వైట్ హౌస్ వద్ద కాల్పులకు తెగపడిన వ్యక్తిని గుర్తించిన అధికారులు..
ABN , Publish Date - May 24 , 2026 | 08:33 AM
అమెరికాలోని వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్ద శనివారం నాడు కాల్పులు జరిపిన వ్యక్తిని నసీర్ బెస్ట్(21)గా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. మృతుడి మానసిక పరిస్థితిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
న్యూయార్క్: వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్ద శనివారం నాడు కాల్పులకు తెగపడిన వ్యక్తిని నసీర్ బెస్ట్(21)గా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. మృతుడి మానసిక పరిస్థితిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నసీర్ బెస్ట్ తనని తాను ఏసుక్రీస్తు మరో అవతారమని నమ్మేవాడని కేసు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే దాడికి దిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
గతంలో వైట్ హౌస్ ప్రాంతంలో నసీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తిరిగేవాడు. గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌస్ పాదచారుల నియంత్రణ కేంద్రంలోకి ప్రవేశించడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు అతను రెండుసార్లు అరెస్టు అయ్యాడు. అప్పుడు నసీర్ బెస్ట్‌ను వాషింగ్టన్ డీసీ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకోగా వింతగా ప్రవర్తించాడు. తాను యేసుక్రీస్తు ఆధునిక అవతారమని, అందుకే అరెస్టు కావాలని కోరుకున్నానని వారికి చెప్పాడు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. వైట్ హౌస్ ప్రాంగణానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ వైట్ హౌస్ ప్రాంతానికి బెస్ట్ వెళ్లి కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ స్పందించారు. అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని.. ఏ ఉద్దేశంతో దాడి చేశాడో ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
శనివారం సాయంత్రం 6 గంటలకు నార్త్‌వెస్ట్‌లోని 17వ వీధిలో వింతగా ప్రవర్తిస్తున్న బెస్ట్‌ను సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అతను తన బ్యాగ్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో నసీర్ బెస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైట్‌హౌస్ దగ్గర కలకలం.. భద్రతా దళాల కాల్పుల్లో దుండగుడి మృతి
అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..