Share News

అన్ని లగ్జరీ కార్ల ధరలు తగ్గవు

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:38 AM

దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమపై భారత్‌-ఈయూ (యూరోపియన్‌ యూనియన్‌) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావం క్రమంగా బోధపడుతోంది. ఈ ఒప్పందంతో దిగుమతయ్యే...

అన్ని లగ్జరీ కార్ల ధరలు తగ్గవు

ఈయూ ఒప్పందంలోని కోటాలు, ధరల పరిమితులు వర్తిస్తాయి

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమపై భారత్‌-ఈయూ (యూరోపియన్‌ యూనియన్‌) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావం క్రమంగా బోధపడుతోంది. ఈ ఒప్పందంతో దిగుమతయ్యే బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్‌ బెంజ్‌, స్కోడా, లంబోర్ఘిని వంటి లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గుతాయని సంబరపడిన వారి సంతోషం ఒక్క రోజు కే పరిమితమైంది. కోటాలు, ధరల పరిమితికి లోబడి మాత్రమే ఈ కార్ల దిగుమతులపై సుంకాల భారం తగ్గనుంది.

ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం ప్రభుత్వం 40,000 డాలర్ల (సుమారు రూ.36.8 లక్షలు) వరకు ధర ఉన్న దిగుమతయ్యే కార్లపై 70 శాతం, అంతకు మించిన ధర ఉన్న కార్లపై 110 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. భారత-ఈయూ ఎఫ్‌టీఏతో ఇది వెంటనే 40 శాతానికి, తరువాత దశలవారీగా 10 శాతానికి తగ్గనుంది. దీంతో చాలా మంది సంబరపడి పోయారు. దిగుమతైన బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్‌ బెంజ్‌, స్కోడా వంటి లగ్జరీ కార్లను చౌకగా కొనేయ వచ్చని ఆశ పడ్డారు.

అసలు మతలబు: సుంకాల పోటు తగ్గిస్తూనే ప్రభుత్వం ఈయూ కార్ల దిగుమతులకు రెండు కీలక షరతులు పెట్టింది. అందులో ఒకటి ఈయూ నుంచి దిగుమతయ్యే లగ్జరీ కార్ల ధర కనీసం 15,000 యూరోల (సుమారు రూ.16.5 లక్షలు) పైన ఉండాలి. ఇంకో ప్రధాన షరతు ఈ లగ్జరీ కార్ల వార్షిక దిగుమతులు 2.5 లక్షలు మించకూడదు. అంతకు మించితే 110 శాతం దిగుమతి సుంకం తప్పదు. అంటే భారత-ఈయూ ఎఫ్‌టీఏతో దేశంలో లగ్జరీ కార్లు తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ, స్కోడా, మెర్సిడెజ్‌ బెంజ్‌ వంటి కంపెనీల అమ్మకాలకు, ‘భారత్‌లో తయారీ’కీ పెద్దగా వచ్చే ముప్పేమీ లేదని పరిశ్రమ వర్గాల అంచనా. ఇప్పటికే మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, స్కోడా, ఆడి వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్లను కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు చాలా వరకు తమకు కావాల్సిన కాంపోనెంట్స్‌ను దేశీయంగానే సమకూర్చుకుంటున్నాయి.

ఇవీ చదవండి:

ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

Updated Date - Jan 29 , 2026 | 07:11 AM