రథసప్తమి రోజు.. ఇలా చేస్తే..
ABN , Publish Date - Jan 25 , 2026 | 07:45 AM
రథసప్తమి రోజు నదీస్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలతోపాటు రోగాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. ఈ రోజు.. జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి ప్రీతికరమైన మాసం.. మాఘమాసం. ఈ మాసంలోనే సూర్య జయంతి.. దీనినే రథసప్తమి అని కూడా అంటారు. ఈ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుల్లో ఈ రథసప్తమి ఒకటి. ఇక సూర్యుడికి ఇష్టమైన రోజు ఆదివారం. ఆ రోజే రథసప్తమి రావడం విశేషం. ఈ ఒక్క రోజు నదీస్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలతోపాటు రోగాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. రథసప్తమి రోజు.. జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని పండితులు పేర్కొంటారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడిని కొలిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు. సూర్యకిరణాల్లో ఉండే ఔషధ గుణాలు ఈ రోజున అత్యంత శక్తివంతంగా భూమిని చేరుతాయని నమ్ముతారు.
జిల్లేడు ఆకుల స్నానం..
ఈ రోజు.. సూర్యోదయం సమయంలో 7 జిల్లేడు ఆకులను తీసుకోవాలి. వాటిని శరీరంలో.. శిరస్సుపై ఒకటి, భుజాలపై రెండు, మోచేతులపై రెండు, మోకాళ్లపై రెండు పెట్టుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకులతో స్నానం చేసేటప్పుడు సప్త సప్త మహాసప్త.. సప్త ద్వీపా వసుంధరా అనే శ్లోకాన్ని స్మరించాలి. ఈ రథసప్తమి రోజు.. జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు, శరీరంలో నొప్పులు, చర్మ వ్యాధులు తొలగిపోయి దీర్ఘాయువు లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
సూర్యారాధన సమయం..
మాఘ శుక్ల సప్తమి తిథి జనవరి 25వ తేదీ తెల్లవారుజామున 12.39 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11.00 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం తిథి ప్రకారం రథ సప్తమిని ఆదివారం జరుపుకోవాలి.
ఈ రోజు పాటించాల్సిన నియమాలు..
సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించాలి.
నేడు సూర్యునికి ఎదురుగా నిలుచుని సూర్య నమస్కారాలు చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
రథ సప్తమి రోజు సూర్యునికి అభిముఖంగా నిలుచుని ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగడంతోపాటు చేసే పనుల్లో విజయం లభిస్తుంది.
రథసప్తమి రోజు..
గోధుమలు, బెల్లం దానం చేయడం వల్ల.. విశేషమైన ఫలం లభిస్తుంది.
పూజ ఎవరైనా చేయవచ్చా..?
ఈ రోజు పూజ చేసేందుకు ఎలాంటి నియమాలు లేవు. స్త్రీ, పురుషులందరు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ రథ సప్తమి వేళ పూజ చేయవచ్చు.
ఈ రోజు చదవాల్సిన మంత్రాలు..
ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. సూర్య దండకం చదవాలి. సూర్య నమస్కార మంత్రం, సూర్యాష్టకం చదవడం వల్ల మేలు జరుగుతుందని పెద్దలు చెబుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..
ఆదివారం.. రథసప్తమి రావడం అదృష్టం: మంత్రి అచ్చెన్నాయుడు
For More Devotional News And Telugu News