Sankata Hara Chaturthi: అత్యంత అరుదైన రోజు.. ఈ సంకట హర చతుర్థి వేళ ఇలా చేస్తే..
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:43 PM
కొత్త ఏడాది ప్రారంభంలోనే అత్యంత అరుదైన రోజు రానే వచ్చింది. సంకట హర చతుర్థి మంగళవారం రావడమే కాకుండా.. అరుదైన నక్షత్రం కూడా కలిసింది.
సర్వ విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు. ఆయనను ఆరాధిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోయి.. మంచి జరుగుతోందని భక్తులు భావిస్తారు. సంకటహర చతుర్థి రోజు.. వినాయకుడిని పూజించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల సమస్య, ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఎన్నాళ్ల నుంచో అనుకోవడం.. కుదరక పోవడం. కుజదోషం కారణంగా.. అనేక ఇబ్బందులు కలగడం, ఎంత కష్ట పడినా ఆదాయం మాత్రం పెరగకపోవడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. ఈ సంకటహర చతుర్థి రోజు.. వినాయకుడిని పూజించాలి. ఈ రోజు సంకటహర గణేశ స్తోత్రం 11 సార్లు చదువుకోవాలి. ఈ స్తోత్రం చాలా చిన్నగా ఉంటుంది. కేవలం 5 నుంచి 7 నిమిషాల్లోనే 11 సార్లు చదువుకోవచ్చు.
అత్యంత అరుదైన రోజు..
కొత్త ఏడాది.. మొదటి నెల.. తొలి వారంలోనే.. అంటే జనవరి 6వ తేదీన ఈ సంకట హర చతుర్థి వచ్చింది. ఈ రోజు అత్యంత అరుదైన రోజని పండితులు చెబుతున్నారు. ఈ రోజు మంగళవారం వచ్చింది. ఈ రోజు ఆశ్లేష నక్షత్రం. ఆదిశేషుడు.. నాగేంద్ర స్వామి వారి నక్షత్రం. రెండు తలల నాగరాజుకు ఈ రోజు అభిషేకం చేస్తే కోరిన కోరికలు శీఘ్రగతిన నెరవేరుతాయని చెబుతారు.
సంకట హర చతుర్థి సమయం ఎప్పుడు..?
జనవరి 6వ తేదీ పగలు తదియ తిథి వచ్చింది. ఇది ఉదయం 11.36 గంటల వరకు ఉంటుంది. అనంతరం చవితి తిథి ప్రారంభమవుతుంది. అంటే మంగళవారం ఉదయం 11.37 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 10.46 గంటల వరకు ఈ చవితి తిథి ఉంటుంది. చవితి తిథి.. చంద్రోదయం సమయం ఉంటుందో ఆ రోజే సంకట హర చతుర్థి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 6వ తేదీ సంకట హర చతుర్థి వస్తుంది. మంగళవారం ఆశ్లేష నక్షత్రం కూడి వచ్చిన ఈ రోజును అంగారక సంకష్ట హర చతుర్థిగా పేర్కొంటారు. ఇక చంద్రోదయ సమయం వచ్చి.. మంగళవారం రోజు రాత్రి 9.50 నిమిషాలకు ఉంటుంది.
ఆలయంలో ప్రదక్షిణలు..
ఈ సంకట హర చతుర్థి రోజు.. గణపతి ఆలయంలో 3, 11, 21 ప్రదక్షిణలు చేయాలి. గణపతికి గరిక సమర్పించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించాలి. అది కూడా ఆవు నెయ్యితో.. ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. పాలు, పళ్లు తీసుకోవచ్చు. చంద్రోదయం తర్వాత చంద్రుడు లేదా నక్షత్ర దర్శనం చేసుకోవాలి. అనంతరం దూప దీప నైవేద్యాలను సమర్పించి.. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక ఈ ఉపవాసం చేయలేని వారు.. కనీసం నాలుగు సార్లు సంకట నాశన గణేశ్ స్తోత్రాన్ని పఠించాలి.
కేతు గ్రహ ప్రభావం..
జాతకంలో కేతు గ్రహ ప్రభావం బలంగా ఉన్నప్పుడు.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలాంటి వారు.. ఈ సంకట హర చతుర్థి వేళ.. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి. గణపతి దేవుని పటం ముందు స్వామి వారికి నమస్కరించి.. దీపారాధన చేసి.. పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి.. సాయంత్రం గణపతిని పూజించి భోజనం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈసారి ప్రత్యేకంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో కీలక ఆదేశాలు
ప్రయోగరాజ్‌లో మాఘ మేళా ప్రారంభం.. త్రివేణీ సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు
For More Devotional News And Telugu News