శివరాత్రి వేళ.. ఇలా చేయండి..
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:11 AM
మాఘమానం చివరి ఆదివారం.. ఈ రోజు మహా శివరాత్రి కూడా రావడం మహా విశేషం. నేడు శివనామస్మరణ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు అందుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
పరమ పవిత్ర మాసాల్లో ఒకటైన మాఘమాసంలో వచ్చే చిట్టచివరి పర్వదినం శివరాత్రి. సృష్టి, స్థితి, లయ కారకుడైన పరమ శివుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే ఈ మహా శివరాత్రి. అభిషేక ప్రియుడికి భక్తులంటే మహా ప్రీతి. ఇలా శివనామస్మరణ చేస్తే చాలు.. అలా భక్తులకు ఆయన ఇట్టే వరాలు ఇచ్చేస్తాడట. అందుకే శివుడంటే భక్తులకు అంత నమ్మకం. ఈ మహా శివరాత్రి వేళ.. దేశంలోని అన్ని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగడమే కాకుండా.. భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఈ రోజు ఏ నియమాలు ఆచరిస్తే.. ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందనే విషయాన్ని పండితులు వివరిస్తున్నారు. మాఘమాసం.. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆదివారం మాహాశివరాత్రి సందర్భంగా సూర్యారాధనతో పాటు శివారాధనను కలిపి చేయడం వల్ల పాపాలు హరిస్తాయని పండితులు చెబుతున్నారు.
ఈ నియమాలు ఆచరించాలి.?
శివరాత్రి.. పండగ మాత్రమే కాదు.. ఆత్మజాగరణకు దారి చూపే పవిత్రమైన రోజు. భక్తులు ఉపవాసం, జాగరణతో పాటు శివనామస్మరణ చేయాలంటారు. సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించింది కూడా ఈ రోజే అంటారు. ఈ పవిత్రమైన రోజు.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని పరిశుభ్రం చేసేకోవాలి. ప్రతిఒక్కరూ తలస్నానం చేయాలి. దేవుని గదిలో శివుడి పటం ముందు ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. శక్తి కొలదీ నైవేద్యం సమర్పించాలి. కనీసం చిన్న బెల్లంముక్క అయినా ఆ శివయ్యకు నివేదించాలి. శివాలయానికి వెళ్లి శివయ్యకు అభిషేకం చేయించాలి. ఉపవాసాన్ని సంకల్పించుకోవాలి. ఉదయం, ప్రదోష కాలంలో.. రాత్రి సమయంలో మరీ ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలం అంటే.. రాత్రి 11:30 నుంచి 12:30 గంటల మధ్య కాలంలో శివారాధన చేయాలి. అలా చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందంటారు పండితులు.
దోష నివారణ ఫలితాలు..
ఆదివారం మహా శివరాత్రి రావడం వల్ల ఈ రోజు శివారాధన చేసిన వారికి అనారోగ్య సమస్యలు తొలగుతాయంటారు పండితులు. పితృదేవతలు కూడా తరిస్తారట. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, కీర్తి, విజయాలు అందుకుంటారని చెబుతున్నారు. ఇక శత్రు పీడ, గ్రహ బాధలు సైతం తొలగిపోతాయంటారు. ఈ రోజు 'ఓం నమః శివాయ' మంత్ర జపం, రుద్రాభిషేకం, బిల్వార్చన చేయాలని చెబుతున్నారు. ఈ రోజు దానం చేయడం వల్ల పాపాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సౌఖ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ఏడాదిలో..
ఈ ఏడాదిలో పలు కారణాల వల్ల పలువురు పెద్దలకు తర్పణం వదలకుండా ఉంటారు. అలాంటి వారు.. ఈ పరమ పవిత్రమైన శివరాత్రి రోజు పెద్దలకు తర్పణం వదలడం వల్ల విశేష ఫలితాలను వారసులు అందుకుంటారని చెబుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శివరాత్రి రోజున చేయకూడని తప్పులు ఏంటో తెలుసా?
మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
For Devotional News And Telugu News