ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:17 AM
భారత-యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూటమి దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అనేక విఽధాలుగా మన ఎగుమతులకు కలిసిరానుంది. ఈ ఒప్పందంతో...
ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
టెక్స్‌టైల్స్, అక్వా కంపెనీలకూ ప్రయోజనమే
న్యూఢిల్లీ: భారత-యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూటమి దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అనేక విఽధాలుగా మన ఎగుమతులకు కలిసిరానుంది. ఈ ఒప్పందంతో వచ్చే ఏడేళ్లలో మన దేశం నుంచి ఈయూ దేశాలకు ఎగుమతయ్యే 99.5ు వస్తువులపై దిగుమతి సుంకాల భారం భారీగా తగ్గనుంది. ఈయూ దేశాలకు ఎగుమతయ్యే మత్స్య, వస్త్ర, రసాయనాలు, రబ్బరు, ప్రాథమిక లోహాలు, రత్నాభరణాలు, తోలు ఉత్పత్తుల ఎగుమతుల మీదైతే దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దవుతాయి. ట్రంప్ సుంకాలతో కుదేలవుతున్న భారత ఎగుమతి కంపెనీలకు ఇది పెద్ద శుభవార్తే. ఈ ట్రేడ్ డీల్‌తో మన ఫార్మా, ఐటీ కంపెనీలు కూడా ప్రయోజనంపొందనున్నాయి. భారత-ఈయూ ఎఫ్‌టీఏ ప్రభావం ఏ ఏ రంగాలు, ఏఏ కంపెనీలకు మేలు చేస్తుందంటే?
ఫార్మా రంగం
ప్రస్తుతం మన దేశ ఫార్మా ఎగుమతులపై ఈయూ 11ు దిగుమతి సుంకాలు విధిస్తోంది. ఎఫ్‌టీఏతో ఈ భారం జీరోకి తగ్గనుంది. ప్రస్తుతం మన కంపెనీలు ఏటా ఈయూ దేశాలకు 295 కోట్ల డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాయి. మన మొత్తం ఫార్మా ఎగుమతుల్లో ఇది 12 శాతానికి సమానం. అయితే ఈయూ ఫార్మా దిగుమతుల్లో మన కంపెనీల వాటా ప్రస్తుతం 2.2ు మాత్రమే. మన ఫార్మా కంపెనీలు ఏదైనా కొత్త ఔషధాన్ని ఈయూ దేశాలకు ఎగుమతి చేయాలంటే అందుకు అవసరమైన అనుమతుల కోసం మూడు లక్షల యూరోల వరకు ఫీజుగా చెల్లించాల్సివస్తోంది. అన్నీ సక్రమంగా ఉన్నా అనుమతులు లభించేందుకు రెండు మూడేళ్ల సమయం పడుతోంది. ఎఫ్‌టీఏతో ఈ ఫీజుల భారం తగ్గడంతో పాటు, కొత్త ఔషధాల మార్కెటింగ్ కోసం పెట్టే అప్లికేషన్లను అక్కడి రెగ్యులేటరీ సంస్థలు ప్రాధాన్యతా క్రమంలో త్వరగా ఆమోదించనున్నాయి. ఇది మన ఫార్మా కంపెనీలకు బాగా కలిసి వచ్చే అంశం.
రసాయనాలు: మన దేశం నుంచి ఎగుమతయ్యే రసాయనాలపై ఈయూ దేశాలు ప్రస్తుతం 12.8ు దిగుమతి సుంకం విధిస్తున్నాయి. అయినా 2024లో మన దేశం ఈయూ దేశాలకు 890 కోట్ల డాలర్ల విలువైన రసాయన ఉత్పత్తులు ఎగుమతి చేసి, అక్కడి నుంచి 770 కోట్ల డాలర్ల విలువైన రసాయనాలు దిగుమతి చేసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఈయూ దేశాల్లో ఇంధన ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలు, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ సృహ పెరగడంతో కొన్ని రసాయన ఉత్పత్తుల కంపెనీలు మూతపడ్డాయి. దీంతో ఈయూకు చెందిన అనేక కెమికల్ కంపెనీలు తమ ఉత్పత్తులను ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండే వర్ధమాన దేశాల నుంచి ఔట్‌సోర్స్ చేసుకుంటున్నాయి. ఎఫ్‌టీఏతో దిగుమతి సుంకం జీరోకి రానుంది. ఇది మన దేశ కెమికల్ కంపెనీలకు కలిసి రానుంది.
ప్రయోజనం పొందే కంపెనీలు: ఎస్‌ఆర్‌ఎఫ్, నవీన్ ఫ్లోరిన్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ఆరతి ఇండస్ట్రీస్, పీసీబీఎల్, జూబిలెంట్ ఇన్‌గ్రీవియా, ప్రీవి స్పెషాలిటీ, టాటా కెమికల్స్, విష్ణు కెమికల్స్, వినతి ఆర్గానిక్స్, ఏథర్ ఇండస్ట్రీస్.
వస్త్ర పరిశ్రమ: మన వస్త్ర దిగుమతులపై ఈయూ దేశాలు ప్రస్తుతం 10 నుంచి 12ు వరకు దిగుమతి సుంకాలు విధిస్తున్నాయి. దీంతో జీరో సుంకాలతో దిగుమతయ్యే వియత్నాం, బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమతో మన కంపెనీలు ఈయూ దేశాల్లో పెద్దగా పోటీపడలేకపోతున్నాయి. తాజా ఎఫ్‌టీఏతో ఈయూ దేశాల్లో మన వస్త్ర ఎగుమతులు సైతం జీరో డ్యూటీ క్యాటగిరిలోకి రానున్నాయి. బంగ్లాదేశ్, వియత్నాంతో పోలిస్తే మన దేశంలో ప్రధాన ముడి పదార్ధమైన పత్తి, నూలు దారం, ఇతర ముడి పదార్ధాలు చౌక. దీంతో ఈ ఎఫ్‌టీఏ ఎగుమతి రంగంలో ఉన్న భారత టెక్స్‌టైల్ కంపెనీలకు బాగా మేలు చేయనుంది.
ప్రయోజనం పొందే కంపెనీలు : కేపీఆర్ మిల్స్, పెరల్ గ్లోబల్, వెల్‌స్పన్ లివింగ్., గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, నితిన్ స్పిన్నర్స్, వర్థమాన్ టెక్స్‌టైల్స్, ట్రైడెంట్, ఇండో కౌంట్.
మత్స్య ఎగుమతులు: మన మత్స్య ఎగుమతులపై ఈయూ ప్రస్తుతం 26ు వరకు సుంకాలు విధిస్తోంది. ఎఫ్‌టీఏతో ఇది జీరోకి రానుంది. ఈ వెసులుబాటు అమెరికా సుంకాలతో కష్టాల్లో పడ్డ ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలోని రొయ్యల ఎగుమతిదారులకు మేలు చేయనుంది.
ప్రయోజనం పొందే కంపెనీలు: అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, అవంతి ఫుడ్స్, కోస్టల్ కార్పొరేషన్.
రత్నాభరణాలు : ట్రంప్ సుంకాల పోటుతో దేశంలోని రత్నాభరణాల రంగం బాగా దెబ్బతింది. గుజరాత్‌లో డైమండ్ పాలిషింగ్ రంగంలోనే దాదాపు లక్షన్నర మంది రోడ్డున పడ్డారు. ఈ ఎఫ్‌టీఏతో మన రత్నాభరణాలపై ప్రస్తుతం విధిస్తున్న 15-25ు దిగుమతి సుంకం జీరోకి తగ్గనుంది. ఈ వెసులుబాటు టైటాన్, సెంకో గోల్డ్, గోల్డియం ఇంటర్నేషనల్, వైభవ్ గ్లోబల్ వంటి కంపెనీలకు కలిసి రానుంది.
ఆటో మొబైల్ రంగం
భారత-ఈయూ ఎఫ్‌టీఏతో ఈయూ దేశాలకు చెందిన ప్రీమియం, లగ్జరీ కార్లపై దిగుమతి సుంకం దశలవారీగా బాగా తగ్గనుంది. ప్రస్తుతం వీటి దిగుమతులపై మన దేశం 110ు వరకు దిగుమతి సుంకం విధిస్తోంది. కొన్ని పరిమితులకు లోబడి దశలవారీగా దీన్ని 10 శాతానికి కుదిస్తారు. ఈ కుదింపు దేశంలోని కార్ల కంపెనీలు ఉత్పత్తిచేసే ప్రీమియం కార్లపై పడుతుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే మంగళవారం స్టాక్ మార్కెట్‌లో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హుండై మోటార్స్ కంపెనీల షేర్లపై కనిపించింది. అయితే గుడ్డిలో మెల్లలా ఆటోమొబైల్ విడి భాగాల తయారీ కంపెనీలకు మాత్రం ఈ ఒప్పందం మేలు చేస్తుందని భావిస్తున్నారు.
Also Read:
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News