చలికాలంలో సత్తు లడ్డు తిన్నడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:36 PM
చలికాలంలో శరీరానికి వేడిని, శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. ఈ సీజన్‌కు అనుగుణంగా రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వాటిల్లో సత్తు లడ్డూ ఒకటి.
ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో శరీరానికి వేడిని, శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. ఈ సీజన్‌కు అనుగుణంగా రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వాటిల్లో సత్తు లడ్డూ ఒకటి. వేయించిన శనగల్లో అధికంగా ప్రోటీన్, ఫైబర్ లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలానే ఈ సత్తు లడ్డులోని నట్స్, సీడ్స్ ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు అందుతాయని, బెల్లం సహజ తియ్యదనం, తక్షణ శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ఉదయం అల్పాహారం వేళ లేదా సాయంత్రం స్నాక్‌గా వీటిని తీసుకోవచ్చు.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన హై ప్రోటీన్ సత్తు లడ్డూలను ఇంట్లోనే సులభంగా, ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు.. మధుమేహాన్ని నియంత్రించడం, రక్తహీనతను తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను సత్తుపిండి అందిస్తుంది. బాదంపప్పు కంటే కూడా సత్తుపిండిలో ఎక్కువ ఆరోగ్య గుణాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. సత్తుపిండిని వివిధ ప్రాంతాల్లో బియ్యం, గోధుమలు, రాగులు, శనగలతో తయారుచేస్తారు. సింపుల్ గా తయారు చేసుకునే ఈ లడ్డు రెసిపీ ముఖ్యంగా పిల్లలకు మంచి బలవర్ధకమైన చిరుతిండి.
కావాల్సిన పదార్థాలు:
పొట్టు తీసిన వేయించిన శనగలు 2 కప్పులు, తురిమిన ఎండు కొబ్బరి అర కప్పు, బాదం, జీడిపప్పు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు కలిపిన మిశ్రమం అర కప్పు, యాలకుల పొడి 1 టీస్పూన్, జాజికాయ పొడి చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం పొడి ముప్పావు కప్పు, నీరు పావు కప్పు.
తయారీ విధానం:
ముందుగా బాణలిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి తక్కువ మంటపై నట్స్, సీడ్స్‌ను 2–3 నిమిషాలు కలపాలి. అందులోనే శనగలు వేసి 1–2 నిమిషాలు వేయించాలి. తర్వాత ఎండు కొబ్బరి చేర్చి మాడిపోకుండా తేలికగా వేయించి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి. మరో బాణలిలో బెల్లం పొడి, నీరు, మిగిలిన నెయ్యి వేసి 7–8 నిమిషాలు కలియబెడుతూ పాకం జిగురుగా వచ్చే వరకు మరిగించాలి. ఇందులో శనగల పొడి, యాలకుల, జాజికాయ పొడులు వేసి కలపాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి.
జాగ్రత్తలు:
తక్కువ మంటపైనే వేయించాలి. ఈ లడ్లు గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేస్తే బయట వారం రోజులు, ఫ్రిజ్‌లో 15 నుంచి 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.శనగలు ఉన్నప్పుడు ఈ సులభమైన, ఆరోగ్యకరమైన సత్తు లడ్డూలను ప్రయత్నించాలని ఈ రెసిపీ ప్రోత్సహిస్తుంది.
ఇవి కూడా చదవండి:
రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్‌గా మేడిశెట్టి శేషారావు ప్రమాణ స్వీకారం