Share News

బడ్జెట్ 2026.. పాత పన్ను విధానం కనుమరుగు కానుందా?

ABN , Publish Date - Jan 29 , 2026 | 08:19 AM

మరికొన్ని రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పాత పన్ను విధానంపై చర్చ మొదలైంది. ఈ విధానానికి ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ముగింపు పలకనుందా అన్న చర్చ తీవ్రమైంది.

బడ్జెట్ 2026.. పాత పన్ను విధానం కనుమరుగు కానుందా?
Budget 2026 - Old Tax Regime

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సామాన్యులు ఇప్పటికే బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. తమకు ఊరటనిచ్చేలా కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నారు. గతేడాది ప్రభుత్వం పన్నుల తగ్గింపు ద్వారా వేతన జీవులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే, పాత పన్ను విధానాన్ని అవలంబిస్తున్న వారి కోసం ఎలాంటి ప్రయోజనాలు ప్రకటించకపోవడంతో అనేక మంది నిరాశకు లోనయ్యారు. ఈసారి పాత పన్నును పూర్తిగా రద్దు చేస్తారా లేక జనాలకు మేలు చేకూర్చే మార్పులకు శ్రీకారం చుడతారా అన్న చర్చ జోరందుకుంది(Budget 2026 - Old Tax Regime).

గతేడాది బడ్జెట్‌లో పన్ను విధానంలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో, జనాలపై పన్ను భారం తగ్గింది. వేతన జీవులకు మేలు చేకూర్చేలా స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేలకు పెంచడం, సెక్షన్ 87ఏ రిబేట్ కింద మొత్తాన్ని రూ.25 వేల నుంచి రూ.60 వేలకు పెంచడంతో మధ్యతరగతి వర్గాలకు భారీ ప్రయోజనం కలిగింది. రూ.12 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న వారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరమే లేకపోయింది. అయితే, పాత పన్ను విధానాన్ని మాత్రం కేంద్రం యథాతథంగా కొనసాగించింది. స్లాబ్స్, డిడక్షన్స్, మినహాయింపులు అన్నీ యథాతథంగా కొనసాగాయి.

దీంతో, ఈ ఏడాది బడ్జెట్‌పై చర్చ మళ్లీ పన్ను విధానం వైపు మళ్లింది. పాత విధానంలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, హోమ్ లోన్ వడ్డీ (సెక్షన్ 24బీ), ఎన్పీఎస్ బెనిఫిట్స్ వంటివి వాటిల్లో చాలా ఏళ్లుగా ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో, పాత విధానానికి ప్రభుత్వం ఈ ఏడాది ముగింపు పలుకుతుందా? లేక కీలక మార్పులు ఏమైనా చేస్తుందా? అన్న చర్చ పతాకస్థాయికి చేరుకుంది. ఈ అంశంపై బడ్జెట్‌లో క్లారిటీ వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలిగించేలా కొత్త పన్ను విధానంలో పరిమిత మినహాయింపులు కొన్ని చేర్చే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇన్సూరెన్స్, రిటైర్మెంట్, స్థిరాస్తులు వంటి వాటిపై మదుపు చేసే వారికి లాభం కలిగేలా కొత్త పన్ను విధానంలో సమతౌల్యం కోసం ప్రభుత్వ ప్రయత్నించే ఛాన్సున్నట్టు తెలుస్తోంది.


ఇక ఆదాయపు పన్ను నిబంధనలు, వేగవంతమైన రిఫండ్స్‌కు సంబంధించి కేంద్రం చర్యలు ప్రకటిస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఐటీఆర్ ప్రాసెసింగ్‌లో జాప్యం, ఏఐఎస్‌ కంప్లయెన్స్‌లో సమస్యలు, టీడీఎస్‌కు సంబంధించి చిక్కులు, తరచూ ఐటీ నోటీసులురావడం వంటి సమస్యలకు కేంద్రం ఈ బడ్జెట్‌లో పరిష్కారం చూపించాలన్న డిమాండ్స్ కూడా వినబడుతున్నాయి. ఈ సమస్యలతో శాలరీలు తీసుకునే వారితో పాటు ఫ్రీలాన్సర్లు, రిటైర్ అయిన వారు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్త పన్ను విధానంలో వృద్ధులకు ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవని కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక స్లాబ్ రేట్స్, అధిక రిబేట్‌లు, ఆరోగ్య ఖర్చులకు సంబంధించిన మినహాయింపులు చేర్చాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

అయితే, ఈసారి బడ్జెట్‌లో భారీ పన్ను కోతలు ఏవీ ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్త పన్ను విధానాన్ని మరింత సరళతరం చేసేలా కేంద్రం కీలకమార్పులు చేపట్టే అవకాశం ఉందని మెజారిటీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవీ చదవండి:

2044 నాటికి భారత్‌కు 3,300 విమానాలు అవసరం.. బోయింగ్ సంస్థ అంచనా

భారత్ ఈయూ వాణిజ్య ఒప్పందం.. అన్ని లగ్జరీ కార్ల ధరలు తగ్గవు

Updated Date - Jan 29 , 2026 | 08:53 AM