Share News

ఆ మందులు ఎక్కువగా వాడితే చూపు కోల్పోయే ప్రమాదం.. ఎఫ్‌డీఏ హెచ్చరిక..!

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:01 AM

బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న కొన్ని ప్రముఖ ఔషధాలపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది.

ఆ మందులు ఎక్కువగా వాడితే చూపు కోల్పోయే ప్రమాదం.. ఎఫ్‌డీఏ హెచ్చరిక..!
GLP-1 Drugs side effects

ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న కొన్ని ప్రముఖ ఔషధాలపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో వంటి ఔషధాలను ఉపయోగించే వారిలో అరుదైన కంటి సమస్య వచ్చే ప్రమాదం ఉండవచ్చని వెల్లడించింది. అకస్మాత్తుగా ఒక కంటిలో చూపు తగ్గడం, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా చూపు కోల్పోవడం కూడా జరగవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్-1 (జీఎల్‌పీ-1) తరహా ఔషధాల తయారీ సంస్థలు తమ మందులపై కొత్త భద్రతా హెచ్చరికలను చేర్చాలని ఆదేశించింది (FDA Warning GLP-1 Drugs).


ఎఫ్‌డీఏ హెచ్చరించిన కంటి సమస్య పేరు నాన్ ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (ఎన్ఏఐఓఎన్). కంటిలోని ఆప్టిక్ నర్వ్‌కు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఆప్టిక్ నర్వ్ అనేది కంటికి కనిపించే సమాచారాన్ని మెదడుకు చేరవేసే కీలకమైన నరం. జీఎల్‌పీ-1 మందులు ఎక్కువగా వాడడం వల్ల ఆ నరం దెబ్బతినే ప్రమాదముందని ఎఫ్‌డీఏ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా నిద్రలేచినప్పుడు ఒక కంటిలో చూపు తగ్గడం, మసకగా కనిపించడం, చూపులో కొన్ని భాగాలు కనిపించకపోవడం వంటివి జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో చూపు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది (Ozempic Side Effects).


మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు బరువును తగ్గించడంలో కూడా జీఎల్‌పీ-1 ఔషధాలు అద్భుతంగా పని చేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి (Weight Loss Injections). అయితే ఈ ఔషధాలు ఉపయోగించిన ప్రతి లక్ష మందిలో దాదాపు ఆరుగురు అరుదైన కంటి సమస్యకు గురైనట్టు తేలింది. కాగా, ఈ మందులు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. కంటి సమస్య చాలా అరుదుగా నమోదవుతోంది. అయితే చూపులో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎన్ఏఐఓఎన్ సమస్య నిర్ధారణ అయినవారు ఈ మందులను కొనసాగించాలా? నిలిపివేయాలా? అనే విషయాన్ని వైద్యులతో చర్చించాలి. అవసరమైతే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలని ఎఫ్‌డీఏ సూచించింది.


ఇవి కూడా చదవండి..

ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..


స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 10 , 2026 | 11:01 AM