Share News

ఎండా కాలంలో ఈ తప్పులు చేస్తే.. ముప్పు తప్పదు

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:02 PM

వేసవి కాలం వచ్చేసింది.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. వేసవి కాలంలో కొన్ని తెలియకుండా చేసే పొరపాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

ఎండా కాలంలో ఈ తప్పులు చేస్తే.. ముప్పు తప్పదు
Summer Health Tips,

ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం వచ్చేసింది.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయట కొద్ది దూరం నడిస్తే చాలు.. చెమటతో తడిసి ముద్దవుతున్నారు. వేసవి కాలంలో ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులే ముప్పవుతాయి. అందుకే వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.


1. మంచినీరు:

ఎండా కాలంలో నీళ్లకు మించిన ఔషధం ఏదీ లేదని అంటారు. వీలైనంత వరకు బాడీ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలంటే ఎక్కువ నీరు తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్లు మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి.

2. చలువ పదార్ధాలు:

వేసవి కాలంలో సబ్జా, బార్లీ గింజలు నీటిలో కలుపుకుని తాగితే శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. రాగి అంబలి, నిమ్మ రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటివి రోజుకు కనీసం 2-3 సార్లు తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. బయట ఎండలో తిరిగి రాగానే ఐస్ కోల్డ్ వాటర్ లేదా ఫ్రిజ్ నీళ్లు తాగకూడదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది.

3. ఆహారపు అలవాట్లు:

ఎండలో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, వేపుళ్లు, కెఫిన్(కాఫీ, టీ) ఎక్కువగా తీసుకోవడం మానుకుంటే చాలా మంచిది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, కీరా వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు భోజనంలో చేర్చుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో సాధ్యమైనంత వరకు పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో చల్లగా ఉంటుంది.

4. కళ్ల రక్షణ:

బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌గ్లాసెస్ ధరించాలి. కళ్లు అలసిపోయినట్లు అనిపిస్తే, చల్లటి నీటితో కళ్లను కడుక్కోవాలి. కీరా ముక్కలు కళ్లపై కొద్దిసేపు ఉంచుకుంటే రిలీఫ్‌గా ఉంటుంది. శరీరానికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

5. ఎండలో వ్యాయామం వద్దు:

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు(ఉదయం 8 గంటల తర్వాత) ఆరుబయట వ్యాయామం చేయకూడదు. సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లోనే వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయట వ్యాయామం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. పైగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Latest News

Updated Date - Mar 04 , 2026 | 02:24 PM