ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ప్రధాని మౌనాన్ని వీడాలి: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:11 PM
ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రపంచంలో భారత్ స్థాయి దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ అధినేత అయతుల్లా ఖమేనీ (Ayatollah Khameini) మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మౌనాన్ని వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇలాంటి పరిణామాలను ఖండిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్నారు. ఇరాన్‌పై ఏకపక్షంగా జరుగుతున్న దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను ఖండించాలని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మౌనం దాలిస్తే ప్రపంచంలో భారత్ స్థాయి దిగజారే అవకాశం ఉందని అన్నారు.
ఇరాన్‌కు ఇజ్రాయెల్, అమెరికాలకు మధ్య ఘర్షణలు మరింత విస్తృతమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇది మధ్య ప్రాచ్యాన్ని మరింత అస్థిరతలోకి నెడుతుందని చెప్పారు. భారతీయులతో సహా అక్కడ కోట్లాది మంది అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు.
భద్రతాపరమైన భయాలు ఉన్నప్పటికీ ఒక దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం పరిస్థితిని మరింత దిగజారుస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. చర్చలు, సంయమనంతోనే శాంతి స్థాపనకు బాటలు పరచగలుగుతామని చెప్పారు.
నైతికత విషయంలో భారత్ స్పష్టంగా ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవాళి తరఫున వాణిని వినిపించే ధైర్య స్థైర్యాలు ఉండాలని అన్నారు. సార్వభౌమత్వం, శాంతియుత మార్గాల్లో వివాదాల పరిష్కారం పునాదులుగా భారత విదేశాంగ విధానం రూపొందిందని అన్నారు. ఈ విధానాన్ని ఒకే రీతిన కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రధాని తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
పశ్చిమాసియా ఘర్షణల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి
ఖమేనీ మృతిపై భారత్ మౌనం.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనియా గాంధీ