ఎలాంటి పదజాలం ఉపయోగించాలన్నదే ప్రధాన చిక్కుగా మారింది.
ఇరాన్ డిమాండ్ ఇదీ..
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలను బ్రిక్స్ తీవ్రంగా ఖండించాలని ఇరాన్ కోరుతోంది. తమ సార్వభౌమత్వాన్ని సమర్థిస్తూ ప్రకటన చేయాలని పట్టుబడుతోంది. మరోవైపు యూఏఈ మాత్రం గల్ఫ్ ప్రాంతంలో సముద్ర భద్రత, వాణిజ్య నౌకలపై దాడులను నిరోధించడం, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. దీంతో ఒక దేశానికి అనుకూలంగా కనిపించే ఏ పదజాలమైనా మరో దేశం అభ్యంతరానికి దారితీసే అవకాశం ఉంది.
యూఏఈతో ఇరాన్‌కు పెరిగిన దూరం..
ఇరాన్-యూఏఈ సంబంధాలు ఇటీవలి నెలల్లో మరింత దిగజారాయి. గల్ఫ్‌లోని సముద్ర మార్గాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల ముప్పు ఉందని యూఏఈ ఆరోపించింది. ఆగస్టులో ఇరాన్‌తో వాణిజ్యం, వాణిజ్య లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మాత్రం యూఏఈపై క్షిపణులు ప్రయోగించిందన్న ఆరోపణలను ఖండించింది. ఆ ఘటన ‘ఫాల్స్ ఫ్లాగ్’ చర్య అయి ఉండొచ్చని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎవరికీ కోపం రాకుండా భారత్ వ్యూహం..!
ఈ నేపథ్యంలో భారత్ సున్నితమైన మధ్యవర్తిత్వ వైఖరిని అవలంబిస్తోంది. ఏ దేశాన్నీ నేరుగా తప్పుపట్టకుండా సార్వభౌమత్వానికి గౌరవం, బలప్రయోగానికి దూరంగా ఉండటం, గల్ఫ్‌లో నౌకాయాన స్వేచ్ఛ, ఉద్రిక్తతల తగ్గింపు, చర్చల ద్వారా పరిష్కారం వంటి అంశాలను డిక్లరేషన్‌లో పొందుపరిచే ప్రయత్నం చేస్తోంది. భారత్ దృష్టిలో ప్రధాన అంశం ఒక్కటే.. ప్రాంతీయ స్థిరత్వం. ఇరాన్ అయినా, యూఏఈ అయినా పరస్పరం దాడులకు దిగకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని నొక్కిచెప్పేలా భాషను రూపొందించాలని న్యూఢిల్లీ భావిస్తోంది.
ఆర్థిక అంశాలపైనే ఫోకస్..
భద్రతాపరమైన విభేదాలు బ్రిక్స్ అసలు లక్ష్యాలను పక్కదారి పట్టించకుండా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. జాతీయ కరెన్సీల్లో వాణిజ్యం, ఇంధన భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ నెట్‌వర్క్‌లు, ఇంధన మార్పిడి వంటి అంశాలపై చర్చ జరపాలని చూస్తోంది. అలాగే న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) ద్వారా చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపైనా దృష్టి సారించనున్నారు. బహుళపక్ష సంస్థల్లో సంస్కరణలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కూడా ఢిల్లీ డిక్లరేషన్‌లో చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..
ట్రంప్‌పై ఇరాన్ ఎంబసీ ట్రోల్.. అక్షయ్ కుమార్ 'మీమ్'తో పంచ్!