Share News

TG News: ఐలోని మల్లన్నా.. సల్లంగ సూడు!

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:58 AM

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐలోని మల్లన్న జాతర మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచేగాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. కాగా.. జాతరను పురష్కరించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

TG News: ఐలోని మల్లన్నా.. సల్లంగ సూడు!

- నేడు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న జాతర

- రేపు, ఎల్లుండి పోటెత్తనున్న భక్తజనం

ఐనవోలు(వరంగల్): ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో రెండో పెద్దజాతరగా ప్రసిద్ధి గాంచిన ఐలోని జాతర... మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతుంది. 14న భోగి, 15న మకర సంక్రాంతి రోజున రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు, కలెక్టర్‌ స్నేహశబరిష్‌జాతర నిర్వహణ ఏర్పాట్లపై ఇటీవల సమీక్ష జరిపి ఏర్పాట్లు చేయించారు.


photo1.2.jpg

గత జాతరను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాపై ప్రత్యేక దష్టి సారించారు. ఆలయ ప్రాంగణంలో విడిదిచేసే భక్తుల కోసం నీటి వసతిని కల్పించేందుకు మిషన్‌భగీరథ నీటిని ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌తోపాటు మీనీ ట్యాంకులు, ప్రత్యేక నల్లాలు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ నుంచి వచ్చే10 ట్యాంకర్లను అందుబాటులోకి ఉంచనున్నారు. స్నానాలు ఆచరించడానికి ప్రాంగణంలో ఐదు చోట్ల నల్లాలను ఏర్పాటు చేశారు. మహిళా భక్తులు స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు మూడు చోట్లు తడకలతో గదులను నిర్మించారు. భక్తుల సౌకర్యార్ధం మూడు చోట్ల నిర్మించిన సుమారు 60 మరుగుదొడ్లను సులభ్‌ కాంప్లెక్స్‌ సపాయి కర్మచారులకు అప్పచెప్పాం.


నగర పాలక సంస్థ నుంచి రెండు మొబైల్‌ మరుగుదొడ్ల బస్సులను ఎప్పటిలాగే భక్తులకు అందుబాటులోకి తీసుకవస్తున్నారు. జాతరలో నిరంతరం విద్యుత్తు సరఫరా కోసం 4 చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేశారు. సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే మరో ఫీడర్‌ ద్వారా పునరుద్దరించేలా విద్యుత్తు సంస్థ అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. విద్యుత్తు చార్జీల కోసం దేవస్థానం ముందుగానే రూ.7లక్షలు చెల్లించింది. స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహించడంతోపాటు మందులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు.


photo1.3.jpg

జాతరలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించారు. మూడు రోజలపాటు నగరపాలక సంస్థ నుంచి 110 మంది సిబ్బంది, 9 మంది జవాన్లు, 2 మంది సానిటరి ఇన్సిపెక్టర్లు, ఒకరు సూపర్‌వైజర్‌ పనిచేయనున్నారు. 2 ఫాగింగ్‌ యంత్రాలు, 20 చెత్తను తరలించే స్వచ్ఛ ఆటోలు, 2 రోడ్డును శుభ్రం చేసే స్విపింగ్‌ వాహనం ఏర్పాటు చేశారు. నాలుగు మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది సుమారు 200మంది పనిచేయనున్నారు. 15 జీపీల ట్రాక్టర్లను సిద్దం చేశారు.. డస్ట్‌ బిన్‌లు మొత్తం 300లు ఏర్పాటు చేశారు. దేవస్థానం నుంచి 70 మంది పారిశుద్ద్య కార్మికులు పనిచేస్తున్నారు.


జాతరకు తరలివచ్చే భక్తుల కోసం హన్మకొండ డిపోకు చెందిన 20ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వరంగల్‌ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఐనవోలుకు బయలుదేరుతుంది. ఐనవోలు- కాజీపేట- కొమురవెళ్లి- భక్తులు వెళ్లే విధంగా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని ఆర్టీసి అధికారులు తెలిపారు. ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని పనులు పర్యవేక్షించేందుకు నియమించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఇతర శాఖల అధికారులు, సిబ్బంది రెండు రోజలు పాటు విధులు నిర్వహించనున్నారు. ప్రత్యేక వాట్సప్‌ గ్రూపుల ద్వారా పనులను ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ గ్రూపులో జిల్లా కలెక్టర్‌ స్నేహశబరిష్‌, ఆర్డీడోవో, డీపీవో, ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈ ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

వందేభారత్‌ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ

‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్‌ సక్సెస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 13 , 2026 | 10:58 AM