బలూచ్ లిబరేషన్ ఆర్మీలో కలకలం.. బషీర్ జెబ్పై వేటు..
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:36 PM
ఇస్లామాబాద్‌ను దాడులతో కలవరపరిచిన బలూచ్ లిబరేషన్ ఆర్మీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ కమాండర్ బషీర్ జెబ్ను నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించారు.
పాకిస్థాన్: ఇస్లామాబాద్‌ను దాడులతో కలవరపరిచిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ కమాండర్ బషీర్ జెబ్ను నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయనకు సంబంధించిన సైనిక, పరిపాలనా, విధానపరమైన అధికారాలను తాత్కాలికంగా సీనియర్ కమాండ్ కౌన్సిల్‌కు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని నవంబర్ 3న బీఎల్ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ ప్రకటించారు. అక్టోబర్ 16న జరిగిన కీలక సమావేశంలో నాయకత్వ మార్పుపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు జీయాంద్ వెల్లడించారు. అయితే, బషీర్ జెబ్ను తొలగించడానికి అసలు కారణాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.
2018లో బీఎల్ఏ బాధ్యతలను బషీర్ జెబ్ చేపట్టారు. అప్పటి నుంచి పాకిస్థాన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో ఆ సంస్థ దాడులకు పాల్పడింది. ముఖ్యంగా, 2025లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాకింగ్ ఘటనతో అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. అయితే, 2026లో చేపట్టిన హెరోఫ్-2 ఆపరేషన్ తర్వాత సంస్థలో విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో సాయుధులను ఒకేసారి రంగంలోకి దించడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని, ఈ వ్యూహంపై మజీద్ బ్రిగేడ్ అధిపతి రహ్మాన్ గుల్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు, మహిళా ఆత్మాహుతి దాడుల వినియోగం కూడా బషీర్ జెబ్ నాయకత్వంపై విమర్శలకు కారణమైంది. ఈ విధానాల వల్ల బలూచ్ ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, బషీర్ జెబ్పై విషప్రయోగం జరిగిందని, చికిత్స కోసం భారత్‌కు తరలించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను నిర్ధారించే ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. మొత్తంగా బషీర్ జెబ్ తొలగింపు బీఎల్ఏలో అంతర్గత విభేదాలు, నాయకత్వ సంక్షోభంపై కొత్త చర్చకు తెరతీసింది. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారు? ఈ మార్పు సంస్థ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సరికొత్త చరిత్ర.. యూఎస్ కాంగ్రెస్‌కు 102 మంది డెమోక్రటిక్ మహిళలు
కరాచీ సమీపంలో లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ.. సముద్ర దాడులకు ప్లాన్ వేశారా..