శివుడికి సోమవారం అంటే ఎందుకు ప్రీతి.. ఈ రోజు పూజ చేస్తే..
ABN , Publish Date - Mar 09 , 2026 | 07:19 AM
భారత దేశంలో హిందువులు ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తుంటారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. ఈ రోజు స్వామిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ఇంటర్నెట్ డెస్క్: భారత దేశంలో హిందువులు ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తుంటారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. ఈ రోజు శివుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే సోమవారం రోజున పరమశివుడుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సోమవారం అంటేనే పరమేశ్వరునికి ఎందుకు అంత ప్రీతి? అనే విషయం గురించి తెలుసుకుందాం..
సోమవారం విశిష్టత వెనుక ఉన్న పురాణ గాథలు:
శివుడికి సోమవారం ఇష్టమైన రోజు కావడానికి ప్రధానంగా చంద్రుడితో ఉన్న సంబంధమే కారణం. దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను(నక్షత్రాలను) చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే, చంద్రుడు రోహిణిపై మాత్రమే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మిగిలిన భార్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. చంద్రుడు తమను పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు ఏడ్చుకుంటూ తండ్రి అయిన దక్షుడి వద్దకు వెళ్లి తమ గోడు విన్నవించుకుంటారు. మొదట దక్షుడు, చంద్రుడికి రోహిణితో పాటు అందరినీ సమానంగా చూడాలని నచ్చజెబుతాడు, వినకపోవడంతో హెచ్చరిస్తాడు. ఎంత చెప్పినా చంద్రుడిలో మార్పు రాకపోవడంతో దక్షుడు ఆగ్రహిస్తాడు.. నీలో తేజస్సు, ప్రకాశం తగ్గిపోవాలని శపిస్తాడు. దక్షుడి శాపం వల్ల చంద్రుడు రోజు రోజుకీ తన ప్రభను కోల్పోతాడు. దానితో పాటు పరిమాణం కూడా తగ్గిపోతుంటాడు.
చంద్రుడు భయంతో బ్రహ్మ దేవుడి వద్దకు వెళ్లి తన శాపం గురించి చెబుతాడు. తనను ఆ శాపం నుంచి రక్షించమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పరమశివుడు మాత్రమే నీకు సాయం చేయగలడని చంద్రుడికి చెబుతాడు. చంద్రుడు ప్రభాస తీర్థంలో శివుడిని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన బోళాశంకరుడు, అతడిని తన శిరస్సుపై ధరించి పునర్జీవం ప్రసాదిస్తాడు. చంద్రుడికి సోముడు అనే పేరు కూడా ఉంది.. శివుడు అభయమిచ్చిన రోజు సోమవారం కావడంతో శివుడికి ప్రీతికరమైన రోజైంది. పరమశివుడుని చంద్రశేఖరుడు, సోమనాథుడు అని కూడా పిలుస్తారు.
సోమవారం పూజ - ఫలితాలు:
సోమవారం రోజు శివుడిని ఆరాధించడం వల్ల కేవలం పుణ్యం మాత్రమే కాదు, మానసిక, భౌతిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ కారణం చేతనే సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుడుని పూజిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు ‘మనఃకారకుడు’. సోమవారం శివుడిని పూజించడం వల్ల జాతకంలోని చంద్ర దోషాలు తొలగి, ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల ‘మృత్యుంజయ’ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. సోమవారం ఉపవాసం ఉండి శివనామస్మరణ చేసేవారికి ఐశ్వర్యం, సత్సంతానం కలుగుతాయని భక్తుల నమ్మకం.
పూజా విధానం:
మహాశివుడు అభిషేక ప్రియుడు. శుద్ధమైన జలం, పాలు, పెరుగు, తేనె లేదా పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలు (మారేడు దళాలు) సమర్పించడం వల్ల మూడు జన్మల పాపాలు నశిస్తాయని అంటారు. పూజ సమయంలో ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. సాయంత్రం వేళ శివాలయంలో నెయ్యితో దీపం వెలిగించడం వల్ల జీవితంలో చీకట్లు (కష్టాలు) తొలగిపోతాయి.
ఇవి కూడా చదవండి..
వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రన్నింగ్ రైల్లో స్టంట్.. రెప్పపాటు కాలంలో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..