చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్..
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:09 PM
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చిక్కుల్లో పడ్డారు. టర్కీలోని అంతల్యాలో జరుగుతున్న సీవోపీ 31 అంతర్జాతీయ వాతావరణ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 14: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చిక్కుల్లో పడ్డారు. టర్కీలోని అంతల్యాలో జరుగుతున్న సీవోపీ 31 (COP31) అంతర్జాతీయ వాతావరణ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆల్బనీస్, ఆస్ట్రేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బోవెన్ మధ్య సరదా సంభాషణకు సంబంధించిన వ్యాఖ్యలు మైక్రోఫోన్‌లో రికార్డై బయటకు వచ్చాయి. వీటిని స్థానిక జాతీయ మీడియా ప్రసారం చేయడంతో తీవ్ర చర్చకు దారితీశాయి.
సీవోపీ 31 అంతర్జాతీయ వాతావరణ సదస్సు ప్రారంభం కావడానికి ముందు వేదికపై అల్బనీస్, క్రిస్ బోవెన్ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్‌ను గుండెకు దగ్గరగా పెట్టుకోవద్దని, దాని వల్ల గుండె స్పందనపై ప్రభావం ఉండవచ్చని క్రిస్ బోవెన్‌కు అల్బనీస్ సూచించారు. దీనికి స్పందించిన బోవెన్.. ఫోన్‌ను గుండె దగ్గర పెట్టుకోవడం కంటే ప్యాంటు జేబులో పెట్టుకోవడంపైనే తనకు ఎక్కువ ఆందోళన ఉందని సరదాగా అన్నారు. దీంతో ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. అయితే, ఈ సంభాషణను అక్కడి మైక్రోఫోన్ రికార్డు చేసింది. ఆ వీడియోను ఆస్ట్రేలియా జాతీయ మీడియా ప్రసారం చేయడంతో వీరి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కాగా, దీనిపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, సమావేశాల మధ్య ఇద్దరు సహచరులు సరదాగా మాట్లాడుకున్నారని వివరణ ఇచ్చింది. ఇది అధికారిక ప్రకటనలో భాగం కాదని స్పష్టం చేసింది. మరోవైపు, ఆస్ట్రేలియా వాతావరణ విధానాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చలకు నాయకత్వం వహిస్తూనే, మరోవైపు ప్రపంచంలోని ప్రధాన శిలాజ ఇంధన ఎగుమతిదారుల్లో ఒకటిగా ఆస్ట్రేలియా కొనసాగుతుండటంపై పర్యావరణవేత్తలు, సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
నగ్న ఫొటోలు పంపిన పాక్ యువతి.. ఐఏఎఫ్ రహస్యాలు లీక్..!
క్రూయిజ్ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. తప్పిన పెను ముప్పు