Share News

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి!

ABN , Publish Date - May 24 , 2026 | 11:53 AM

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. క్వెట్టా- చమన్ గేట్ సమీపంలో ఓ ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది.

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి!
Pakistan train attack

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. క్వెట్టా- చమన్ గేట్ సమీపంలో ఓ ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించగా.. 47 మందికి తీవ్రగాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.


స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. పాక్ ఆర్మీకి భారీగా ప్రాణ నష్టం జరగాలనే లక్ష్యంతో రైలు వెళ్తున్న క్రమంలో వ్యూహం ప్రకారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి కచ్చితమైన కారణం, ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి గుర్తింపుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌‌లో పాకిస్థాన్ సైన్యం క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పెషావర్‌కు వెళ్తున్నారనే సమాచారంతో ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బీఎల్ఏ తన ప్రకటనలో పేర్కొంది.


ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని, సమీపంలోని భవనాల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న అనేక వాహనాలు కూడా ఈ ధాటికి దెబ్బతిన్నాయి. ఈ పేలుడులో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక బోగీకి మంటలు అంటుకున్నాయని స్థానిక నివేదికలు తెలిపాయి. బలూచిస్థాన్ హోం వ్యవహారాల ప్రత్యేక సహాయకుడు బాబర్ యూసఫ్‌జాయ్ మాట్లాడుతూ.. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని, ధృవీకరణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున్న, పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో గుమిగూడవద్దని ఆయన నివాసితులను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైట్‌హౌస్‌ దగ్గర కలకలం.. భద్రతా దళాల కాల్పుల్లో దుండగుడి మృతి

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..

Updated Date - May 24 , 2026 | 12:19 PM