2044 నాటికి భారత్‌కు 3,300 విమానాలు అవసరం
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:52 AM
భారత్‌తో పాటు దక్షిణాసియాలో ఏటా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ వెల్లడించింది. పెరుగుతున్న డిమాండ్‌కు...
2044 నాటికి భారత్‌కు 3,300 విమానాలు అవసరం
కొత్తగా 45,000 మంది పైలెట్లు కావాలి
ఏటా 7% పెరగనున్న విమాన ట్రాఫిక్ బోయింగ్ వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్‌తో పాటు దక్షిణాసియాలో ఏటా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ వెల్లడించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 2044 నాటికి కొత్తగా 3,300 విమానాలు అవసరమని బుధవారం నాడిక్కడ వింగ్స్ ఇండియా 2026లో కమర్షియల్ మార్కెట్ అవుట్‌లుక్ (సీఎంఓ) పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా బోయింగ్ ఎండీ (కమర్షియల్ మార్కెటింగ్ యురేషియా, ఇండియా) అశ్విన్ నాయుడు మాట్లాడుతూ.. భారత్‌లో మెరుగైన ఆర్థిక వృద్థితో పాటు మధ్యతరగతి ప్రజానీకం పెరగటం సహా విమానాశ్రయాల కనెక్టివిటీ కోసం పెట్టుబడులు పెరుగుతుండటంతో వచ్చే 20 ఏళ్లలో విమాన ట్రాఫిక్ ఏటా 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అందుకుతగ్గట్టుగా కొత్త విమానాల అవసరం నాలుగింతలు పెరగనుందని ఆయన పేర్కొన్నారు. ఈ విమానాల్లో కూడా 90 శాతం వాటా న్యారో బాడీ జెట్స్‌దే ఉండనుందన్నారు. దేశీయంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు విస్తరిస్తుండటంమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. గడచిన 20 ఏళ్లలో భారత్ సహా దక్షిణాసియాలో మొత్తం విమానాల సంఖ్య 795 నుంచి 2,925కి పెరగటమే ఇందుకు నిదర్శనమని అశ్విన్ పేర్కొన్నారు.
కొత్తగా 45,000 మంది టెక్నీషియన్లు
దక్షిణాసియా రీజియన్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే 20 ఏళ్లలో కొత్తగా 45,000 మంది పైలెట్లు, 45,000 మంది టెక్నీషియన్స్‌తో పాటు 51,000 మంది క్యాబిన్ క్రూ కావాల్సి ఉంటుందని అశ్విన్ వెల్లడించారు. అంతేకాకుండా ఏవియేషన్ సర్వీసెస్ కోసం దాదాపు 19,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వీసుల్లో మెయింటెనెన్స్, రిపేర్, మార్పులు, డిజిటల్ సేవలు, శిక్షణ వంటివి ఉంటాయన్నారు. అలాగే ఈ-కామర్స్ రంగ వృద్ధితో పాటు ఫార్మా ఎగుమతులు పెరుగుతుండటంతో కార్గో విమానాలకు డిమాండ్ పెరగనుందన్నారు.
ఇవీ చదవండి:
ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం
నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..