Share News

పిల్లల్లోనూ గుండెపోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:58 AM

ఇటీవలి కాలంలో చిన్నారుల్లోనూ గుండెపోటు ముప్పు పెరుగుతోంది. ఇది తల్లిదండ్రులను కలవరపెడుతోంది.

పిల్లల్లోనూ గుండెపోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల గుండెపోటు కారణంగా పాఠశాలల్లోనే చిన్నారులు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక ఆటల పీరియడ్‌ ముగించుకుని తరగతి గదికి వచ్చిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. దీంతో చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.


పిల్లల్లో గుండె సమస్యలకు కారణాలేంటి?

సాధారణంగా గుండెపోటు అంటే పెద్దవారికి వచ్చే సమస్యగా భావిస్తారు. అయితే పిల్లలకూ గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, గుండె కండరాలకు సంబంధించిన వ్యాధులు, గుండె స్పందనలో అసాధారణ మార్పులు ఆకస్మిక ప్రమాదాలకు కారణమవుతాయి. కొన్నిసార్లు పిల్లల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలూ కనిపించకపోయినా గుండె సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో చిన్న వయసులో ఆకస్మిక మరణాలు జరిగిన దాఖలాలు ఉన్నా, పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నా వైద్య పరీక్షలు చేయించడం ముఖ్యం.


ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు లేదా పరుగెత్తుతున్నప్పుడు తరచుగా స్పృహ కోల్పోవడం, ఛాతిలో నొప్పి, అసాధారణంగా శ్వాస తీసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోతే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలి.

ఇవి ముఖ్యం

పిల్లలు ప్రతిరోజూ కనీసం గంటపాటు శారీరక కార్యకలాపాలు చేసేలా చూడాలి. సైకిల్ తొక్కడం, పరుగెత్తడం, ఈత, ఆటలు వంటివి శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. అలాగే జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించి పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు వంటి పోషకాహారాన్ని వారికి అందించాలి. మొబైల్, టీవీ ముందు ఎక్కువ సమయం గడపకుండా చిన్నారులు ఆటలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రోత్సహించాలి.

పాఠశాలల్లో అత్యవసర వైద్య సదుపాయాలు అవసరం

పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతారు. అందువల్ల అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు ఉండటం ఎంతో ముఖ్యం. ఉపాధ్యాయులు ప్రథమ చికిత్స, సీపీఆర్‌ (CPR) వంటి ప్రాణరక్షక విధానాలపై శిక్షణ పొందాలి. పిల్లలు అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్యసాయం అందించాలి.


ఇవీ చదవండి

ఆ మందులు ఎక్కువగా వాడితే చూపు కోల్పోయే ప్రమాదం.. ఎఫ్‌డీఏ హెచ్చరిక..!

ఛాతివ్యాధుల ఆస్పత్రిలో మూతపడిన విభాగాలు

Updated Date - Nov 11 , 2026 | 07:02 AM