బంగారం అనుకుని దాచుకున్నాడు.. చివరకు ఊహించని ట్విస్ట్!
ABN , Publish Date - Nov 29 , 2026 | 09:20 PM
బంగారం కోసం వెతికిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతడికి దొరికిన ఓ బరువైన రాయి బంగారంగా భావించగా.. సుమారు 460 కోట్ల సంవత్సరాల పురాతన ఉల్క అని తెలియడంతో ఆశ్చర్యపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది బంగారం, వజ్రాలు వంటి వాటి కోసం పొలాల్లో, కొండల్లో తవ్వకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో దొరికే వస్తువులు కొన్నిసార్లు వారు ఊహించిన దానికంటే అత్యంత ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో అసలు పనికి రాని వస్తువులుగా మిగులుతాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. తనకు దొరికిన ఒక రాయిని బంగారం భావించాడు. తీరా అది సుమారు 460 కోట్ల సంవత్సరాల పురాతన ఉల్క అని తెలియడంతో ఆశ్చర్యపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఆస్ట్రేలియాలోని సెంట్రల్ విక్టోరియాలో ఉన్న మేరీబరో రీజినల్ పార్క్‌లో 2015లో డేవిడ్ హోల్ అనే వ్యక్తి మెటల్ డిటెక్టర్‌తో బంగారం కోసం వెతుకుతుండగా 17 కిలోల బండరాయిని కనిపించింది. ఆ ప్రాంతం 19వ శతాబ్దంలో బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన గోల్డ్‌ఫీల్డ్స్ పరిధిలో ఉండటంతో, రాయి లోపల భారీ బంగారు కడ్డీ ఉందని హోల్ ఎంతో ఆశపెట్టుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి రాయిని పగలగొట్టేందుకు రాక్ సా, యాంగిల్ గ్రైండర్, డ్రిల్ ఉపయోగించాడు. చివరకు యాసిడ్ పోసినా, భారీ సుత్తితో కొట్టినా రాయి చెక్కుచెదరలేదు. విఫలమైన ప్రయత్నాల అనంతరం 2018లో దాన్ని మెల్బోర్న్ మ్యూజియంలోని భూగర్భ శాస్త్రవేత్తలు డెర్మోట్ హెన్రీ, బిల్ బిర్చ్ వద్దకు తీసుకెళ్లాడు.
రాయి బరువు సాధారణ రాళ్ల కంటే చాలా ఎక్కువగా ఉండటం, అది అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్క కావచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. మ్యూజియంలోని 37 ఏళ్ల అనుభవంలో వేలాది రాళ్లను పరిశీలించగా, కేవలం రెండే నిజమైన ఉల్కలుగా తేలాయని, వాటిలో ఇదీ ఒకటని హెన్రీ పేర్కొన్నారు. డైమండ్ సాతో చిన్న భాగాన్ని కత్తిరించి పరీక్షించగా.. ఇది ‘హెచ్5 ఆర్డినరీ కాండ్రైట్’ (H5 ordinary chondrite) రకపు ఉల్కగా నిర్ధారించారు. హెచ్5 ఆర్డినరీ కాండ్రైట్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. సుమారు 17 కిలోల బరువున్న దీనికి ‘మేరీబరో ఉల్క’గా నామకరణం చేశారు.
ఇది 4.6 బిలియన్ ఏళ్ల క్రితం అంటే 460 కోట్ల సంవత్సరం నాటిదని, అంగారకుడు–బృహస్పతి మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది భూమిపైకి ఎప్పుడు వచ్చిందో కచ్చితంగా తెలియకపోయినప్పటికీ... వెయ్యి సంవత్సరాల లోపే అయి ఉండొచ్చని కార్బన్ డేటింగ్ ద్వారా గుర్తించారు. విక్టోరియాలో గుర్తించిన ఉల్కల్లో ఇది రెండో అతిపెద్ద కాండ్రైటిక్ ఉల్క కావడం విశేషం. ప్రస్తుతం ఇది మ్యూజియమ్స్ విక్టోరియా సంరక్షణలో ఉంది.
ఇవి కూడా చదవండి:
ఇంద్రకీలాద్రికి మరోసారి అగ్రస్థానం.. ఐదోసారీ నంబర్-1గానే..
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ సంగీత విభావరి విజయవంతం
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నిక..