Share News

అద్వితీయ వైభవం

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:01 AM

వన్డేల్లో 50 బంతుల్లో శతకం బాదితే వావ్‌.. అదే 150 రన్స్‌ కొడితే గొప్ప.. కానీ డబుల్‌ సెంచరీని ఊహిస్తామా..? అది కూడా 250 రన్స్‌ఛేదనలో అంటే నమ్మగలమా?.. కానీ అలాంటి అసాధ్యాలను...

అద్వితీయ వైభవం

52 బంతుల్లోనే దో సౌ

28 సిక్సర్లతో ప్రపంచ రికార్డు

28 బంతుల్లో100

  • 14.2 ఓవర్లలోనే 250 రన్స్‌ ఛేదన

  • సెమీస్‌కు భారత్‌ ‘ఎ’

  • యూఈఏపై ఘనవిజయం

రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్‌ తిందువా? మావాడి వేడి నాటు దెబ్బ సూత్తువా? అన్నట్టుగానే సాగింది వైభవ్‌ సూర్యవంశీ వీర విజృంభణ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో యూఏఈ తో జరిగిన మ్యాచ్‌లో! క్రీజులో ఉన్నంతసేపూ సిక్స్‌లు, ఫోర్లతో బౌలర్లను చెడుగుడాడేసుకున్న వైభవ్‌ 52 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ కొట్టాడు. వైభవ్‌ చేసిన 204 పరుగుల్లో 7 ఫోర్లు, 28 సిక్సులున్నాయ్‌! అంటే 196 రన్స్‌ బౌండరీలతోనే వచ్చాయన్న మాట! అన్నట్టు.. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ, డబుల్‌ సెంచరీ కూడా!

వన్డేల్లో 50 బంతుల్లో శతకం బాదితే వావ్‌.. అదే 150 రన్స్‌ కొడితే గొప్ప.. కానీ డబుల్‌ సెంచరీని ఊహిస్తామా..? అది కూడా 250 రన్స్‌ఛేదనలో అంటే నమ్మగలమా?.. కానీ అలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేయడానికే తానున్నానంటూ.. మన క్రికెట్‌ చిన్నోడు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి అద్భుతం ఆవిష్కరించాడు. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో యూఏఈ జట్టుపై 52 బంతుల్లోనే దిశ్వతకం కొట్టి వండర్‌బాయ్‌గా తన పేరును సార్థకం చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో బౌండరీలతోనే 196 రన్స్‌ కొల్లగొట్టిన 15 ఏళ్ల వైభవ్‌.. ఏకంగా 28 సిక్సర్లు బాదడంతో పాటు లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ, డబుల్‌ సెంచరీ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

దోహా: చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (53 బంతుల్లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 204) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. క్రికెట్‌ ప్రపంచాన్ని మైమరపింపజేస్తూ ఆసియాకప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో తుఫాన్‌ వేగంతో డబుల్‌ సెంచరీ బాదేశాడు. దీంతో యూఏఈపై ఏడు వికెట్లతో గెలిచిన భారత్‌ ‘ఎ’ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో చోటు కోసం గురువారం శ్రీలంక ‘ఎ’తో తలపడనుంది. ముందుగా యూఏఈ 50 ఓవర్లలో 249/8 స్కోరు చేసింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ (130) సెంచరీ సాధించగా, బాసిల్‌ హమీద్‌ (36 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు. అర్షద్‌ ఖాన్‌కు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో వైభవ్‌ సునామీ ఇన్నింగ్స్‌ ధాటికి భారత్‌ ‘ఎ’ 14.2 ఓవర్లలోనే 254/3 స్కోరుతో లక్ష్యాన్ని అత్యంత అలవోకగా ఛేదించింది. ఇక, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వైభవ్‌ ద్విశతకంలో 8 పరుగులే సింగిల్స్‌ కావడం గమనార్హం.


బౌలర్లకు చుక్కలే..: 26, 11.. ఇప్పటిదాకా ఈ టోర్నీలో ఓపెనర్‌ వైభవ్‌ స్కోర్లివి. శుభారంభాలు అందించలేక తీవ్ర ఒత్తిడిలో యూఏఈపై బరిలోకి దిగిన ఈ చిన్నోడు తన బ్యాట్‌ పవరేంటో చూపాడు. తొలి ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో ఎదురుదాడి ఆరంభించిన వైభవ్‌ దాదాపు మ్యాచ్‌ గెలిచే వరకు బ్యాట్‌ ఝుళిపించడం ఆపలేదు. బౌలర్‌ ఎవరైనా చూపు ఆకాశంపైనే అన్నట్టుగా అతడి సిక్సర్ల జోరు సాగింది. 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. ఇందులో 8 సిక్సర్లుండడం విశేషం. అభిషేక్‌ (12), ప్రభ్‌సిమ్రన్‌ (3) త్వరగానే అవుటైనా అతను మాత్రం బాదుడు ఆపలేదు. 5 ఓవర్లలో జట్టు స్కోరు వందకు చేరడంతో ఇక మ్యాచ్‌ ఫలితం ఖాయమైంది. ఏడో ఓవర్‌లో అయితే 6,4,4,6,6,4తో 30 రన్స్‌ రాబట్టి 28 బంతుల్లోనే శతకం కూడా పూర్తి చేశాడు. ఇదే ఊపులో వైభవ్‌ 40 బంతుల్లో 150 రన్స్‌ కూడా కానిచ్చాడు. 163 పరుగుల దగ్గర తన క్యాచ్‌ను యూఏఈ ఆటగాళ్లు వదిలేయడంతో, మరింత చెలరేగిన వైభవ్‌ 12వ ఓవర్‌లో 6,6,6,6,4తో 28 రన్స్‌ అందించాడు. మరో రెండు వరుస సిక్సర్లతో రికార్డు డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే విజయానికి 4 పరుగుల దూరంలో వైభవ్‌ అవుట్‌ కాగా.. రింకూ సింగ్‌ (27 నాటౌట్‌)తో మూడో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మరో 214 బంతులుండగానే భారత్‌ మ్యాచ్‌ను ముగించింది.


స్కోరుబోర్డు

యూఏఈ: ఆర్యాన్ష్‌ (సి) కుశాగ్ర (బి) హర్షిత్‌ 2, అన్ష్‌ టాండన్‌ (సి) అభిషేక్‌ (బి) అర్షద్‌ 8, హర్‌ప్రీత్‌ (బి) అర్షద్‌ 130, షహదాద్‌ (ఎల్బీ) దూబే 28, డిసౌజా (సి) హర్షిత్‌ (బి) షాబాజ్‌ 25, అఫ్తాబ్‌ (సి) సూర్యాన్ష్‌ (బి) అర్షద్‌ 2, బాసిల్‌ (నాటౌట్‌) 36, ఇబ్రార్‌ (సి) తిలక్‌ (బి) అర్షద్‌ 0, జహీద్‌ (సి) తిలక్‌ (బి) సూర్యాన్ష్‌ 7, ఉద్దిష్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 249/8; వికెట్ల పతనం: 1-2, 2-20, 3-91, 4-151, 5-154, 6-220, 7-220, 8-243; బౌలింగ్‌: హర్షిత్‌ 10-0-63-1, అర్షద్‌ 10-0-43-4, సూర్యాన్ష్‌ 10-0-48-1, హర్ష్‌ దూబే 7-0-28-1, తిలక్‌ 4-0-21-0, రింకూ 5-0-22-0, షాబాజ్‌ 4-0-23-1.

భారత్‌ ‘ఎ’: వైభవ్‌ (సి) ఆర్యాన్ష్‌ (బి) బాసిల్‌ 204, అభిషేక్‌ (ఎల్బీ) ఇబ్రార్‌ 12, ప్రభ్‌సిమ్రన్‌ (సి) అఫ్తాబ్‌ (బి) జహీద్‌ 3, రింకూ (నాటౌట్‌) 27, కుశాగ్ర (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 14.2 ఓవర్లలో 254/3; వికెట్ల పతనం: 1-68, 2-108, 3-245; బౌలింగ్‌: జహీద్‌ 4-0-52-1, ఇబ్రార్‌ 3-0-71-1, బాసిల్‌ 3.2-0-59-1, సిమ్రన్‌జీత్‌ 2-0-22-0, ఉద్దిష్‌ 2-0-48-0.

1

లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 (28 బంతుల్లో), 150 (40 బంతుల్లో), 200 (52 బంతుల్లో) పరుగులు సాధించిన క్రికెటర్‌గా వైభవ్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడి(15 ఏళ్ల 242 రోజులు)గా కూడా వైభవ్‌ నిలిచాడు. ఇక, వేగవంతమైన అర్ధ శతకం (11 బంతుల్లో, శ్రీలంక ‘ఎ’పై) రికార్డు కూడా ఇదివరకే వైభవ్‌ అందుకున్నాడు.

1

ఏ ఫార్మాట్‌లోనైనా ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (28) బాదిన బ్యాటర్‌గా వైభవ్‌ రికార్డుకెక్కాడు. తొలి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు (183) చేసిన జట్టుగా భారత్‌ ‘ఎ’ నిలిచింది. లిస్ట్‌ ‘ఎ’ వన్డేల్లో ఓ జట్టు (భారత్‌) 5 ఓవర్లలోనే 100 రన్స్‌ చేయడం ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 25 , 2026 | 06:01 AM