Share News

కరాచీ సమీపంలో లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ.. సముద్ర దాడులకు ప్లాన్ వేశారా..

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:09 PM

పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మరోసారి సముద్ర మార్గంలో దాడులకు సిద్ధమవుతోందా? నిఘా వర్గాల నుంచి వెలువడిన తాజా సమాచారం ఈ అనుమానాలను పెంచుతోంది.

కరాచీ సమీపంలో లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ.. సముద్ర దాడులకు ప్లాన్ వేశారా..
Charna Island

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మరోసారి సముద్ర మార్గంలో దాడులకు సిద్ధమవుతోందా? నిఘా వర్గాల నుంచి వెలువడిన తాజా సమాచారం ఈ అనుమానాలను పెంచుతోంది. కరాచీకి సమీపంలోని చర్నా ద్వీపంలో లష్కరే ఉగ్రవాదులకు సముద్ర కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఈ శిక్షణను పర్యాటక కార్యకలాపాల ముసుగులో నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. స్కూబా డైవింగ్, కాంబాట్ స్విమ్మింగ్, నీటి అడుగున కార్యకలాపాలకు సంబంధించిన నైపుణ్యాలను వారికి నేర్పిస్తున్నట్లు సమాచారం (Lashkar-e-Taiba Scuba Diving Training).


పాకిస్థాన్‌లోని కరాచీకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో చర్నా ద్వీపం ఉంది. ప్రకృతి అందాలకు, సముద్రంలో సాహస క్రీడలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కోసం పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి ప్రాంతాన్ని ఎంచుకుని పర్యాటకుల ముసుగులో శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాకిస్థాన్‌కు చెందిన మార్కజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) సభ్యులు శిక్షకులుగా వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి (Maritime Terrorism).


2008 నవంబర్ 26న లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో కూడా ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లోని మంగ్లా డ్యామ్ వద్ద శిక్షణ ఇచ్చినట్లు వెల్లడైంది. ఇప్పుడు మరోసారి సముద్ర కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ జరుగుతున్నట్లు సమాచారం రావడం భారత భద్రతా సంస్థల్లో ఆందోళన కలిగిస్తోంది. సముద్ర మార్గం ద్వారా ఎదురయ్యే ముప్పుపై భారత భద్రతా సంస్థలకు పూర్తి సమాచారం ఉందని, ఎలాంటి ప్రమాదం ఎదురైనా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని నిఘా వర్గాలు తెలిపాయి (26/11 Mumbai Attacks).


మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో కూడా లష్కరే తోయిబా కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. యువతను సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షించి ఉగ్రవాదంలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ అధికారులు ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డిజిటల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..


ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

Updated Date - Nov 06 , 2026 | 07:01 PM