ఆంథ్రోపిక్ షేరు జోరు
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:11 AM
క్లాడ్’ కృత్రిమ మేధ(ఏఐ) చాట్‌బాట్‌ను తయారుచేసిన అమెరికా సంస్థ ఆంథ్రోపిక్ షేర్లు గురువారం నాస్‌డాక్‌లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
నాస్‌డాక్‌లో ఐపీవో ధర కంటే 34 శాతం ఎక్కువకు ప్రారంభం
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో
భారీ ఖర్చుల ఒప్పందాలే అసలు సవాల్
‘ప్రమాద’ హెచ్చరికలు హైప్ కోసమేనా?
(సెంట్రల్ డెస్క్)
‘క్లాడ్’ కృత్రిమ మేధ(ఏఐ) చాట్‌బాట్‌ను తయారుచేసిన అమెరికా సంస్థ ఆంథ్రోపిక్ షేర్లు గురువారం నాస్‌డాక్‌లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఐపీవోలో ఒక్కో షేరును 83 డాలర్లకు అమ్మగా, తొలి ట్రేడ్ 111.50 డాలర్ల వద్ద జరిగింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా సమీకరించిన 8,130 కోట్ల డాలర్లతో జూన్‌లో స్పేస్ ఎక్స్ నెలకొల్పిన రికార్డును దాటి, ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలిచింది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్లు డిమాండ్ రావడంతో కంపెనీ ధరను, అమ్మే షేర్ల సంఖ్యను పెంచింది. డబ్బు సమీకరణలో ఆంథ్రోపిక్ గెలిచింది. కానీ ఏఐ కోసం పెడుతున్న భారీ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలదా అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు.
ఖర్చులే అసలు భారం
ఏఐ వ్యాపారం సాధారణ సాఫ్ట్‌వేర్‌లా తక్కువ ఖర్చుతో నడవదు. ఒక్కో ప్రశ్నకు జవాబివ్వడానికి వేల చిప్‌లు, భారీ డేటా సెంటర్లు, విపరీతమైన విద్యుత్ కావాలి. విద్యుత్ సంస్థ ఏళ్ల తరబడి బోగ్గును ముందే బుక్ చేసుకున్నట్లు, ఆంథ్రోపిక్ కూడా రాబోయే ఏళ్లకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ముందే బుక్ చేసుకుంది. ఈ ఒప్పందాల విలువ ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల ఆదాయానికి దాదాపు 27 రెట్లు. ఇందులో ఎక్కువ భాగం కంప్యూటింగ్ వాడినా వాడకపోయినా చెల్లించాల్సిందే. కస్టమర్లు మాత్రం స్వల్ప నోటీసుతో ఒప్పందాలను రద్దు చేసుకోవచ్చు. ఈ అసమతుల్యతను కంపెనీయే తన ఐపీవో పత్రాల్లో అంగీకరించింది.
హెచ్చరికలా? హైప్‌లా?
తమ సాంకేతికత అత్యంత శక్తిమంతమైనదని, దుర్వినియోగమైతే ప్రమాదకరమని ఆంథ్రోపిక్ పదేపదే చెబుతోంది. తన శక్తిమంతమైన ‘మిథోస్’ మోడల్‌ను కొన్ని ఎంపిక చేసిన సంస్థలకే పరిమితం చేసింది. సరైన రక్షణలు లేకుంటే ఏఐ మానవాళికి పెను ముప్పు కాగలదని ఐపీవో పత్రాల్లోనే హెచ్చరించింది. ఇదంతా అమ్మకపు ఎత్తుగడేనని విమర్శకుల వాదన. ‘ఎంత ప్రమాదకరం అంటే అంత శక్తిమంతం’ అన్న భావన మదుపరులను, కార్పొరేట్ కస్టమర్లను ఆకర్షిస్తుందని వారు అంటున్నారు. ఐపీవోకు కొన్ని వారాల ముందు జరిగిన రాజీనామాలు ఈ చర్చను వేడెక్కించాయి. సెప్టెంబర్ 9న రాజీనామా చేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఎక్స్‌లో ఒక ఆరోపణ చేశారు. ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ కోసం పోటీ పడుతూ ‘‘మన ప్రాణాలతో జూదమాడుతున్నాయి’’ అన్నారు. తన హెచ్చరిక మార్కెటింగ్ స్టంట్ కాదని స్పష్టం చేశారు. అదే రోజు సంస్థ అలైన్‌మెంట్ సైన్స్ విభాగం అధిపతి, ఏఐ వల్ల మానవ నాగరికత అంతరించే అవకాశం పది శాతానికి పైగా ఉందని అంచనా వేశారు. ఈ పరిణామాలు ఏఐ శక్తిపై హైప్‌ను పెంచాయని కొందరు విమర్శకులు అంటున్నారు. కాక్సన్ పోస్టుల వెనక ఒక పీఆర్ సంస్థ ఉండి ఉండవచ్చని ఒక టెక్ వెబ్‌సైట్ ఆరోపించింది. కానీ దానికి బహిరంగ ఆధారాలేవీ బయటకు రాలేదు. మరోవైపు, ఆంథ్రోపిక్ ‘పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్’గా నమోదైంది. వాటాదారుల లాభంతో పాటు ప్రజా ప్రయోజనాన్నీ పట్టించుకోవాలన్నది దానికి చట్టపరమైన బాధ్యత. యుద్ధ అవసరాలకు తన ఉత్పత్తుల వాడకంపై సంస్థ అమెరికా సైన్యంతో వివాదానికి దిగింది. లాభం కంటే బాధ్యతకే ప్రాధాన్యమిచ్చిందనడానికి దాని మద్దతుదారులు దీన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ‘‘అత్యంత కష్టమైన భద్రతా పని ఇంకా ముందే ఉంది’’ అని లిస్టింగ్ సందర్భంగా సీఈవో డారియో అమోడీ అన్నారు.
అసలు పరీక్ష ముందుంది
ఆంథ్రోపిక్ ఐపీవో రెండు కథలు చెబుతోంది. తొలి రోజు మార్కెట్ స్పందన, వేగంగా పెరుగుతున్న ఆదాయం చూస్తే వ్యాపార నమూనా పని చేస్తున్నట్లే కనిపిస్తుంది. కానీ భారీ బకాయిలు, తిరిగి మొదలైన నిర్వహణ నష్టం, ఎప్పుడైనా వెళ్లిపోగల కస్టమర్లను చూస్తే పెట్టుబడిని రాబట్టుకోగలదని ఇంకా రుజువు కాలేదు. తొలి రోజు జోరు కంటే రాబోయే త్రైమాసిక ఫలితాలే అసలు పరీక్ష.
ఒకవైపు వెలుగు, మరోవైపు నీడ
ఏడాదిలో ఆదాయం 13 రెట్లు పెరిగింది. కంప్యూటింగ్‌పై పెట్టే ప్రతి డాలర్‌కు రెండు డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది. ఆదాయంలో ఎక్కువ భాగం కార్పొరేట్ కస్టమర్ల నుంచే వస్తోంది. కోడ్ రాయడం, కంపెనీల పనులను దశల వారీగా తానే పూర్తి చేయడం క్లాడ్ బలం. కానీ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వ్యాపార నిర్వహణలో తిరిగి నష్టం వచ్చింది. డిమాండ్ ఊహించిన దానికంటే పెరగడంతో అదనపు కంప్యూటింగ్‌ను ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది. ఆదాయంలో పావు వంతు కేవలం ఐదుగురు పెద్ద కస్టమర్ల నుంచే వస్తోంది. ధరల పోటీ ముదిరినా, కంపెనీలు ఏఐపై ఖర్చు తగ్గించుకున్నా బకాయిల భారమే అసలు సమస్యగా మారుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన