ఇంద్రకీలాద్రికి మరోసారి అగ్రస్థానం.. ఐదోసారీ నంబర్-1గానే..
ABN , Publish Date - Nov 29 , 2026 | 08:54 PM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తుల సంతృప్తిలో అరుదైన ఘనత సాధించింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా సేకరించిన భక్తుల అభిప్రాయాల్లో నవంబర్ నెలకు సంబంధించి 76.6 శాతం సంతృప్తి నమోదు చేసుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
అమరావతి, నవంబర్ 29: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తుల సంతృప్తిలో అరుదైన ఘనత సాధించింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా సేకరించిన భక్తుల అభిప్రాయాల్లో నవంబర్ నెలకు సంబంధించి 76.6 శాతం సంతృప్తి నమోదు చేసుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది వరుసగా ఐదోసారి ప్రథమ స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించింది. 2026 నవంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
గత నెలతో పోలిస్తే భక్తుల నుంచి వచ్చిన సానుకూల స్పందన 3.4 శాతం పెరగడం దేవస్థానం సేవల మెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవల నిర్వహణలో ఆలయ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు ఈ ఫలితాలు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ.. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల నిర్వహణ, నాణ్యమైన ప్రసాదాల తయారీ, ఆలయ పరిసరాల పరిశుభ్రత, తాగునీటి వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.
ఇటీవలి కాలంలో ఇటీవల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆలయంలో స్థలాభావం సమస్యలు ఎదురవుతున్నాయని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా వినియోగించుకున్నామని, అవసరమైన చిన్నచిన్న మార్పులు, ఏర్పాట్లతో సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సేవల నాణ్యతను కొనసాగిస్తామని ఈఓ శీనా నాయక్ స్పష్టం చేశారు. మరోవైపు, వరుసగా ఐదోసారి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానం దక్కడం పట్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది: చింతా మోహన్
పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు.. అవమానంతో రెచ్చిపోతున్న వైసీపీ..!
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి