Share News

రాయిని తెచ్చి.. ఆలయంగా మలిచి..

ABN , Publish Date - Feb 17 , 2026 | 10:28 AM

ఏడుకొండల వాడా వెంకటరమణ.. ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే స్వామి వెంకటేశ్వరుడు.

రాయిని తెచ్చి.. ఆలయంగా మలిచి..

  • కళాత్మకం.. జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయం

  • ప్రత్యేకంగా 50 అడుగుల రాజగోపురం

  • నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్: ఏడుకొండల వాడా వెంకటరమణ.. ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే స్వామి వెంకటేశ్వరుడు. అందుకే దివ్య మంగళ స్వరూపుడైన ఆయన ఆలయం ఎక్కడ ఉన్నా నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ఇక తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దర్శనం కోసం లక్షల మంది నిత్యం పడిగాపులు కాస్తూనే ఉంటారు. తిరుమల ఉన్న కాంతిని అన్ని ప్రాంతాలకు ప్రసరించేలా టీటీడీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.98లో కూడా వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేసింది.


city5.jpgతిరుమల సంప్రదాయానికి తీసిపోకుండా అక్కడి ఆలయ నమూనాలో శ్రీవారి ఆలయం నిర్మించింది. సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని ఓ భక్తుడు విరాళంగా ఇచ్చాడు. ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా అధికారులు ఎప్పుడూ చూసుకోలేదు. ఈ లోగా జూబ్లీహిల్స్‌లో వేగంగా నిర్మాణాలు పెరగడంతో కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని కాలనీవాసులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి స్థలాన్ని రక్షించారు. చుట్టూ ఫెన్సింగ్‌ వేసి కాపాడారు. 2015 ఆగస్టు 10న అప్పటి టీటీడీ చైర్మన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.


రాతితో నిర్మాణం..

సుమారు 3.6 ఎకరాల స్థలంలో మహా గణపతి, అళ్వారు, పద్మావతి అమ్మవార్ల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. అనేక ఆలయాలు నిర్మించిన అనుభవం ఉన్న స్థపతి నటరాజన్‌ ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తమిళనాడు నామకల్‌ నుంచి రాయిని తెప్పించి దానిపై నిర్మాణం చేపడుతున్నారు. ఆలయ ప్రహరీ, అంతరాలం, తదితర నిర్మాణాలన్నీ రాతితో చేసి గోపురం మాత్రం కాంక్రీట్‌తో ఏర్పాటు చేశారు.


అన్నీ ప్రత్యేకతలే..

ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం ఎదుట 50 అడుగుల రాజగోపురం ఏర్పాటు చేశారు. రాజగోపురం, ఆలయ గోపురం, అంతర్భాగంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. శిల్పాలను అమర్చారు. మరోవైపు భక్తులు పుణ్యస్నాచం ఆచరించేందుకు పుష్కరిణి, ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు మొక్కలను నాటారు.


zzzzzz.jpgతిరుమల తరహాలోనే..

అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్న జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయంలో తిరుమల తరహాలోనే నిత్య పూజాధికాలు నిర్వహిస్తున్నారు. తిరుమల నుంచి వచ్చిన పూజారుల బృందం పూజలు చేస్తున్నారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవతో మొదలు కల్యాణం, శుక్రవారం అర్చన వంటి సేవలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. తిరుమల నుంచి లడ్డూ ప్రసాదం కూడా అమ్మకాలు నిర్వహిస్తున్నారు.


బ్రహ్మోత్సవాలు

జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 17న అంకురార్పణతో మొదలై 26న పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు

తేదీ ఉదయం సాయంత్రం

17-2-2026 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

18-2-2026 చిన్నశేష వాహనం హంస వాహనం

19-2-2026 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

20-2-2026 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

21-2-2026 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

22-2-2026 హనుమంత వాహనం గజ వాహనం

23-2-2026 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

24-2-2026 రథోత్సవం అశ్వవాహనం

25-2-2026 చక్రస్నానం ధ్వజారోహణం


ఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 11:48 AM