వాటాల్లో మోసాలు.. వారసుల జగడాలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:00 AM
తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? రాజకీయ నాయకులు తరచుగా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అయితే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ ఆత్మస్తుతి, పరనిందనే నమ్ముకుంటున్నాయి. అవకాశం లేనివాళ్లు..
ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లల మధ్య అయినా, తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ పిల్లల మధ్య అయినా వివాదాలు ఏర్పడటానికి అక్రమ సంపాదనే కారణంగా కనిపిస్తోంది.
ఈ ఉదంతం రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం వంటిది. అధికారంలో ఉన్నప్పుడు అపరిమిత సంపద కోసం పరిగెత్తకూడదని సూచిస్తోంది. అక్రమంగా కానీ, సక్రమంగా కానీ సంపాదించుకొని ఉంటే వాటిని పిల్లలకు సమానంగా పంచేయండి. బినామీల పేరిట కొనుగోలు చేయవద్దు. వైఎస్ చేసిన తప్పు చేయకూడదని ఈ ఉదంతం చెబుతోంది. కేటీఆర్‌తో కవిత విభేదించడానికైనా, జగన్ రెడ్డితో షర్మిల విభేదించడానికైనా ఆస్తులతో పాటు అధికారంలో వాటా దక్కకపోవడమే ప్రధాన కారణం కాదని చెప్పగలరా?
వైఎస్ మరణించి ఉండకపోతే ఆస్తుల పంపకాలు జరిపించి ఉండేవారేమో! ఇప్పుడు ఆయన లేరు కనుక కుటుంబ పెద్దగా జగన్ రెడ్డి కొంత ఉదారంగా వ్యవహరించి ఉంటే ప్రస్తుత వివాదాలు తలెత్తి ఉండేవి కావు. రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ప్రస్తుతం నిస్సహాయురాలు. ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభ పగ వారికి కూడా ఎదురవకూడదు. యలహంకలోని భవనాలు, భూమి తనకు ఎలా సమకూరాయో జగన్ రెడ్డి చెప్పగలరా? అడ్డదారుల్లో సంపాదించుకున్న వాటి కోసం మంకు పట్టుకుపోయి అల్లరిపాలయ్యేకంటే రక్తం పంచుకు పుట్టిన చెల్లి పట్ల ఉదారత్వం ప్రదర్శిస్తే బాగుండును అని జగన్ రెడ్డికి ఎవరు చెప్పాలి?
బెంగళూరులో ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న భవనంలోనే తన కుమార్తె వివాహం జరిపించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే షర్మిల ఉంటున్న భవనానికి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న జగన్ రెడ్డి భద్రతా కారణాలు చూపించి అక్కడ పెళ్లి చేయవద్దని చెల్లికి లేఖ రాశారు. దీంతో షర్మిల కుమార్తె వివాహ వేదిక మారింది. ఇది ఆ కుటుంబానికి చెందిన అంతర్గత వ్యవహారం మాత్రమే అయి ఉంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ రెడ్డి, షర్మిల కోసం యలహంకలో దాదాపు 20 ఎకరాలలో రెండు భవనాలను నిర్మించింది ఎవరు? ఇప్పుడు ఆ భవనాలకు యజమానురాలిగా రికార్డుల్లో ఉన్న సుగుణమ్మనే నిర్మించారా? వాటిని ఆమె స్వయంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించారా? లేక రాజశేఖర రెడ్డి కుటుంబం అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించారా? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రావలసి ఉంది.
స్థానిక సంస్థల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు గీటురాయి కానేకావు. వివిధ కారణాల వల్ల స్థానిక ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వస్తాయి. సాధారణ ఎన్నికల గడువుకు రెండేళ్లలోపు జరిగే ఉప ఎన్నికలు, శాసన మండలి స్థానాలకు జరిగే ఎన్నికల ఫలితాల సరళే సాధారణ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది.
ఈ వాస్తవం అన్ని పార్టీలకూ తెలుసు. ఐదేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 90ు పైగా సీట్లు గెలుచుకుంది. రెండేళ్లకు ఆ పార్టీ ఓడిపోయింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఇంతోటి దానికి స్థానిక ఎన్నికలకు పార్టీలెందుకు సిగపట్లకు దిగుతాయో తెలియదు.
నిజానికి స్థానిక సంస్థలను గెలుచుకున్న అధికార పార్టీకి సాధారణ ఎన్నికల్లో అవే గుదిబండలుగా మారతాయి. తొంభై శాతం స్థానాలు గెలుచుకున్నామని జబ్బలు చరుచుకుని తాత్కాలికంగా పొంగిపోయి ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో చతికిలపడటం ఎందుకు? స్థానిక ఫలితాలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. కనుక ప్రతిపక్షం కూడా పంతాలకు పోయి ఇల్లూ ఒళ్లూ హూనం చేసుకోవడం ఎందుకు?
తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? రాజకీయ నాయకులు తరచుగా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అయితే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ ఆత్మస్తుతి, పరనిందనే నమ్ముకుంటున్నాయి. అవకాశం లేనివాళ్లు.. అంటే అధికారం లేనివాళ్లు ఆక్రందనలు చేస్తారు. అధికారంలో ఉన్నవాళ్లు తమ చర్యలను సమర్థించుకుంటూ ఉంటారు. ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం కూడా పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలే ఇందుకు నిదర్శనం. ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విమర్శిస్తున్నారు. పలుచోట్ల ఏకగ్రీవాలు జరగడం, మరికొన్ని చోట్ల నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితులు ఉండటం ఏమిటి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నల్లో హేతుబద్ధత లేకపోలేదు. అయితే ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శోకాలు పెట్టింది. సీన్ కట్ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని జగన్‌రెడ్డి ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయలేకపోయామని, భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించగా, ఇప్పుడు జగన్‌రెడ్డి అవే ఆరోపణలు చేస్తున్నారు. ‘అప్పుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనే చంద్రబాబుకు దిక్కు లేదు. అక్కడ పంచాయతీలు, మున్సిపాలిటీలను బాబు గెలిపించుకోలేకపోయారు. ప్రజలు ఆయనను పూర్తిగా తిరస్కరించారు. కుట్రలు, గొడవలు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ రికార్డు స్థాయిలో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదొక విప్లవాత్మక విజయం’ అని అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. ‘దేవుడి దయ, ప్రజల దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘనవిజయాన్ని అందించాయి. గ్రామాలతో పాటు పట్టణాలు కూడా పనిచేస్తున్న మా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో నూటికి 97 మార్కులు వేసిన అవ్వా తాతలు, అక్కా చెల్లెమ్మలు, సోదరులందరికీ ధన్యవాదాలు. మ్యానిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమం అందించినందుకే ఈ విజయం దక్కింది’ అని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్రెడ్డి చెప్పుకొన్నారు. ‘ఇది జగన్ సంక్షేమ పాలనకు రెఫరెండం. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ముగిసింది. పల్లె నుంచి పట్టణం దాకా ఏకపక్షంగా వచ్చిన ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిపక్షం లేని రాష్ట్రంగా మార్చాయి. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో అధికార పక్షానికి తక్కువ సీట్లు వస్తాయి. కానీ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జగన్ నాయకత్వంపై భరోసాతో వంద శాతం సీట్లలో గెలిపించారు’ అని అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గొప్పలు చెప్పుకొన్నారు. ‘ఫ్యాన్ గాలికి పచ్చ జెండా కొట్టుకుపోయింది. సంక్షేమ పథకాలే ఆయుధంగా వైసీపీ ప్రభంజనం వీచింది. మూడు రాజధానులకు జై కొడుతూ విశాఖ ప్రజలు తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవానికి చరమగీతం పాడారు’ అని అప్పుడు వైసీపీలో ఉన్న విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు వంటి వారు కూడా ఇదే తరహాలో మాట్లాడారు. సీన్ కట్ చేస్తే రెండున్నరేళ్ల తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ చతికిలపడింది. ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు కుప్పంలో జరిగినట్టుగానే ఇప్పుడు జగన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో కూడా అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. ప్రొద్దుటూరు లాంటి మున్సిపాలిటీ కూడా ఏకగ్రీవం అయింది. ఈ ఏకగ్రీవాలు, నామినేషన్లు వేయలేని పరిస్థితికి ఎవరిని నిందించాలి? ఐదేళ్ల క్రితం జరిగింది ఒప్పయితే ఇప్పుడు జరిగిన వాటిని కూడా సమర్థించాలి. అప్పుడు జరిగినవి తప్పయితే ఇప్పుడు జరుగుతున్నవి కూడా తప్పే అవుతాయి. అంతేగానీ జగన్‌రెడ్డి సుద్దపూస, చంద్రబాబు దుర్మార్గుడు అని నిందించలేం కదా!
ప్రజాసేవకు మించి..
నిజానికి స్థానిక సంస్థల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు గీటురాయి కానేకావు. వివిధ కారణాల వల్ల స్థానిక ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వస్తాయి. సాధారణ ఎన్నికల గడువుకు రెండేళ్లలోపు జరిగే ఉప ఎన్నికలు, శాసనమండలి స్థానాలకు జరిగే ఎన్నికల ఫలితాల సరళే సాధారణ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. ఈ వాస్తవం అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు. అయినా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూనే ఉంటాయి. ఐదేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి 90శాతం పైగా సీట్లు గెలుచుకుంది. సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇంతోటి దానికి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు సిగపట్లకు దిగుతాయో తెలియదు. నిజానికి స్థానిక సంస్థలను గెలుచుకున్న అధికార పార్టీకి సాధారణ ఎన్నికల్లో అవే గుదిబండలుగా మారతాయి. సర్పంచ్ నుంచి మేయర్‌గా ఎన్నికైనవారు ఎంతో కొంత వెనకేయకుండా ఉండరు. ఈ కారణంగా ప్రజల్లో ఏర్పడే వ్యతిరేకత ప్రభుత్వంపై పడకుండా ఉంటుందా? అందుకే అధికార పార్టీలు ఎన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే అంత ఎక్కువ నష్టం జరుగుతుందని ఛమత్కరిస్తుంటారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు.. వీళ్లంతా ఎన్నికల్లో గెలుపు కోసం ఖర్చు చేస్తుంటారు. గెలిచినవాళ్లు తాము ఖర్చు చేసిన సొమ్మును ప్రజల నుంచే వసూలు చేస్తుంటారు కదా! అనుమతుల మంజూరులో, అభివృద్ధి పనుల అమలులో అవినీతికి పాల్పడతారు. దీని ప్రభావం అధికారంలో ఉన్న పార్టీ పైనే పడుతుంది కదా! గతంలో స్థానిక సంస్థలకు ఆయా పార్టీల్లోని ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులే పోటీపడేవారు. ఇప్పుడు శాసనసభకు పోటీ చేసే స్థాయి ఉన్న నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇదంతా ప్రజాసేవ కోసం అంటే నమ్మలేం. ప్రజా సేవకు మించిన ప్రయోజనం ఏదో ఉంటుంది. తమ నాయకులు, కార్యకర్తలకు పదవుల పందేరానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడుతూ ఉంటే ఉండవచ్చును గానీ అవినీతి, అక్రమాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి.
మడత పెట్టడం మాని.. బుర్ర పెట్టండి!
అధికార వికేంద్రీకరణ అనే మహత్తర లక్ష్యంతో స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని చట్టం తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేస్తుంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు స్థానిక సంస్థలు పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్నవారు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల విషయమే తీసుకుందాం. వారికి అధికారాలు ఉండవు, నిధులు కూడా ఉండవు. ఒకప్పుడు జిల్లా పరిషత్‌లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. జిల్లాలో అభివృద్ధి పనులు, ఉపాధ్యాయుల బదిలీలు వంటివన్నీ జిల్లా పరిషత్‌ల ఆధ్వర్యంలోనే జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. జిల్లా పరిషత్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. అయినా ఈ విధానాన్నే పట్టుకొని వేలాడుతున్నాం. సర్పంచులు ఉన్నాక దాదాపు అదే ప్రాంతానికి ఎంపీటీసీ అవసరం ఏమిటో తెలియదు. ఆరో వేలు వంటి ఈ పదవుల కోసం జరిగే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు, స్థానిక నాయకులకు ప్రతిష్ఠాత్మకంగా మారడం వింతగా ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ధోరణులు ప్రబలుతున్నాయి. రాజ్యం వీర భోజ్యం అన్నట్టుగా అధికారంలో ఉన్న పార్టీ ఏకగ్రీవాల కోసం టార్గెట్లు నిర్ణయిస్తోంది. ప్రతిపక్షం పోటీ కూడా చేయకూడదని కోరుకుంటోంది. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. అదేమని ప్రశ్నిస్తే ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అంటున్నారు. అధికారంలో ఉన్నవాళ్లు అధికార దుర్వినియోగానికి, బెదిరింపులకు పాల్పడని పక్షంలో కుప్పం, పులివెందుల వంటి నియోజకవర్గాలలో ఏకగ్రీవాలు ఎలా సాధ్యం! ఎన్నికల్లో గెలిచిన వారి చర్యల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా అధికార పార్టీలు వెనుకాడకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. నిజానికి ఏకగ్రీవాల వల్ల ప్రజలకు ఒక రకంగా మేలు జరగాలి. పోటీ లేకపోతే గెలవడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవడానికి అవినీతికి పాల్పడవలసిన అవసరమూ రాదు. అలా జరిగే పక్షంలో ప్రజలు కూడా ఏకగ్రీవాలను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. కానీ ఆచరణలో అలా జరగడం లేదు. ఏకగ్రీవం అయినచోట కూడా న్యాయం, ధర్మం నాలుగు పాదాల మీద నడవడం లేదు. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీల అధినేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల ప్రయోజనం ఉండదు. తొంభై శాతం స్థానాలు గెలుచుకున్నామని జబ్బలు చరుచుకుని తాత్కాలికంగా పొంగిపోయి ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో చతికిలపడటం ఎందుకు? స్థానిక ఫలితాలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. కనుక ప్రతిపక్షం కూడా పంతాలకు పోయి ఇల్లూ ఒళ్లూ హూనం చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఊహించవచ్చు. మెజారిటీ సీట్లు సాధించినంత మాత్రాన 2029లో కూడా ప్రజలు అధికార కూటమికే పట్టం కడతారని చెప్పలేం. ఒకవేళ స్థానిక ఎన్నికల్లో అధికార పక్షానికి ప్రతికూల ఫలితాలు వచ్చినా ప్రభుత్వాలేవీ పతనం కావు కదా! అయినా చొక్కాలు మడతపెట్టడం, కుర్చీలు మడతపెట్టడం అవసరమా?
...అందుకే సుగుణమ్మ పేరిట కొనుగోలు!
ఇక దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఇంట వివాహం విషయమై చెలరేగిన వివాదం విషయానికి వద్దాం. బెంగళూరులో ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న భవనంలోనే తన కుమార్తె వివాహం జరిపించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే షర్మిల ఉంటున్న భవనానికి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న జగన్‌రెడ్డి భద్రతా కారణాలు చూపించి అక్కడ పెళ్లి చేయవద్దని చెల్లికి లేఖ రాశారు. దీంతో షర్మిల కుమార్తె వివాహ వేదిక మారింది. ఇది ఆ కుటుంబానికి చెందిన అంతర్గత వ్యవహారం మాత్రమే అయి ఉంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్‌రెడ్డి, షర్మిల కోసం యలహంకలో దాదాపు 20 ఎకరాలలో రెండు భవనాలను నిర్మించింది ఎవరు? ఇప్పుడు ఆ భవనాలకు యజమానురాలిగా రికార్డుల్లో ఉన్న సుగుణమ్మనే నిర్మించారా? వాటిని ఆమె స్వయంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించారా? లేక రాజశేఖరరెడ్డి కుటుంబం అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించారా? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రావలసి ఉంది. ఈ విషయంలో వాస్తవం ఏమిటో తెలియాలంటే విజయసాయిరెడ్డి నోరు విప్పాల్సిందే. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌రెడ్డి సమకూర్చుకున్న కంపెనీలు, ఆస్తుల వెనుక వ్యూహకర్త విజయసాయి మాత్రమే! ఈ కారణాలతోనే సీబీఐ కేసుల్లో ఆయన ఏ–2గా ఉన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ఆ కుటుంబానికి యలహంకలో ఆస్తులు లేవు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యలహంకలో 20 ఎకరాలు కొనుగోలు చేయించారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములు కొనాలంటే ఆ కొనుగోలుదారు పేరిట దేశంలో ఎక్కడో ఒకచోట వ్యవసాయ భూమి ఉండాలి. యలహంకలో కొనాలనుకున్న భూమి అప్పట్లో వ్యవసాయ భూమిగా రికార్డుల్లో ఉంది. ఈ కారణంగానే భారతిరెడ్డి తల్లి సుగుణమ్మ పేరిట ఆ భూమిని కొనుగోలు చేయించి అందులో జగన్, షర్మిల కోసం రెండు భవనాలు నిర్మింపజేశారు. అంటే భారతి తల్లి సుగుణమ్మ కేవలం బినామీ మాత్రమే. ఆ భూమి గానీ, ఆ భవనాలు గానీ ఆమె స్వార్జితం కాదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా పోగైన సంపదతోనే ఆ 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో భవనాలు నిర్మించారన్నది బహిరంగ రహస్యం. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కోసం నిర్మించిన భవనంలోకి షర్మిల గృహప్రవేశం చేశారు.
1999కి ముందు వ్యవసాయ భూమిగా ఉన్న ఆ ప్రాంతాన్ని నివాస ప్రాంతంగా ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం మార్చింది. బెంగళూరు నగరం కూడా విస్తరించింది. షర్మిల కోసం నిర్మించిన భవనం, అది ఉన్న స్థలంతో కలిపితే దాని విలువ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ఉంటుంది. జగన్‌రెడ్డి నివసిస్తున్న భవనం, స్థలం కూడా అంతే విలువ చేస్తాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పిల్లలైన జగన్‌రెడ్డి, షర్మిల కోసం హైదరాబాద్‌లో లోటస్ పాండ్, బెంగళూరులోని యలహంక వద్ద రెండేసి భవనాలను పక్క పక్కనే నిర్మింపజేశారు. అయితే వాటి నిర్మాణానికి అయిన ఖర్చులకు సోర్స్ కావాలి కనుక బినామీల పేరిట పెట్టారు. ఆ కారణంగానే భారతిరెడ్డి తల్లి సుగుణమ్మ తెర మీదకు వచ్చారు. ఈ విషయం విజయమ్మతో పాటు జగన్‌రెడ్డి, భారతిరెడ్డి, షర్మిల, విజయసాయిరెడ్డిలకు కూడా తెలుసు. జరిగింది ఇది కాగా ఇప్పుడు తన అత్త గారి పేరిట యలహంకలో ఉన్న రెండు భవనాలు తనవే అని జగన్‌రెడ్డి చెప్పడంతో అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. అపరిమిత సంపద, అపరిమిత అధికారం అనర్థాలకు దారితీస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. బెంగళూరు భవనాలను బినామీల పేరు మీద పెట్టకుండా షర్మిల పేరిటే ఏర్పరిచి ఉంటే ప్రస్తుత వివాదం ఏర్పడేది కాదు. షర్మిల తన కుమార్తె అంజలీరెడ్డి వివాహాన్ని ప్రస్తుతం తాను నివసిస్తున్న భవనంలో నిర్వహించుకోవడానికి ఆటంకాలు ఎదురయ్యేవి కావు. ఏపీలో రాజశేఖరరెడ్డి పిల్లల మధ్య అయినా, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లల మధ్య అయినా వివాదాలు ఏర్పడటానికి అక్రమ సంపాదనే కారణంగా కనిపిస్తోంది. రాజశేఖరరెడ్డి తన మరణాన్ని ఊహించలేదు కనుక షర్మిలను దృష్టిలో పెట్టుకొని ఏర్పరిచిన ఆస్తులను కూడా ఆమె పేరిట బదలాయించలేదు. అయితే అప్పటికే ఆయన విజయసాయిరెడ్డిని హెచ్చరించారట. ఆస్తులు, కంపెనీలు అన్నీ జగన్ పేరిట ఉంటే షర్మిల పరిస్థితి ఏమిటి? అని విజయసాయిరెడ్డిని ఒక దశలో ప్రశ్నించారట. మెల్లమెల్లగా వాటిని గిఫ్ట్ రూపంలో షర్మిలకు బదలాయిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారట. జగన్‌రెడ్డి ఇలా మారతారని ఆనాడు రాజశేఖరరెడ్డి ఊహించి ఉండరు.
ఆ మాటకొస్తే షర్మిల కూడా ఊహించి ఉండరు. ఈ కారణంగానే అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు జగన్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు విజయమ్మతో పాటు షర్మిల కూడా లోక్‌భవన్ వద్దకు వెళ్లి ఫుట్‌పాత్‌పై బైఠాయించారు. ఆ తర్వాత విజయమ్మ, షర్మిల జనంలోకి వెళ్లారు. జగన్‌రెడ్డికి మద్దతు కూడగట్టడం కోసం షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇదంతా జరిగినప్పుడు అన్నా చెల్లి మధ్య సత్సంబంధాలు ఉండేవి. డబ్బు పాపిష్టిది. దానికితోడు అధికారం వచ్చిపడింది. ఫలితంగా అన్నా చెల్లి మధ్య విభేదాలు వచ్చి పడ్డాయి. అందుకే ఆస్తుల వివాదాలు అప్పుడప్పుడూ తెరమీదకు వస్తున్నాయి. ఈ ఉదంతం రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం వంటిది. అధికారంలో ఉన్నప్పుడు అపరిమిత సంపద కోసం పరిగెత్తకూడదని సూచిస్తోంది. అక్రమంగా కానీ, సక్రమంగా కానీ సంపాదించుకొని ఉంటే వాటిని పిల్లలకు సమానంగా పంచేయండి. బినామీల పేరిట కొనుగోలు చేయవద్దు. రాజశేఖరరెడ్డి చేసిన తప్పు చేయకూడదు అని ఈ ఉదంతం చెబుతోంది. కేటీఆర్‌తో కవిత విభేదించడానికైనా, జగన్‌రెడ్డితో షర్మిల విభేదించడానికైనా ఆస్తులతో పాటు అధికారంలో వాటా దక్కకపోవడమే ప్రధాన కారణం కాదని చెప్పగలరా? తన కుటుంబంలో ఇలాంటి దుస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే కాబోలు చంద్రబాబు ఒక బిడ్డతోనే సరిపెట్టుకున్నారు. రాజశేఖరరెడ్డి మరణించి ఉండకపోతే ఆస్తుల పంపకాలు జరిపించి ఉండేవారేమో! ఇప్పుడు ఆయన లేరు కనుక కుటుంబ పెద్దగా జగన్‌రెడ్డి కొంత ఉదారంగా వ్యవహరించి ఉంటే ప్రస్తుత వివాదాలు తలెత్తి ఉండేవి కావు. రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి ప్రస్తుతం నిస్సహాయురాలు. ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభ పగ వారికి కూడా ఎదురవకూడదు. యలహంకలోని భవనాలు, భూమి తనకు ఎలా సమకూరాయో జగన్‌రెడ్డి చెప్పగలరా? అడ్డదారుల్లో సంపాదించుకున్న వాటి కోసం మంకు పట్టుకుపోయి అల్లరిపాలయ్యేకంటే రక్తం పంచుకు పుట్టిన చెల్లి పట్ల ఉదారత్వం ప్రదర్శిస్తే బాగుండును అని జగన్‌రెడ్డికి ఎవరు చెప్పాలి? విషాదం ఏమిటంటే రాజశేఖరరెడ్డి కుటుంబంలో తరచుగా తలెత్తుతున్న ఈ వివాదాల పరిష్కారానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడాన్ని మించిన విషాదం ఏముంటుంది? శ్రేయోభిలాషులే లేనప్పుడు ఎన్ని ఆస్తులు సమకూర్చుకొని ఏమిటి ప్రయోజనం? సభ్య సమాజానికి ఇంతకు మించిన సందేశం ఏముంటుంది?
ఆర్కే
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News