కాలి మడమ నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కాలు.. ఇవిగో..
ABN , Publish Date - May 25 , 2026 | 02:48 PM
చాలా మంది ఉదయం నిద్రలేవగానే మడమ నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ సేపు నిలబడటం. సరైన పాదరక్షలు ధరించకపోవడంతోపాటు అధిక బరువు ఉండటం మరో కారణం.
చాలా మంది ఉదయం నిద్రలేవగానే మడమ నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ సేపు నిలబడటం. సరైన పాదరక్షలు ధరించకపోవడంతోపాటు అధిక బరువు ఉండటం మరో కారణం. రోజంతా మన శరీర బరువు మొత్తం మన పాదాలపై పడుతుంది. అందుకే మడమ నొప్పి కారణంగా చాలా మంది ఉదయాన్నే లేవడానికి ఇబ్బంది పడతారు. మరి ముఖ్యంగా ఉదయం వేళ.. మనం పాదం నేలపై ఆనించిన వెంటనే మడమలో తీవ్రంగా గుచ్చుతున్నట్లుగా నొప్పి ఉంటుంది. వైద్య పరిభాషలో దీనిని ప్లాంటార్ ఫాసైటిస్ అని అంటారు.
ఇది ఎందుకు వస్తుందంటే..?
ప్లాంటార్ ఫాసియా అనేది మన మడమ నుంచి కాలివేళ్ళ వరకు విస్తరించి ఉండే ఒక మందపాటి కండర కణజాలం. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు మన పాదాలపై పడే ఒత్తిడిని గ్రహించడానికి అది ఒక షాక్ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. ఈ కణజాలంపై అధిక ఒత్తిడి పడటం వల్ల స్వల్ప వాపు రావచ్చు. దీనినే ప్లాంటార్ ఫాసైటిస్ అని అంటారు.
ఈ సమస్యకు ప్రధాన కారణాలు..
అధిక సమయం నిలబడి ఉండటం. ఉదాహరణకు ఉపాధ్యాయులు, కూరగాయలు లేదా ఇతర వ్యాపారులు, వంట పని చేసేవారు గంటల తరబడి నిలబడి పని చేసే మహిళలకు ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
ఫ్లాట్ చెప్పులు లేదా హీల్స్ అతిగా వాడటం వల్ల పాదంలో అసమతుల్యత ఏర్పడి.. మడమపై ఒత్తిడి పెరుగుతుంది.
శరీర బరువు అధికంగా ఉన్నప్పుడు, నడిచేటప్పుడు మొత్తం బరువు మడమపై పడుతుంది. దీనివల్ల ప్రధానంగా మడమ నొప్పి వస్తుంది.
మడమ నొప్పిని తగ్గించడానికి ఉన్న సింపుల్ చిట్కాలు..
ఐస్ థెరపీ (ఐస్ మసాజ్): ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో నీళ్లు నింపి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. అందులో నీరు గడ్డ కడుతుంది. తర్వాత ఆ బాటిల్‌ను నేలపై ఉంచి.. మీ పాదాలను ముఖ్యంగా మడమలను.. దానిపై ముందుకు వెనుకకు రుద్దాలి. రోజుకు 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల వాపు తగ్గి, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
గోరువెచ్చని నీరు.. రాతి ఉప్పు: ఒక తొట్టిలో గోరువెచ్చని నీటిని తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ల రాతి ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్ కలపాలి. ఆ నీటిలో మీ పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఉప్పునీటిలోని మెగ్నీషియం.. కండరాల నొప్పిని అలసటను త్వరగా తగ్గిస్తుంది.
వ్యాయామం..
ఉదయం నిద్రలేచే ముందు.. మీ పాదాలు, కాలివేళ్ళను పైకి కిందకి సాగదీయండి. అలాగే నేలపై ఒక చిన్న టవల్ పరిచి.. ఆ టవల్‌ను మీ కాలివేళ్ళకు దగ్గరగా లాగడానికి ప్రయత్నించండి. ఇది ప్లాంటార్ పాసియా కండరాలను బలపరుస్తుంది.
సరిపోయే బూట్లు వాడాలి.. లోపల లేదా బయట.. మడమ భాగంలో మృదువైన కుషన్లు ఉన్న బూట్లను మాత్రమే వాడాలి. కాళ్లకు ఏమీ లేకుంటా నేలపై ఎప్పుడూ నడవవద్దు.
ఈ జాగ్రత్తలతో పాటు సూచించిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే.. మీకు కొన్ని రోజుల్లో మడమ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక.. ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్యాస్ సమస్యతో ఇబ్బందా..? వాము, సోంపుతో సింపుల్ ట్రీట్మెంట్
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు
For More Health News And Telugu News