Share News

వేసవిలో సోయాబీన్స్ ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు

ABN , Publish Date - May 17 , 2026 | 08:31 AM

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే, శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో సోయాబీన్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

వేసవిలో సోయాబీన్స్ ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు
Soybeans Health Benefits

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే, శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో సోయాబీన్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రుచిగా లేకపోవడం, వగరుగా ఉండే సోయాబీన్స్‌ను తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే మాంసాహారంతో సమానమైన పోషకాలు సోయా బీన్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం కాపాడటంలో, బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వేసవిలో సోయాబీన్స్ తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


1. అలసటను తగ్గించి, తక్షణ శక్తిని ఇస్తుంది

ఎండల వల్ల వేసవిలో శరీరం త్వరగా అలసిపోతుంది. సోయాబీన్స్‌లో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్ శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

2. బరువు నియంత్రణ

వేసవిలో బరువు తగ్గాలనుకునే వారికి సోయాబీన్స్ ఒక అద్భుతమైన ఆహారం అనే చెప్పొచ్చు. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల.. దీనిని తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి, బరువును అదుపులో ఉంచుతుంది.

3. గుండె ఆరోగ్యానికి మేలు

సోయాబీన్స్‌లో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

4. చర్మ ఆరోగ్యానికి రక్షణ

ఎండ తీవ్రత వల్ల వేసవిలో చర్మం పొడిబారడం, ట్యాన్ అవ్వడం సర్వసాధారణం. సోయాబీన్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ చర్మాన్ని సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గించి, గ్లో పెరిగేలా చేస్తుంది.

5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది

వేసవిలో జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. సోయాబీన్స్‌లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించి, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

6. ఎముకల బలం

సోయాబీన్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, రాగి (క్రాపర్) వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను (ఆస్టియోపోరోసిస్) అడ్డుకుని, ఎముకలను బలంగా ఉంచుతాయి.

7. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ

వేసవిలో చెమట రూపంలో శరీరం నుంచి పొటాషియం, సోడియం వంటి కీలక లవణాలు బయటకు పోతుంటాయి. సోయాబీన్స్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

8. మధుమేహం నియంత్రణ

మధుమేహం ఉన్నవారికి సోయాబీన్స్ ఒక సూపర్ ఫుడ్. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీనివల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగనివ్వదు. ఇందులో ఉండే ఐసోఫ్లేవోన్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.

9. జుట్టు రాలడం తగ్గుతుంది

ఎండలు, చెమట, ధూళి వల్ల వేసవిలో జుట్టు బలహీనపడి రాలిపోతుంటుంది. సోయాబీన్స్‌లో ఉండే ప్రొటీన్లు, బయోటిన్, ఐరన్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి. ఇది జుట్టుకు మంచి పోషణను అందించి, దృఢంగా పెరిగేలా చేస్తుంది.

10. మహిళల ఆరోగ్యానికి రక్షణ

ముఖ్యంగా మధ్యవయసు దాటిన మహిళల్లో (మేనోపాజ్ దశలో) వేసవి తీవ్రత వల్ల బాడీ హీట్, హఠాత్తుగా ఒళ్లు వేడెక్కడం వంటి సమస్యలు ఉంటాయి. సోయాబీన్స్‌లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడి, ఈ సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా

For More Latest News

Updated Date - May 17 , 2026 | 08:43 AM