Share News

కోల్‌కతాలో ట్రైనింగ్‌.. వరంగల్‌లో ఆఫీస్‌!

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:08 AM

ముద్ర లోన్‌ ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరాలకు తెగబడుతున్న వరంగల్‌కు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

కోల్‌కతాలో ట్రైనింగ్‌.. వరంగల్‌లో ఆఫీస్‌!

  • సైబర్‌ నేరగాళ్లుగా దినసరి కార్మికులు

  • ముద్ర లోన్‌ ఇప్పిస్తామంటూ మోసాలు

  • ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు..

హైదరాబాద్‌ సిటీ: ముద్ర లోన్‌ ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరాలకు తెగబడుతున్న వరంగల్‌కు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు సైబర్‌ కేటుగాళ్లు కోల్‌కతాలో శిక్షణ ఇవ్వగా.. వారు వరంగల్‌లో ఆఫీసు తెరిచి మరీ మోసాలకు పాల్పడ్డారు. వరంగల్‌ జిల్లాకు చెందిన బోచు అరుణ్‌, గడ్డం భరత్‌, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్‌, చుక్క శ్యామ్‌లు దినసరి కార్మికులు.. అయితే సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఓ ఫేస్‌బుక్‌ ప్రకటన చూసిన వీరు.. రాహుల్‌ అనే వ్యక్తిని సంప్రదించారు.


అతడు వీరిని కోల్‌కతాకు తీసుకెళ్లి.. సైబర్‌ మోసాలు చేసే కాల్‌ సెంటర్‌లో చేర్చాడు. అక్కడ కృష్ణ అలియాస్‌ కిట్టు అనే మేనేజర్‌ వీరికి సైబర్‌ నేరాలు చేసే విధానంపై శిక్షణ ఇచ్చాడు. అది పూర్తవ్వగానే వరంగల్‌(Warangal)కు వచ్చిన వారు సొంత దుకాణం తెరిచారు. ముద్ర లోన్‌ మేనేజర్లమంటూ అమాయకులకు ఫోన్‌లు చేసి బురిడీ కొట్టించేవారు. లోన్‌ మంజూరైందని చెప్పి జీఎస్టీ, బీమా, రీఫండ్‌ చార్జీల పేరుతో అందినకాడికి వసూలు చేసేవారు. వీరు కాజేసిన మొత్తంలో 30 శాతం కమీషన్‌గా తీసుకునేవారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను మోసం చేసి రూ.1.08 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు.


దేశవ్యాప్త నెట్‌వర్క్‌..

ఢిల్లీ, కోల్‌కతాల్లో ఉంటున్న ప్రధాన నిందితులు పలు రాష్ట్రాలకు చెందిన వారికి ఆన్‌లైన్‌ లోన్లు, ముద్ర లోన్ల పేరిట శిక్షణ ఇచ్చి సైబర్‌ మోసాలు చేయిస్తున్నారు. తొలుత ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌లలో ముద్ర లోన్ల గురించి ప్రచారం చేస్తారు. ఎటువంటి వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండా రుణాలిస్తామని చెబుతారు. అది నమ్మి సంప్రదించిన వారి ఆధార్‌, పాన్‌కార్డు వివరాలు సేకరిస్తారు. రాష్ట్రాల వారీగా వివరాలను విభజించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న తమ నెట్‌వర్క్‌కు అందించే వారు.


ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల వారికి సంబంధించిన సమాచారాన్ని వరంగల్‌ ముఠాకు అందజేసే వారు. ఈ మేరకు ఆ ముఠా లోన్‌ మంజూరైందని చెబుతూ జీఎస్టీ, బీమా, రీఫండబుల్‌ అమౌంట్‌ అంటూ పలు దఫాలుగా అందినకాడికి వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసే డబ్బును ప్రధాన సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లో జమ చేయించేవారని.. ఆ డబ్బులో 30 శాతం కమీషన్‌గా వీరు తీసుకునేవారని సైబర్‌ క్రైం డీసీపీ అరవింద్‌బాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2026 | 11:08 AM