Tungabhadra Dam: ‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:22 AM
తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల ఏర్పాటులో భాగంగా సోమవారం 18వ నంబరు గేటు ఏర్పాటు, ట్రయల్‌రన్ విజయవంతంగా పూర్తి చేశారు.
33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్తవి అమర్చే పనులకు శ్రీకారం
తొలిదశలో డ్యాం 18వ క్రస్ట్‌గేటు బిగింపు
కర్నూలు, అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల ఏర్పాటులో భాగంగా సోమవారం 18వ నంబరు గేటు ఏర్పాటు, ట్రయల్‌రన్ విజయవంతంగా పూర్తి చేశారు. తొలిదశలో ఒక గేటు ఏర్పాటు విజయవంతం కావడం డ్యాం ఇంజనీర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 2024 ఆగస్టులో డ్యాం 19వ గేటు చైన్‌లింక్ తెగిపోయి కొట్టుకుపోవడంతో డ్యాం, గేట్ల భద్రతపై పలు పశ్నలు తలెత్తాయి. దీంతో సాగునీటి ప్రాజెక్టుల రేడియల్ గేట్ల డిజైనింగ్ నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్ ఏర్పాటు చేశారు. డ్యాం డిజైన్ ప్రకారం గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు కాగా.. 70 ఏళ్లు ఏ ఇబ్బందీ లేకుండా పని చేశాయని, ప్రస్తుతం గేట్ల భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో మొత్తం గేట్లు మార్చాల్సిన అవసరం ఉందని గతంలో కన్నయ్యనాయుడు సూచించారు. ఈ సూచనపై బోర్డు అధికారులు, ప్రభుత్వం స్పందించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ కమిటీ సూచనల మేరకు కేఎస్‌ఎన్‌డీటీ సర్వీసెస్ సంస్థతో గేట్ల సామర్థ్యం నిర్ధారణ, రేడియోగ్రఫీ, ఎంపీటీ, అలా్ట్ర సోనిక్, డీపీటీ వంటి పరీక్షలు బోర్డు అధికారులు చేయించారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు రూ.44 కోట్లతో 33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు గుజరాత్‌కు చెందిన ‘హార్డ్‌వేర్ టూల్స్’ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. గత డిసెంబరు 6న ప్రత్యేక పూజలు చేసి గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో తుప్పుపట్టి పూర్తిగా శిథిలావస్థకు చేరిన 18వ పాత గేటు తొలగించి.. దాని స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు పనులు చేపట్టారు.
35 రోజుల్లో 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు, 49.5 టన్నుల బరువు కలిగిన ఆ గేటును అమర్చారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, సీఈ లక్ష్మానాయక్, ఎస్‌ఈ నారాయణ నాయక్, ఈఈ చంద్రశేఖర్, డ్యాం డీఈఈ జ్ఞానేశ్వర్ సహా డ్యాం, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ సాంకేతిక సిబ్బంది.. ట్రైల్ రన్‌లో భాగంగా 20 అడుగులు గేటును పైకి ఎత్తి దించారు. మరో మూడు గేట్ల ఏర్పాటు సగం వరకు పూర్తి చేశామని ఎస్‌ఈ నారాయణ నాయక్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. మే నెలాఖరులోగా మొత్తం గేట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గేటు ఏర్పాటు, ట్రయల్‌రన్ సక్సెస్ కావడంతో సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బోర్డు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, ఈ సీజన్‌లోనే మొత్తం 33 గేట్లనూ బిగిస్తామని, ఇప్పటికే 23 సిద్ధంగా ఉన్నాయని గేట్ల డిజైనింగ్ నిపుణుడు కన్నయ్యనాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.