Share News

గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే ఒకేఒక ఆలయం.. విశేషాలివే..

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:59 PM

సాధారణంగా గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణ ప్రభావం దేవుళ్లపై పడుతుందనే కారణంగా ఆలయాలను మూసివేసి.. గ్రహణం ముగిసిన తరువాత అర్చకులు ఆలయాన్ని తెరచి శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు చేపడతారు. కానీ, గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచే ప్రసిద్ధ ఆలయం మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఒకటుంది. ఆ ఆలయమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే ఒకేఒక ఆలయం.. విశేషాలివే..
Srikalahasti Temple eclipse tradition

సాధారణంగా గ్రహణం రోజున దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఆలయాలన్నింటినీ మూసివేస్తారు. మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టెంపుల్స్‌ని గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణానికి కనీసం 6 గంటల ముందు గర్భగుడిని మూసివేసి.. గ్రహణం తరువాత సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరుస్తారు. ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది.


రాహువు - కేతువుల ప్రభావానికి అతీతం..

శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, ఈ ప్రదేశం రాహువు - కేతువుల ప్రభావానికి అతీతమైనది. రాహువు - కేతువులు గ్రహణానికి కారణమైన వారుగా పరిణగిస్తారు. అయితే, దేవదేవుడు కొలువైన శ్రీకాళహస్తి మాత్రం ఈ గ్రహణం వల్ల ప్రభావితం కాదని ప్రతీతి. అందుకే, గ్రహణ సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ మూతపడినప్పటికీ.. శ్రీకాళహస్తిలో మాత్రమే గుడి తలుపులు తెరిచి ఉంటాయి. ఆలయంలో శివుడు, జ్ఞానప్రసూనాంబిక దేవేరిలు భక్తులకు దర్శనం ఇస్తుంటారు.


గ్రహణ సమయంలో ప్రత్యేక 'అభిషేకం'..

గ్రహణం సమయంలో ఇక్కడి వాతావరణం భక్తితో ఉప్పొంగుతుంది. గ్రహణ సమయంలో పూజారులు ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైదిక శాస్త్రం ప్రకారం గ్రహణ కిరణాలు హానికరమని భావించినప్పటికీ, ఆ సమయంలో ఇక్కడ జరిగే పూజలో పాల్గొనడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ప్రత్యేకమైన పూజను చూడటానికి భక్తులు సైతం భారీ సంఖ్యలో శ్రీకాళహస్తికి తరలివస్తుంటారు.


భక్తుల రద్దీ.. విస్తృత ఏర్పాట్లు..

గ్రహణానికి భయపడి చాలా మంది తమ తమ ఇళ్లకే పరిమితమవుతుండగా.. శ్రీకాళహస్తిలో ఉన్న భక్తులు మాత్రం చాలా సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. గ్రహణ సమయంలో వేలాది మంది రాహు-కేతు దోష నివారణ పూజలు చేయించుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. మంగళవారం చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీకాళహస్తికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


గ్రహణ సమయంలో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు..?

హిందూ పురాణాల ప్రకారం.. రాహువు, కేతువుల ప్రభావంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని ప్రతికూల శక్తులు దైవిక పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తాయట. ఈ దుష్ట శక్తులు దైవానికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే దేవాలయాలను మూసివేస్తారట.

వాస్తవానికి దేవాలయాల్లో దేవతామూర్తి విగ్రహాలకు వేదమంత్రోచ్ఛారణలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. శక్తిని ప్రతిష్ఠింపజేస్తారు. గ్రహణ సమయంలో చెలరేగే దుష్ట శక్తులు.. ఈ దైవిక శక్తిపై చెడు ప్రభావం చూపుతుందని విశ్వాసం. అలా జరుగకుండా ఉండేందుకు, దేవతామూర్తుల విగ్రహాల పవిత్రతను కాపాడేందుకు గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తుంటారని అర్చకులు చెబుతున్నారు.


ఆలయాల శుద్ధీకరణ..

గ్రహణం ముగిసిన తర్వాత దేవాలయాన్ని.. ఆలయంలోని దేవతామూర్తులను ప్రత్యేకంగా శుద్ధి చేస్తారు. ఈ ఘట్టాన్ని సంప్రోక్షణ అంటారు. గ్రహణ సమయంలో కలిగిన ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి ఈ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. పవిత్ర జలంతో వేదమంత్రోచ్ఛారణల మధ్య శుద్ధీకరణ చేపడతారు. ఈ శుద్ధీకరణ జరిగిన తరువాత మాత్రమే భక్తులను దర్శనానికి ఆలయాల్లోకి అనుమతిస్తారు.


Also Read:

మార్చి నెలాఖరు వరకు పాకిస్తాన్ గగనతలం పాక్షిక మూసివేత

చైనా చమురు రంగంపై యుద్ధ ప్రభావం

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ప్రధాని మౌనాన్ని వీడాలి: రాహుల్ గాంధీ

Updated Date - Mar 03 , 2026 | 04:15 PM