ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం.. గాలిలో ఉన్న హెలికాప్టర్‌పైకి ఎక్కి బాలుడి సాహసం!
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:57 PM
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది అనాథలు మారిపోయారు. విపత్తు జరిగి.. రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా అక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ బాలుడు చేసిన సాహసం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో రెండు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో గ్రామాలు తుడిచి పెట్టుకుని పోయాయి. వందలాది మంది జల సమాధి కాగా.. అనేక మందికి గల్లంతయ్యారు. ఈ విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో అనేక హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తాజాగా ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ బాలుడు చేసిన సాహసం అందరి మనసులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా నదులు ఉప్పొంగుతూ ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరద నీరు ఇళ్లను చుట్టుముట్టాయి. దీంతో ఆ ఇళ్లలో ఉన్న వారు బయటకు రాలేక.. తమను కాపాడే వారు వస్తారని ఎదురు చూస్తున్నారు. అలానే ఒక బాలుడు కూడా వరదల కారణంగా ఇంటి పైకప్పుపై చిక్కుకుపోయాడు. చుట్టూ వేగంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం కారణంగా కిందకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఆ బాలుడు భయాందోళనకు గురయ్యాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన రెస్క్యూ హెలికాప్టర్‌ను బాలుడు గమనించాడు. వెంటనే అప్రమత్తమైన ఆ చిన్నారి తన వద్ద ఉన్న టీ-షర్ట్‌ను తీసి గాల్లోకి ఊపాడు.
ఆ బాలుడిని గుర్తించిన నేపాల్ సైనిక దళానికి చెందిన హెలికాప్టర్ ఆ ఇల్లు ఉన్న ప్రాంతానికి చేరుకుని పైకప్పునకు సమీపంలో గాల్లోనే నిలిచింది. హెలికాప్టర్ మరింత దగ్గరకు రాగానే, బాలుడు ఎంతో ధైర్యంతో దాని అడుగు భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న సైనికుడు తన చేయి అందించి రక్షించడంతో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. నేపాల్‌లో వరద బాధితుల రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సైన్యం చేపట్టిన ఈ సాహసోపేత చర్యకు సంబంధించిన వీడియో నెటిజన్లను మనసును కదలించింది.
ఇవి కూడా చదవండి:
నా పేరు లేదని తెలిసి నవ్వొచ్చింది... కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన సూర్య