Share News

ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:49 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు ప్రతాపాన్ని చూపిస్తాడు. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. వేసవి కాలంలో ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా వెంటనే అలసిపోతారు.

ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
Summer Health Tips

ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. ఎండాకాలంలో ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా వెంటనే అలసిపోతారు. అందుకే ఎండాకాలం ముగిసే వరకు ప్రతి ఒక్కరూ, కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, ధరించే దుస్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


1. ఫ్రిజ్ నీళ్లు:

ఎండాకాలంలో చల్లని ఐస్ వాటర్ తాగడం చాలా మందికి అలవాటు. ఇది శరీర ఉష్ణోగ్రతను ఒక్కసారిగా పడిపోయేలా చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించడమే కాదు, గొంతునొప్పి, గుండె సంబంధిత ఇబ్బందులూ రావచ్చు. మట్టికుండలో నీళ్లు తాగడం చాలా మంచిది.

2. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం:

దాహం వేస్తుందంటే మీ శరీరం అప్పటికే డీహైడ్రేషన్‌‌కు గురైందని అర్థం. కాబట్టి దాహం వేసినా వేయకపోయినా అరగటంకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

3. కెఫిన్, కూల్ డ్రింక్స్:

ఎండాకాలంలో సేద తీరడానికి సోడాలు, కూల్‌డ్రింక్స్ లేదా ఎక్కువగా కాఫీలు, టీలు తాగడం పెద్ద తప్పు. వీటిలో కెఫిన్, చక్కెరలు శరీరం నుంచి నీటిని బయటకు పంపి, మిమ్మల్ని మరింత డీ‌హైడ్రేషన్‌కు గురిచేస్తాయి.


4. చర్మ రక్షణ:

ఎండాకాలంలో చెమటల వల్ల చర్మంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ రెండుసార్లు స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడటమే కాదు.. బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందుతుంది.

5. ఆహారం:

ఎండాకాలంలో మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ఎండల సమయంలో జీర్ణశక్తి కొంచెం మందగిస్తుంది. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మసాలాలు, వేపుళ్లకు దూరంగా ఉండాలి. చలువ చేసే పదర్ధాలు తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పుచ్చకాయ, దోసకాయ, కర్బూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. పెరుగు, మజ్జిగను భోజనంలో తప్పనిసరి చేసుకోవాలి.

Updated Date - Feb 22 , 2026 | 02:20 PM