Share News

అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:39 AM

అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వందేమాతరం ఆలపించే చోట సభికులంతా శ్రద్ధగా లేచి నిల్చోవాల్సిందేనని పేర్కొంది....

అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!

  • మొత్తం ఆరు చరణాలు ఆలపించాల్సిందే: కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వందేమాతరం ఆలపించే చోట సభికులంతా శ్రద్ధగా లేచి నిల్చోవాల్సిందేనని పేర్కొంది. జాతీయ గేయం(వందేమాతరం), జాతీయ గీతం(జనగణమన) రెండూ ఆలపించాల్సిన సందర్భాలలో ముందుగా వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడాల్సిందేనంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ గతనెల 28న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాలలో వందేమాతరం ఆలాపనకు సంబంధించి తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణపతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు తదితర సందర్భాలలో 3 నిమిషాల 10 సెకండ్ల వ్యవధితో జాతీయ గేయంలోని ఆరు చరణాలను పాడాలని పేర్కొంది. పాఠశాలల కార్యకలాపాలు జాతీయ గేయం ఆలాపనతోనే మొదలవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ సంవత్సర వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్‌లు తప్ప ఇతర ఉత్సవ కార్యక్రమాలు, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి, లేదా ప్రజాకార్యక్రమానికి రాష్ట్రపతి రాక తదితర సందర్భాలలో జాతీయ గేయం అధికారిక వెర్షన్‌ను ఆలపించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలల నిర్వాహకులు తమ కార్యక్రమాలలో జాతీయ గేయం, జాతీయ గీతం ఆలాపనకు, విద్యార్థుల్లో జాతీయ జెండా పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించింది. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ తదితర పురస్కారాల ప్రదానోత్సవాలు, రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాలు, రాష్ర్ట్రపతి రాక, వీడ్కోలు సందర్భాలలోనూ జాతీయ గేయం ఆలపించాలి. అలాగే, జాతీయ గీతం ఆలాపనకు ముందు మృదంగం వాయిద్యాలు తప్పనిసరి అని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 06:39 AM