Share News

దీపావళి పూజా విధానం.. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం..

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:39 PM

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారి కటాక్షం లభిస్తే.. అటు ఐశ్వర్యాలు, ఇటు సుఖసంతోషాలు సొంతమవుతాయని విశ్వసిస్తారు.

దీపావళి పూజా విధానం.. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం..

ఇంటర్నెడ్ డెస్క్: చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయాలకు ప్రతీకగా భావించే దీపావళి.. హిందు పండుగల్లో ఎంతో ప్రత్యేకమైంది, విశిష్టమైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారి కటాక్షం లభిస్తే.. అటు ఐశ్వర్యాలు, ఇటు సుఖసంతోషాలు సొంతమవుతాయని విశ్వసిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రసాదిస్తారని నమ్ముతారు. ఇదే రోజున విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడినీ పూజిస్తారు. ఇంతకీ దీపావళి పూజా విధానం మీకు తెలుసా..?


దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధిస్తారు..?

లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సంపద, సౌభాగ్యం, సంతోషం నిత్యం శోభిల్లుతూ ఉంటాయని భక్తుల అపార నమ్మకం. అందుకే వారు దీపావళి సందర్భంగా అమ్మవారిని పూజిస్తారు. అలాగే వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి ఆయన్నూ ఇదే రోజు ఆరాధిస్తారు. ఈ పూజతో సంపద, జ్ఞానం ప్రాప్తిస్తాయని భావిస్తారు.


పూజా సామగ్రి జాబితా ఇదే

లక్ష్మీపూజ చేసేందుకు ఈ వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి.

వినాయక సమేతంగా ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాలు, పూజ కోసం పీట, ఎరుపు రంగు వస్త్రం, పూలు, పండ్లు, మిఠాయిలు, తమలపాకులు, పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తి, మట్టి ప్రమిదలు, నెయ్యి, ఒత్తులు

లక్ష్మీ పూజా విధానం

  • మందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పూలతోరణాలు కట్టి అలంకరించాలి. రంగవల్లులతో ఇంటిని ముస్తాబు చేయాలి. నలు దిక్కులా పవిత్ర గంగాజలాన్ని చల్లాలి.

  • తరువాత పీటపై ఎరుపు వస్త్రాన్ని పరిచి, దాన్ని పూజకు సిద్ధం చేయాలి. ఆ పీటపై లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రపటాలు పెట్టాలి.

  • ఆపై వినాయక పూజ మొదలుపెట్టాలి. పసుపు, కుంకుమ, అక్షింతలతో విఘ్నేశ్వరుణ్ని ప్రసన్నం చేసుకోవాలి. పూజ నిరాటంకంగా కొనసాగాలని కోరుకోవాలి

  • అనంతరం లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాలి. పూలు, పండ్లతో అమ్మవారిని ఆరాధించాలి. మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థించాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః అంటూ మంత్రోచ్చారణ చేయాలి. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయ్యాక ఇల్లంతా దీపాలు వెలిగించాలి. కుటుంబ సభ్యులకు ప్రసాదమివ్వాలి. ప్రాంతాలు, ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పూజా విధానాలు మారుతుంటాయి. భక్తులందరూ ఒకే పూజా విధానాన్ని పాటించరని గమనించాలి.

గమనిక: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కూర్చి, పేర్చి మీకు అందించాం. ఇందులో రాసిన విషయాలను మతపరమైన అంశాలుగా భావించాలి.


ఇవీ చదవండి

దీపావళి వేళ టపాసులు కాలుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దీపావళి వేళ.. ఏ రాశుల వారు ఏ దేవుళ్లను పూజించాలి..

Updated Date - Nov 07 , 2026 | 05:44 PM