ఘనంగా ఖమేనీ అంతిమయాత్ర.. ఫైటర్ జెట్ల పహారాలో మష్హద్ చేరిన భౌతికకాయం
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:58 PM
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వస్థలమైన మష్హద్‌లో ముగిశాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో గత ఆరు రోజులుగా సాగుతున్న సుదీర్ఘ అంతిమయాత్ర ఈ సాయంత్రం జరిగిన ఖననంతో ముగిసింది.
టెహ్రాన్/మష్హద్ జులై 9: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇవాళ (గురువారం)ఆయన స్వస్థలమైన తూర్పు పవిత్ర నగరం మష్హద్ (Mashhad)లో ముగిశాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో గత ఆరు రోజులుగా సాగుతున్న సుదీర్ఘ అంతిమయాత్ర ఈ సాయంత్రం జరిగిన ఖననంతో ముగిసింది.
అంతకుముందు, ఖమేనీ శవపేటికను తీసుకెళ్తున్న విమానానికి ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు గాల్లో రక్షణగా (Escort) పహారా కాస్తూ మష్హద్ నగరానికి తీసుకువచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను సుప్రీం లీడర్ అధికారిక వెబ్‌సైట్ విడుదల చేసింది.
ఆరు రోజుల అంతిమయాత్ర.. ఇరాక్ నుంచి మష్హద్ వరకు
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత జూలై 4న ప్రారంభమైన ఈ అంతిమయాత్రలో భాగంగా ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్, మత కేంద్రమైన ఖోమ్ నగరాలతో పాటు ఇరాక్‌లోని షియా పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలా గుండా ఊరేగించారు. ఈ నగరాల్లో లక్షలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించారు.
దివంగత సుప్రీం లీడర్ శవపేటికతో పాటు ఫిబ్రవరి 28 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబ సభ్యుల (ఖమేనీ కుమార్తె, అల్లుడు, పసి మనవరాలు, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ భార్య జహ్రా హద్దాద్ అడెల్) శవపేటికలను కూడా పక్కపక్కనే ఉంచి ఉమ్మడిగా అంతిమయాత్ర నిర్వహించారు.
ఇమామ్ రెజా బలిపీఠం దగ్గర అంత్యక్రియలు
మష్హద్ నగరంలోని అత్యంత పవిత్రమైన, గౌరవప్రదమైన 'ఇమామ్ రెజా ష్రైన్' (Shrine of Imam Reza) వద్ద ఖమేనీ అంత్యక్రియలు జరిగాయి. ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన 12 మంది షియా ఇమామ్‌లలో ఇరాన్ గడ్డపై సమాధి చేసింది ఏకైక ఇమామ్ 'రెజా' కావడం గమనార్హం.
గతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు పలువురు ఇరాన్ పూర్వపు రాజుల (షా) సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'ఇర్నా' (IRNA) ప్రకారం, 101 సంవత్సరాల వయసున్న ప్రముఖ సాంప్రదాయవాద అయాతొల్లా హుస్సేన్ నూరి హమేదానీ ఈ అంతిమ ప్రార్థనలను నడిపించారు. ఖమేనీని ఆయన స్వస్థలంలోనే ఖననం చేయాలనేది ఆయన వ్యక్తిగత చివరి కోరిక అని ఇరాన్ స్టేట్ టెలివిజన్ వెల్లడించింది.
అంత్యక్రియల వేళ కూడా ముగియని యుద్ధం
మరోవైపు, ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలోనే, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. రెండు దేశాలు వరుసగా రెండో రోజు కూడా పరస్పరం క్షిపణి దాడులు చేసుకున్నాయి.
కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తాము మళ్లీ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) సముద్ర జలాల పరిధిలో రేగిన ఈ తాజా ఘర్షణలు, పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధ భయాలను మరోసారి రేకెత్తిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం
ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..