సివిల్స్ మెయిన్స్ తీరు - తెన్నూ ప్రశ్నల్లో మార్పు సుస్పష్టం!
ABN , Publish Date - Aug 31 , 2026 | 02:21 AM
సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ప్రధానంగా భావించే జనరల్ స్టడీస్, ఎథిక్స్ పేపర్లు ఊహించిన విధంగానే వచ్చాయి. ప్రామాణిక పుస్తకాలకు తోడు సమకాలీన అంశాలపై పట్టు అదే...
సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ప్రధానంగా భావించే జనరల్ స్టడీస్, ఎథిక్స్ పేపర్లు ఊహించిన విధంగానే వచ్చాయి. ప్రామాణిక పుస్తకాలకు తోడు సమకాలీన అంశాలపై పట్టు అదే విధంగా మునుపటి ప్రశ్నపత్రాలను లోతుగా అనుసరించిన అభ్యర్థులకు పెద్దగా ఇబ్బంది కలిగి ఉండకపోవచ్చు. అయితే పైపైకి పరిశీలించినంత సులువుగా ప్రశ్నలు లేవన్నది యథార్థం. అదేమిటో తెలుసుకుంటే వచ్చే ఏడాది మెయిన్స్‌కు ఇప్పట్నించే జాగ్రత్త పడవచ్చు. గ్రూప్ 1 వంటి పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకూ సన్నద్ధం కావచ్చు.
జనరల్ స్టడీస్ కింద ప్రత్యేకించిన పేపర్లలో మునుపటి ప్రశ్నలు, టాపిక్సే ప్రత్యక్షమయ్యాయి. 2015 నుంచి 2025 వరకు పదేళ్ళలో అడిగిన ప్రశ్నలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వచ్చాయి. ఉదాహరణకు ప్రభావ వర్గాలు(ప్రెజర్ గ్రూప్స్)పై ప్రశ్న 2017, 2019, 2021, 2025లో అడిగారు. అదే ఈ ఏడాదీ వచ్చింది. 2020లో కులంపై అడిగిన ప్రశ్న కేవలం ఒక్క పదం మార్పుతో కనిపించింది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ అధికారాలపై 2018లో ప్రశ్నించారు. అయితే అదే ప్రశ్నలో షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను కూడా ఈసారి కలిపేశారు. డబ్ల్యుటీఓ, వ్యవసాయ సబ్సిడీలపై ప్రశ్నలు దాదాపు 2023లో అడిగినవాటి మాదిరిగానే ఉన్నాయి. లడఖ్ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమాలపై రెండేళ్ళలోనే మళ్ళీ ప్రశ్నించారు.
జరిగిన మార్పంతా ప్రశ్న రూపకల్పన, అడిగిన లోతు, తీరులో ఉంది. ఈ ఏడాది జనరల్ స్టడీస్ మొదటి పేపర్ మాత్రమే ముక్కు సూటిగా ఉంది. రెండు, మూడు, నాలుగు పేపర్లలో మాత్రం ప్రశ్నల స్వభావం మారింది.
ఇంట్లో హాయిగా కూర్చుని ప్రశ్నపత్రం చూస్తే బాగానే ఉంటుంది. అదే పరీక్ష గదిలో ఒకింత ఒత్తిడి తోడవుతుంది. ప్రశ్నలో అసలు ఏమి అడిగారన్నది అర్థం చేసుకోవాలి. అదే సమయంలో నిర్ధుష్టంగా అడిగిన అన్ని కోణాలను స్పృశిస్తూ ఇచ్చిన గడువులో సమాధానాన్ని రాయడం మాత్రం అంత తేలిక కాదు అన్నది స్పష్టం.
మెయిన్స్‌లో ఒక్క విషయాన్ని మాత్రమే ప్రశ్నించడం అరుదు. ఒక్క లైన్‌లోనే రెండు నుంచి మూడు విషయాలు అడుగుతారు. ప్రతి దానికి సొంతంగా జవాబు ఇవ్వాలి. ఉదాహరణకు సాలిడ్ వేస్ట్(ఘన వ్యర్థాలు)పై అడిగిన ప్రశ్న అభ్యర్థులకు సవాలు విసిరింది. దీనిపై ప్రభుత్వ విధానానికి తోడు న్యూఢిల్లీ, ఇండోర్‌లో సాధించిన విజయాలు - వైఫల్యాలపై ప్రశ్నించారు. ఇవన్నీ కలుపుతూ 250 పదాల్లో సమాధానాన్ని ముగించడమే అసలు సిసలైన సవాలు.
ఏజెంటిక్ ఏఐలోనూ ఏమిటి, అదెలా పనిచేస్తుంది, ఎక్కడ ఉపయోగించవచ్చు, ప్రయోజనాలు - ఇబ్బందులు - సవాళ్ళు రాయాలన్నది డిమాండ్. ఫెడరలిజమ్‌పై అడిగిన ప్రశ్నలోనూ భిన్నత్వం, అసమాన సమాఖ్య ఎలాంటి పాత్ర పోషిస్తుంది, ఎటువంటి చర్యలతో వివాదాలను మెరుగ్గా పరిష్కరించవచ్చని అడిగారు. ఓటుహక్కుపై పదిమార్కులకు అడిగిన ప్రశ్నలోనూ మూడు కోణాలు ఉన్నాయి. ప్రశ్న ఏదైనా అందులో అడిగిన ఏ బిట్ విడిచిపెట్టినా అభ్యర్థికి మార్కులపరంగా నష్టం జరుగుతుంది.
"Vijayanagara architecture exemplifies the amalgamation of past traditions with contemporary practices. Elucidate with examples." ఈ ప్రశ్నను చూడండి. సింపుల్‌గా ఆర్కిటెక్చర్‌పై అడిగిన ప్రశ్న అనిపిస్తుంది. అయితే, వీరికి ముందు పాలించిన చాళుక్యులు, హోయసాల స్టయిల్స్‌కు తోడు విజయనగర రాజులు కొత్తగా చేసినవీ అదీ వాటి పేర్లను ఉదహరిస్తూ సమాధానం రాయాలి.
బ్రిక్స్‌పై ఇచ్చిన ప్రశ్నలో ఇతర గ్రూపులతో పోలికలు అడిగారు. అంటే ఆ ఇతర గ్రూపులపై కూడా అభ్యర్థికి అవగాహన ఉండి తీరాలి. ఫేక్ న్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ఐటీ విధానాలకు జరిగిన సవరణలోనూ మరిన్ని కోణాలను జోడించారు. జీఎ్‌సఐపై ప్రశ్నలోనూ లూ, చినూక్, ఫో ప్రస్తావించి ప్రాంతం, ప్రకృతి, వాతావరణ ప్రభావాలపరంగా పోలిక అడిగారు.
సిలబ్‌సలోని రెండు మూడు ఏరియాలను కలుపుతూ ప్రశ్నలు వచ్చాయి. లడఖ్‌పై ప్రశ్నలో సరిహద్దు భద్రత, పాలిటీకింద ఆరో షెడ్యూల్‌ను కలగలిపారు. పోషకాహరం లోపంపై అడిగిన ప్రశ్నలో ప్రజారోగ్యం, సాంఘిక సమానత్వం, సంక్షేమ పాలన మూడింటినీ అడిగారు. జనరల్ స్టడీస్ మూడో పేపర్లో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో విపత్తు తగ్గింపునకు సంబంధించి ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను కలిపేశారు. జనరల్ స్టడీస్ మొదటి పేపర్లో ఒకే ప్రశ్నలో ప్లాన్డ్ ఎకానమీ, ప్రాంతీయ అసమానతలు, స్వాతంత్ర్యానంతర చరిత్రను ముడివేశారు. వీటిని దేనికదిగా చదువుకున్న అభ్యర్థి - అన్నింటినీ ఒక్క సమాధానంలోకి చేర్చాలి.
ప్రశ్నలో కొత్తదనం అంటే పాత టాపిక్‌కు కొత్త పరిణామాలను కలపడమే. ఫాస్ట్‌బ్రీడర్ రియాక్టర్‌తో క్రిటికాలిటీని కలిపారు. టెర్రర్ ఫండింగ్‌తో ఎఫ్‌ఏటీఎ్‌ఫను జతచేశారు. ప్రైవసీ హక్కును ట్రాన్స్‌జండర్ పర్సన్స్‌కు సంబంధించి 2026 సవరణలతో ముడిపెట్టారు. పాత విషయాలకు సమకాలీనతను జోడించారు.
పితృస్వామ్యం - పరోపకారం అనే ప్రశ్నలో రెండు భావనలను పేర్కొన్నారు. వాటిని ఒక వైద్యుని చర్యతో వివరించాలని కోరారు. అంటే ఇక్కడ నిర్వచిస్తే సరిపోదు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల విషయంలోనూ విద్యా హక్కును రోజువారి పాలనతో ముడిపెట్టారు. శాసనోల్లంఘన, ఆరాచకం విషయంలో అంబేడ్కర్ చేసిన హెచ్చరిక అలాగే పక్షపాత డేటా ఆధారంగా నిర్మించిన పోలీస్ సాఫ్ట్‌వేర్, సంక్షేమ పథకాల నుంచి కార్మికులు, వృద్ధులను తప్పుగా తిరస్కరించే వేలి ముద్రల తనిఖీలపై ఉన్న కేస్ స్టడీ్‌సను అడిగారు.
ప్రశ్నల వెనుక ఉన్న విలువల్లో మార్పులేదు. సిలబ్‌సను ఆసాంతం చదివిన అభ్యర్థి కొత్త పదాల వెనుక ఉన్న పాత సూత్రాలను గ్రహించగలగాలి. పదమూడేళ్ళలో బయో ఎథిక్స్‌పై వచ్చిన ఒక ప్రశ్న ఏకంగా నలభై మార్కులను అక్రమించింది. మహిళ సమ్మతితో గర్భాశయాన్ని తొలగించిన కేసు వంటివి కూడా వచ్చాయి. సమ్మతి, నిఘా, ప్రజలను మినహాయించే సాంకేతికత అనేవి ప్రధాన అంశాలుగా నిలిచాయి.
ఎథిక్స్ పేపర్లోనూ నాలుగు లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. మొదటి సెక్షన్‌లో కాన్సె్‌ప్టలను పరిస్థితులతో కలిపి ప్రశ్నించారు. రెండో సెక్షన్‌లో అడిగినవన్నీ కేస్ ఆధారిత ప్రశ్నలే. "The arms are fair when the intent of bearing them is just" షేక్‌స్పియర్ లైన్ ఇది. దీనిపై అడిగిన ప్రశ్నలో మొదట ఆయన లైన్ అర్థం చేసుకోవాలి. పరిపాలనకు దానిని అన్వయించాలి. ఈ రెండు టాస్క్‌లను పూర్తి చేయాలి.

రాబోయే పరీక్షల్లో
ఈ మెయిన్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే వచ్చే ఏడాది ఇదే ఎగ్జామ్ అలాగే గ్రూప్ 1కు ప్రిపరేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రామాణిక పుస్తకాలతో పునాది ఏర్పరుచుకుని, దానికి సమకాలీన సంఘటనల(కరెంట్ అఫైర్స్)ను జోడించుకోవాలి. పదేళ్ళ ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. సమకాలీనతను కలిపి ప్రశ్నించిన తీరుకు అనుగుణంగా సమాధానం రాయగలగాలి.
బయో ఎథిక్స్ అలాగే టెక్నాలజీ ఎథిక్స్‌ను కలుపుకోవాలి. ఆ క్రమంలో సమాచారంతో కూడిన సమ్మతి, ఉపకారం, అల్గారిథమిక్ పక్షపాతం, మినహాయింపు లోపం, మానవ పర్యవేక్షణ వంటి పదాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.
ప్రశ్నకు అనువుగా చదవడం, నేర్చుకోవడం చాలా ముఖ్యం.
రెండు మూడు భావనలను వాటికి సంబంధించి సమకాలీన అంశాలను కలగలిపి సమాధానం రాయగలిగేలా సన్నద్ధం కావాలి.
పాత ప్రశ్నపత్రాల్లో అడిగిన వాటిని పదేపదే చదవాలి. ఒక ప్రశ్నలో అడిగిన ముక్కలను వేరు చేయాలి. అ ముక్కలకు సంబంధించి వాస్తవాలను గ్రహించాలి. మళ్ళీ వాటిని కలుపుకొంటూ రాయడం ప్రాక్టీస్ చేయాలి.
ఏదోలా జవాబు రాశామంటే మార్కులు రావని గ్రహించాలి. ఈ ఏడాది స్పష్టంగా కనిపించిన మార్పులను గుర్తించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చే ఏడాది రాయబోయే అభ్యర్థులపై ఉంది.
కల్యాణ్ ఐనంపూడి,
చీఫ్ మెంటార్, లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ అకాడమీ
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News