Share News

విజయానికి 8 వికెట్లు

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:31 AM

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అత్యంత ఆసక్తికరంగా మారింది. చివరి రోజు భారత బౌలర్ల నుంచి కివీస్‌ బ్యాటర్లకు రసవత్తరమైన సవాల్‌ ఎదురుకానుంది. అంతకన్నా...

విజయానికి 8 వికెట్లు

భారత్‌ రికార్డు స్కోరు

తొలి ఇన్నింగ్స్‌ 720/9 డిక్లేర్‌

  • రిషభ్‌ పంత్‌ శతకం

  • ధ్రువ్‌ జురెల్‌ హాఫ్‌ సెంచరీ

  • న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 119/2

తొలి టెస్టు

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అత్యంత ఆసక్తికరంగా మారింది. చివరి రోజు భారత బౌలర్ల నుంచి కివీస్‌ బ్యాటర్లకు రసవత్తరమైన సవాల్‌ ఎదురుకానుంది. అంతకన్నాముందు బేసిన్‌ రిజర్వ్‌లో మన బ్యాటర్లు రికార్డుల మోత మోగించారు. ఇక్కడి పిచ్‌లపై పరుగులు రాబట్టడం అంత సులువు కాదని భావించినా.. టీమిండియా తగ్గేదేలే.. అనేలా చెలరేగింది. ఇప్పటికే రాహుల్‌, గిల్‌, దేవ్‌దత్‌ భారీస్కోర్లు సాధించగా.. ఆటకు నాలుగో రోజైన ఆదివారం వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు ధ్రువ్‌ జురెల్‌ (79 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 78) వేగంగా ఆడి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అన్షుల్‌ (38), వాషింగ్టన్‌ సుందర్‌ (24) సహకరించారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 720 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అంటే.. గిల్‌ సేన 352 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఫిలి్‌ప్సకు 3, రచిన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ ఆట ముగిసే సరికి 119/2 స్కోరుతో పోరాడుతోంది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (59), రచిన్‌ (27) క్రీజులో ఉన్నారు. నికోల్స్‌ (31) ఫర్వాలేదనిపించాడు. కివీస్‌ ఓవరాల్‌గా 233 పరుగులు వెనుకంజలో నిలవగా.. భారత్‌ విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. దీంతో ఆఖరి రోజైన సోమవారం తొలి సెషన్‌ కీలకం కానుంది. అయితే ఫ్లాట్‌ పిచ్‌ కావడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశం కూడా లేకపోలేదు.

తొలి సెషన్‌ నుంచే జోరు: ఓవర్‌నైట్‌ స్కోరు 486/4తో నాలుగో రోజును ఆరంభించిన భారత్‌ తొలి సెషన్‌లో 2 వికెట్లకు 27.5 ఓవర్లలోనే 143 రన్స్‌ చేసింది. అన్షుల్‌ క్రీజులో ఉన్నంత సేపు వన్డే తరహాలో బ్యాట్‌ ఝుళిపించాడు. ఆ తర్వాత పంత్‌ తడాఖా చూపాడు. అయితే ఫిలిప్స్‌ ఓవర్‌లో కాన్వే డైవింగ్‌ క్యాచ్‌తో అన్షుల్‌ ఆటకు చెక్‌ పెట్టాడు. దీంతో ఐదో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు పంత్‌ తనదైన శైలిలో వరుసగా 4,6 బాది సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం జోరు పెంచి బౌండరీలు రాబట్టాడు. సెషన్‌ చివరి ఓవర్‌లో పంత్‌ను రచిన్‌ అవుట్‌ చేయడంతో జురెల్‌తో ఆరో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బ్రేక్‌ తర్వాత జురెల్‌ 61 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి.. సుందర్‌తో ఏడో వికెట్‌కు 54 రన్స్‌ జోడించాడు. ఈ క్రమంలో ఆధిక్యం కూడా 300 దాటింది. ఆకాశ్‌ (13) ఐదు బంతులే ఆడినా రెండు సిక్సర్లతో మురిపించాడు. అటు ఫిలిప్స్‌ ఓవర్‌లో జురెల్‌ 4,6 బాది అవుటవడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.


కివీస్‌ పోరాటం: రెండో సెషన్‌ మధ్యలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ తొలి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌, కెప్టెన్‌ లాథమ్‌ (0) వికెట్‌ను బుమ్రా పడగొట్టాడు. ఈ టెస్టులో లాథమ్‌ రెండుసార్లు డకౌట్‌ కావడం గమనార్హం. ఈ దశలో మరో ఓపెనర్‌ కాన్వేకు నికోల్స్‌ సహకరించాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడి సెషన్‌ను ముగించారు. ఇక చివరి సెషన్‌లో దీటుగా ఆడి రెండో వికెట్‌కు 60 రన్స్‌ జోడించారు. నికోల్స్‌ క్యాచ్‌ను షార్ట్‌ లెగ్‌లో డైవ్‌ చేసి మరీ జురెల్‌ పట్టేశాడు. కానీ ఆ తర్వాత భారత బౌలర్లను విసిగిస్తూ కాన్వే, రచిన్‌ క్రీజులో ఓపిగ్గా నిలిచారు. ఇప్పటికే 137 బంతులాడిన ఈ జోడీ రెండో వికెట్‌కు అజేయంగా 59 రన్స్‌ జత చేసింది.

నేను బౌలింగ్‌ చేయనా..?

వికెట్ల వెనకాల పంత్‌ ఉన్నాడంటే తన నోటికి విరామమనేదే ఉండదు. స్టంప్‌ మైక్‌లో అతడు బౌలర్లతో సాగించే సంభాషణలు రికార్డు అవుతూనే ఉంటాయి. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పిచ్‌ బౌలర్లకు కష్టంగా మారడంతో అవసరమైతే తాను బౌలింగ్‌ చేస్తానంటూ సరదాగా ముందుకు వచ్చాడు. ‘ప్యాడ్స్‌, గ్లౌవ్స్‌ తీసేయాలంటే కష్టమే కాబట్టి నేను లెగ్‌ స్పిన్‌ వేస్తాను. అలాగే మీకు విచిత్రమైన బౌలింగ్‌ కావాలంటే జైస్వాల్‌ వేస్తాడు’ అంటూ సరదాగా ఆటపట్టించాడు.

‘బ్యాట్‌ను తాకలేదు భాయ్‌..’

కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో సరదా సంఘటన చోటు చేసుకుంది. పేసర్‌ ఆకాశ్‌ వేసిన మూడో బంతిని డెవాన్‌ కాన్వే లెగ్‌ సైడ్‌ ఆడాలని చూడగా.. బంతి ప్యాడ్లకు తాకిందని ఎల్బీ అప్పీల్‌ చేశాడు. అయితే అప్పీల్‌ను అంపైర్‌ తోసిపుచ్చగా డీఆర్‌ఎస్‌ కోసం గిల్‌పై ఆకాశ్‌ ఒత్తిడి తెచ్చాడు. కానీ, కెప్టెన్‌ మాత్రం బ్యాట్‌ను తాకవచ్చని సందేహం వ్యక్తం చేశాడు. బుమ్రా కూడా అదే విషయం చెప్పగా.. ఆకాశ్‌ మాత్రం ‘బ్యాట్‌ను తాకలేదు భాయ్‌’ అంటూ నమ్మకంగా చెప్పాడు. కానీ గిల్‌ మాత్రం రివ్యూ తీసుకోలేదు. రీప్లేలోనూ బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్నట్టు తేలింది.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 368; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్లండెల్‌ (బి) హెన్రీ 85, రాహుల్‌ (బి) స్మిత్‌ 136, దేవ్‌దత్‌ (బి) జేమిసన్‌ 80, గిల్‌ (బి) డఫీ 98, పంత్‌ (సి) స్మిత్‌ (బి) రచిన్‌ 128, అన్షుల్‌ (సి) కాన్వే (బి) ఫిలిప్స్‌ 38, జురెల్‌ (స్టంప్‌) బ్లండెల్‌ (బి) ఫిలిప్స్‌ 78, సుందర్‌ (సి అండ్‌ బి) రచిన్‌ 24, ఆకాశ్‌ దీప్‌ (సి) లాథమ్‌ (బి) ఫిలిప్స్‌ 13, బుమ్రా (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 33; మొత్తం: 166 ఓవర్లలో 720/9 డిక్లేర్‌. వికెట్ల పతనం: 1-130, 2-295, 3-386, 4-486, 5-554, 6-629, 7-683, 8-696, 9-720. బౌలింగ్‌: హెన్రీ 33-7-94-1, జేమిసన్‌ 31-6-88-1, డఫీ 33-1-201-1, నాథన్‌ స్మిత్‌ 29-4-84-1, ఫిలిప్స్‌ 24-0-154-3, రచిన్‌ రవీంద్ర 10-0-44-2, మిచెల్‌ 6-0-39-0.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0, కాన్వే (బ్యాటింగ్‌) 59, నికోల్స్‌ (సి) జురెల్‌ (బి) ప్రసిద్ధ్‌ 31, రచిన్‌ (బ్యాటింగ్‌) 27; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 45 ఓవర్లలో 119/2. వికెట్ల పతనం: 1-0, 2-60. బౌలింగ్‌: బుమ్రా 9-1-33-1, ఆకాశ్‌ 10-2-25-0, అన్షుల్‌ కాంబోజ్‌ 9-1-21-0, ప్రసిద్ధ్‌ 8-2-20-1, సుందర్‌ 8-2-16-0, దేవ్‌దత్‌ 1-0-2-0.

1

‘సేనా’ (దక్షిణా ఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలి యా) దేశాలపై సెంచరీలు బాదిన తొలి ఆసియా కీపర్‌గా పంత్‌.

2

టెస్టుల్లో ఎక్కువ సిక్సర్లు (108) బాదిన రెండో బ్యాటర్‌గా పంత్‌. బెన్‌ స్టోక్స్‌ (138) టాప్‌లో ఉన్నాడు.

1

టెస్టు చరిత్రలో మొదటి ఏడు వికెట్ల మధ్య 50+ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్‌.

1

విదేశాల్లో తమ అత్యధిక స్కోరు (720)ను నమోదు చేసిన భారత్‌. అలాగే న్యూజిలాండ్‌పైనే కాకుండా ఆ దేశంలో ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ రన్స్‌ సాధించిన టీమ్‌గానూ నిలిచింది.

2

టెస్టుల్లో 700+ పరుగులను ఎక్కువసార్లు (5) సాధించిన రెండో జట్టుగా భారత్‌. శ్రీలంక (7) టాప్‌లో ఉంది.

3

ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ తొలి ఓవర్‌లోనే వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా బుమ్రా. శ్రీశాంత్‌, జహీర్‌ గతంలో ఈ ఫీట్‌ సాధించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 05:31 AM