Share News

ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఎయిర్ కెనడా విమానం.. నలుగురి పరిస్థితి విషమం!

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:41 AM

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లాగ్వార్డియా విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక ఫైర్ ఇంజిన్‌ను బలంగా ఢీకొట్టడంతో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఎయిర్ కెనడా విమానం.. నలుగురి పరిస్థితి విషమం!
Air Canada crash

న్యూయార్క్, మార్చి 23: అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లాగ్వార్డియా (LaGuardia) విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ (Air Canada Express) విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక ఫైర్ ఇంజిన్‌ను (Fire Truck) బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఫ్లైట్‌రాడార్24 సమాచారం ప్రకారం, ఎయిర్ కెనడాకు చెందిన CRJ-900 విమానం రన్‌వే 4పై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం సుమారు గంటకు 39 కి.మీ. వేగంతో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు Stop, Stop, Truck 1 అంటూ గట్టిగా అరవడం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్స్‌లో వినిపిస్తోంది. హెచ్చరించినప్పటికీ ట్రక్కు.. విమానం దారిలోకి రావడంతో ఈ ఘోరం జరిగింది.


నలుగురు అగ్నిమాపక సిబ్బందికి తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో ఫైర్ ట్రక్కులో ఉన్న నలుగురు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా నివేదించింది. విమానంలో ఉన్న 100 మంది ప్రయాణికులను అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఢీకొన్న ధాటికి విమానం ముందు భాగం (Nose) పూర్తిగా ధ్వంసమైంది. సోషల్ మీడియాలో వస్తున్న దృశ్యాలలో విమానం ముందు చక్రం విరిగిపోయి, ముక్కు భాగం నేలకు తగిలి ఆగిపోవడం కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) లాగ్వార్డియా విమానాశ్రయంలో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది.

ఇతర నగరాల నుండి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఈ అంతరాయం సోమవారం సాయంత్రం 18:00 GMT (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటల) వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రన్‌వేపైకి ఫైర్ ట్రక్కు ఎలా వచ్చింది? సిగ్నల్ వ్యవస్థలో లోపం ఉందా లేదా మానవ తప్పిదమా? అనే కోణంలో ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.


ఈ వార్తలు కూడా చదవండి

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు

Updated Date - Mar 23 , 2026 | 12:02 PM