నేడు భీష్మ ఏకాదశి.. ఇలా చేయండి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 08:20 AM
మహాభారతంలో భీష్ముడికి ప్రత్యేక స్థానం ఉంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్యపై చేరిన ఆయన.. మాఘ శుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామాలను లోకానికి అందించారు.
ఇంటర్నెట్ డెస్క్: పర్వదినాలకు నెలవు మాఘమాసం. ఈ మాసంలో వసంత పంచమితో మొదలైన పర్వదినాలు.. ఇంకా కొనసాగుతున్నాయి. నేడు భీష్మ ఏకాదశి. దీనినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మహాభారతంలో భీష్ముడికి ప్రత్యేక స్థానం ఉంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్యపై చేరిన ఆయన.. మాఘ శుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామాలను లోకానికి అందించారు. అందుకే భీష్మ ఏకాదశిని విష్ణు సహస్రనామ జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు భీష్ముడిని స్మరిస్తూ తర్పణం వదలడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని, వంశాభివృద్ధి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
నేడు రవి యోగం..
ఈ ఏడాది జయ ఏకాదశి రోజున రవి యోగం ఏర్పడటం వల్ల ఈ సమయం మంత్రోపదేశం పొందడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలం. నేడు శ్రీ మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. గురువారం, ఏకాదశి, రవి యోగం.. ఈ మూడు కలిసి రావడం ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక అని శాస్త్ర పండితులు అంటున్నారు.
పూజా విధానం..
ఆరాధన: ఉదయాన్నే స్నానం చేసి.. శ్రీమహావిష్ణువు చిత్రపటం ఎదుట ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయని చెబుతారు.
తులసి ప్రాముఖ్యత: ఈరోజు తులసీ దళాలతో విష్ణువును అర్చించడం వల్ల కోటి యజ్ఞాల ఫలం వస్తుందంటారు. అలాగే నేడు తులసీ ఆకులను కోయకూడదని చెబుతారు(అంటే.. ముందురోజే ఈ ఆకులను సిద్ధంగా ఉంచుకోవాలి).
దానం: ఈరోజు పేదలకు పసుపు రంగు వస్తువులు, పండ్లు లేదా అన్నదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
ఉపవాసం: నేడు ఉపవాసం ఉండడం ఉత్తమం. అంటే.. పండ్లు, పాలు తీసుకోవాలి.
ఏకాదశి తిథి..
ఏకాదశి తిథి.. జనవరి 28వ తేదీ అనగా బుధవారం సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమై.. గురువారం(జనవరి 29) మధ్యాహ్నం 1:55 గంటలకు ముగుస్తుంది.
ఈ రెండు మంత్రాలు స్మరించుకోవాలి..
విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు ఒనగూడతాయి. అలాంటిది భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల.. మరింత శుభాలు సంప్రాప్తిస్తాయి. ఒక వేళ.. ఈ రోజు విష్ణుసహస్ర నామ స్తోత్రం చదవలేని.. వినడం కానీ చేయలేని వారు.. రెండు మంత్రాలు ఈ రోజు మనస్సులో స్మరించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
అష్టాక్షరి మంత్రం.. ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షర మంత్రం.. ఓం నమో భగవతే వాసుదేవాయ వీలైనప్పుడల్లా మనస్సులో అనుకోవాలని అంటున్నారు. ఈ రెండు మంత్రాలు స్మరించుకోవడం వల్ల ఏడాదంతా శ్రీమహా విష్ణువు అనుగ్రహం కలగడంతోపాటు సమస్త శుభాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల సైతం కోరికలు నెరవేరతాయని పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More Devotional News And Telugu News