ఆన్‌లైన్ భద్రతపై ఆస్ట్రేలియా కొత్త చట్టం.. టెక్ సంస్థలకు 5% జరిమానా!
ABN , Publish Date - Nov 25 , 2026 | 07:10 PM
ఆన్‌లైన్‌లో వినియోగదారులకు హాని కలిగించే అంశాలను అరికట్టడంలో విఫలమయ్యే టెక్నాలజీ సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. ఈ సంస్థలపై బిలియన్ల డాలర్ల జరిమానాలు విధించేలా ఆస్ట్రేలియా పార్లమెంట్ కీలక చట్టాన్ని ఆమోదించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో వినియోగదారులకు హాని కలిగించే అంశాలను అరికట్టడంలో విఫలమయ్యే టెక్నాలజీ సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. ఈ సంస్థలపై బిలియన్ల డాలర్ల జరిమానాలు విధించేలా ఆస్ట్రేలియా పార్లమెంట్ కీలక చట్టాన్ని ఆమోదించింది. ‘డిజిటల్ డ్యూటీ ఆఫ్ కేర్’ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ(బుధవారం) ప్రతినిధుల సభలోనూ 97–43 ఓట్ల తేడాతో ఆమోదముద్ర పడింది. సెనెట్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో, ‘గ్రీన్స్’ పార్టీతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రభుత్వం ఈ బిల్లును నెగ్గించుకుంది.
గేమింగ్ వేదికలు, యాప్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌లతో సహా విస్తృతమైన ఆన్‌లైన్ సేవలకు ఈ చట్టం కనీస భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తుంది. తీవ్రమైన హానికర కంటెంట్, వ్యవహారాల నుంచి ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను కాపాడే బాధ్యత సంస్థలపై ఉంటుంది. తొలుత ప్రభుత్వం గరిష్ఠ జరిమానాను 109 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.671 కోట్లు) ప్రతిపాదించింది. గ్రీన్స్ పార్టీ సవరణలతో టెక్నాలజీ సంస్థల ప్రపంచవ్యాప్త ఆదాయంలో 5 శాతం వరకు పెంచారు. దీంతో అగ్రశ్రేణి టెక్ దిగ్గజాలకు భారీ ఆర్థిక ముప్పు ఏర్పడింది.
నిబంధనలు ఉల్లంఘించిన ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారులు నేరుగా కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు, అల్గారిథమ్ సిఫార్సులను నిలిపివేసుకునే (ఆప్ట్-అవుట్) అవకాశం, అభ్యంతర కర చిత్రాలు సృష్టించే సేవలపై కఠిన చర్యలు, మెరుగైన గోప్యతా రక్షణ వంటి అంశాలను ఇందులో చేర్చారు. 12 నెలల పరివర్తన కాలం తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఈయూ ‘డిజిటల్ సర్వీసెస్ యాక్ట్’, బ్రిటన్ ‘ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్’ తరహాలో ఈ నిర్ణయం నిలిచింది. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సంస్థలపై జవాబుదారీతనం పెంచడమే ఈ చట్టం ఉద్దేశమని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు. అయితే, వాక్ స్వాతంత్ర్యంపై ప్రభావం పడుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్