వేసవిలో మునగాకుతో కలిగే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:00 PM
సాధారణంగా మునగ కాయలను మనం ఎంతో ఇష్టంగా తింటాం. కానీ, మునగాకులోని ఆరోగ్య రహస్యాలను చాలా మంది పట్టించుకోరు. మునగాకు వేసవి కాలంలో శరీరానికి ఒక వరప్రసాదం లాంటిది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మునగ కాయలను మనం ఎంతో ఇష్టంగా తింటాం. కానీ, మునగాకులోని ఆరోగ్య రహస్యాలను చాలా మంది పట్టించుకోరు. మునగాకు వేసవి కాలంలో శరీరానికి ఒక వరప్రసాదం లాంటిది. ఎండల వేడిని తట్టుకోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మునగ ఆకు వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఎంటో తెలుసుకుందాం.
1. శరీరానికి చలవ:
మునగాకులో సహజసిద్ధమైన చలవ చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దీనివల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది.
2. శక్తినిచ్చే పవర్‌హౌస్:
వేసవిలో అధిక చెమట వల్ల మనం త్వరగా అలసిపోతాం. మునగాకులో ఉండే ఐరన్, క్యాల్షియం, విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. నీరసాన్ని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
3. రోగనిరోధక శక్తి పెంపు:
వేసవిలో ఆహారం త్వరగా పాడవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మునగాకులో ఉండే విటమిన్-సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది.
4.జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
మునగ ఆకులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది వేసవిలో వచ్చే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచుతుంది.
5. చర్మ సౌందర్య:
ఎండ వల్ల చర్మం కమిలిపోవడం సహజం. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించి, చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి.
6. మునగాకుతో విటమిన్ సి:
విటమిన్ సి అధికంగా ఉన్న పదార్ధాలు అంటే నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజ వంటి పండ్లతో మునగాకు కలిపి తీసుకుంటే చాలా మంచిది. మునగాకు పొడి చేసుకొని అందులో కాసింత నిమ్మరసం కలుపుకొని తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
7. మిరియాలతో మునగాకు:
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మునగాకుతో మిరియాలు కలిపి తీసుకుంటే న్యూట్రియెంట్స్ రెట్టింపవుతాయి. పొడిగా చేసుకొనేటప్పుడు అందులో కొన్ని మిరియాలు కలుపుకుంటే బాగుంటుంది.
మునగ ఆకును ఎలా తీసుకోవాలి?
వారానికి రెండు సార్లు పప్పులో కానీ, ఇతర కూరల్లో మునగాకు వేసుకొని తింటే మంచిది.
ఎండబెట్టిన ఆకును పొడి చేసి మజ్జిగలో కలుపుకుని తాగితే వేసవి వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పరగడుపున మునగ ఆకుల డికాషన్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Latest News