Share News

ఆదివారం.. రథసప్తమి రావడం అదృష్టం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Jan 25 , 2026 | 07:19 AM

రథసప్తమి కోసం నెల రోజులుగా అద్భుత ఏర్పాట్లు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆదివారం.. రథసప్తమి రావడం అదృష్టమని ఆయన అభివర్ణించారు.

ఆదివారం.. రథసప్తమి రావడం అదృష్టం: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, జనవరి 25: భక్తులతో పూజలందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం.. అరసవల్లి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. అరసవల్లిలో రెండు రోజులుగా రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయన్నారు. నభూతో న భవిష్యత్ అన్న విధంగా రథసప్తమి శోభాయాత్ర జరిగిందన్నారు. ఆదివారం అరసవల్లిలో కొలువు తీరిన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడిని మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకుని.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారితోపాటు స్వామి వారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోమ్ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.


అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలకు వారు అంకురార్పణ చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రథసప్తమిని రాష్ట్ర పండగ చేయాలని కోరిన వెంటనే సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు. ఆ వెంటనే ఈ పండగను రాష్ట్ర పండగగా సీఎం చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. రథసప్తమి కోసం అరసవల్లిలో గత నెల రోజులుగా అద్భుత ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆదివారం.. రథసప్తమి రావడం అదృష్టమని మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు.


ఈ రోజు స్వామి వారి దర్శనం కోసం 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రత్యేక దర్శనం కంటే.. సాధారణ భక్తులే త్వరగా దర్శనం చేసుకుంటారని ఆయన వివరించారు. దేవాలయం వరకు వృద్ధుల కోసం ఉచిత బస్సులు ఏర్పాట్లు చేశామని వివరించారు. అలాగే మజ్జిగ.. మంచి నీటిని అందించే సౌకర్యాన్ని భక్తులకు కల్పించామన్నారు.


రథసప్తమి ఉత్సవాలను వైభవంగా జరుపుతాం: ఎమ్మెల్యే శంకర్

సామాన్యమైన భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. రథసప్తమి ఉత్సవాలను వైభవంగా జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. అలాగే స్వామి వారిని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, సినీ హీరో ఆది దర్శించుకున్నారు.


నిజరూప దర్శనంలో స్వామి వారు..

మరో వైపు రథసప్తమి సందర్భంగా అరసవల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లు అన్ని కిక్కిరిసి పోయాయి. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు స్వామి వారి నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం

For More AP News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 08:30 AM