Share News

అమెరికా ఇమిగ్రేషన్‌ కస్టడీలో1,389 మంది భారతీయ చిన్నారులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:00 AM

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. సంరక్షకులు లేకుండా పట్టుబడుతున్న భారతీయ బాలల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా ఇమిగ్రేషన్‌ కస్టడీలో1,389 మంది భారతీయ చిన్నారులు
immigration

  • నాలుగేళ్లలో తోడు లేకుండా అక్రమంగా ప్రవేశిస్తూ పట్టబడ్డ మైనర్లు

అహ్మదాబాద్‌/వాషింగ్టన్‌, నవంబరు 23: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. సంరక్షకులు లేకుండా పట్టుబడుతున్న భారతీయ బాలల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, వీరిలో ఒక్కరిని కూడా ఇప్పటివరకు భారత్‌కు తిరిగి పంపించకపోవడం గమనార్హం. అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (యూఎస్‌సీబీపీ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుండటంతో.. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేకుండా పట్టుబడుతున్న భారతీయ బాలల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 730 మంది బాలలు పట్టుబడగా.. 2024లో 517 మంది, 2025లో 91 మంది, 2026లో 51 మంది మాత్రమే అధికారులకు చిక్కారు. 2027 ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన అక్టోబరులో ఇద్దరిని మాత్రమే గుర్తించారు. ఇతర దేశాల బాలల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. 2024లో 1.1 లక్షల మందిగా ఉన్న బాల వలసదారుల సంఖ్య.. 2025లో 29,584కు, 2026లో 9,190కి పడిపోయింది.


కాగా, కొందరు తల్లిదండ్రులు, బంధువులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న సమయంలో పట్టుబడితే తమ పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయేవారని సమాచారం. అటువంటి చిన్నారులకు ఇమిగ్రేషన్‌ కేంద్రాల్లో వసతి కల్పించి సంరక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, అమెరికాలో వలసలపై కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఇలాంటి ఘటనలు క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్న దేశాల జాబితాలో భారతీయులు ముందువరుసలో ఉన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయులకు సంబంధించి 30,528 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో మెక్సికో, కెనడా తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట..!

Updated Date - Nov 24 , 2026 | 04:15 AM