Share News

వేసవిలో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే.. ఇంటి చిట్కాలు

ABN , Publish Date - May 14 , 2026 | 11:13 AM

ఏప్రిల్ నెల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలు, వేడి గాలులు, అధిక చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..

వేసవిలో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే.. ఇంటి చిట్కాలు
Summer Health Tips

ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ నెల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలు, వేడి గాలులు, చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. సమ్మర్ సీజన్‌లో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్‌, తలనొప్పి, నీరసం, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, హీట్ స్ట్రోక్‌ వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మన ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సహజ పదార్థాలు, సరైన ఆహార అలవాట్లు, తగినంత నీరు తీసుకోవడం, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.


తగినంత నీరు తీసుకోవాలి:

వేసవిలో శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. అందుకే తరచుగా నీరు తాగడం చాలా ముఖ్యం. కొబ్బరి నీరు, గ్లూకోజ్ నీరు, మజ్జిగ తీసుకుంటే శరీరానికి చల్లదనం లభిస్తుంది.

సహజ పానీయాలు:

నిమ్మరసం, జీలకర్ర నీరు, సబ్జా నీళ్లు, రాగి జావ వంటి పానీయాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.

నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినాలి:

పుచ్చకాయ, దోసకాయ, ముస్క్‌మెలన్‌, నారింజ వంటి పండ్లు వేసవిలో శరీరానికి తేమను అందిస్తాయి.

పెరుగు, మజ్జిగ తప్పనిసరి:

ప్రతి రోజు భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం చల్లగా ఉంటుంది. అలాగే, ఉదయాన్నే రాగి జావ తాగడం వల్ల రోజంతా శరీరం చల్లగా ఉంటుంది.

చర్మ సంరక్షణకు సహజ మార్గాలు:

అలొవెరా జెల్‌, చందనం పేస్ట్‌, రోజ్‌వాటర్‌ వంటివి చర్మానికి చల్లదనం ఇస్తాయి. ఎండ వల్ల వచ్చే మంట, దురద తగ్గుతాయి. ఎండ నుంచి రాగానే ముఖానికి కలబంద జెల్ రాసుకుంటే చర్మం చల్లబడి, మంట తగ్గుతుంది.

హీట్ స్ట్రోక్‌ లక్షణాలు కనిపిస్తే:

తల తిరగడం, అధిక చెమట, అలసట అనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. ORS లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.

తేలికపాటి ఆహారం మంచిది:

వేసవిలో ఎక్కువగా ఆయిల్‌, మసాలా ఆహారం తీసుకుంటే శరీర వేడి పెరుగుతుంది. ఆకుకూరలు, పండ్లు, ఉడికించిన ఆహారం మంచిది. పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను వంటల్లో వాడటం వల్ల లేదా వీటితో చేసిన చట్నీలు తీసుకోవడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.

సరైన దుస్తులు ధరించాలి:

కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల చెమట త్వరగా ఆరిపోతుంది. లైట్ కలర్ దుస్తులు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

సరిపడ నిద్ర అవసరం:

వేసవిలో శరీరం త్వరగా అలసిపోతుంది. కనీసం 7–8 గంటలు నిద్రపోతే శరీరం తాజాగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా

For More Latest News

Updated Date - May 14 , 2026 | 12:49 PM