Share News

ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది..?

ABN , Publish Date - Feb 03 , 2026 | 08:15 AM

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నా.. ఇంకా పూర్తి విషయాలు వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. తల్లీ, పిల్లల ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.

ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది..?

  • 28న పెళ్లిరోజు.. 31న భర్త పుట్టినరోజు

  • విజయారెడ్డి ఆత్మహత్య కేసులో వీడని మిస్టరీ

  • నేను ఎవరి కోసం బతకాలి?..

  • కన్నీరు మున్నీరవుతున్న సురేందర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. సుమారు 15 మంది ఐటీ ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న ఆమె ఉన్నట్లుండి ఇంటర్‌ చదువుతున్న కూతురు చేతన రెడ్డి(18) విశాల్‌రెడ్డి (17)తో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమొచ్చిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డి కుటుంబసభ్యులు, బంధువులను విచారించినా కారణాలు తెలియరాలేదని వెల్లడించారు. మరో రెండు నెలల్లో కుమార్తె ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అయ్యేదని, ఇంత పెద్ద పిల్లలను చంపాల్సిన కష్టం ఏమి వచ్చిందో అంతుచిక్కడం లేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో ఒంటరిననే భావన ఉంటే పిల్లలను హాస్టల్లో ఉంచకుండా తన వద్దే ఉంచుకొని చదివిస్తే సరిపోయేదని భావిస్తున్నారు.


ఏదో డిప్రెషన్‌లో ఉన్నట్లు ..!

జనవరి 28న విజయారెడ్డి-సురేందర్‌రెడ్డిల పెళ్లి రోజు. 31న భర్త సురేందర్‌రెడ్డి పుట్టినరోజు. వారి పెళ్లిరోజుకు, సురేందర్‌ రెడ్డి పుట్టిన రోజుకు మధ్య కేవలం రెండు రోజులు గ్యాప్‌. జనవరి30న రాత్రి సుమారు 10.30 నుంచి 11.00 గంటల మధ్యలో పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆమె కారును పార్కింగ్‌ పెట్టింది. తాళాలు కొడుకు జేబులో పెట్టింది. ముగ్గురూ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లారు. టికెట్‌ కౌంటర్‌ పరిసరాల్లో సుమారు గంటకు పైగా వేచి ఉన్నారు. ఆ తర్వాత చర్లపల్లి-ఘట్‌కేసర్‌ ప్లాట్‌ఫ్లాంపై దాదాపు మూడున్నర కిలోమీటర్ల వరకు నడుస్తూ వెళ్లారు. అర్ధరాత్రి 12 తర్వాత అంటే భర్త పుట్టినరోజు (జనవరి-31) తేదీన సుమారు 1:00 గంట సమయంలో తన పిల్లలను గుండెకు ఇరువైపులా హత్తుకుని రైలు కిందపడి ప్రాణాలు వదిలారు. అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏమెచ్చింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డి ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపించారు. అయితే పిల్లలను తీసుకెళ్లడానికి హాస్టల్‌కు వెళ్లినప్పుడు ఏదో డిప్రెషన్‌లో ఉన్నట్లు కనిపించిందని కళాశాల సిబ్బంది పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.


నేను ఎవరికోసం బతకాలి? విలపిస్తున్న భర్త

భార్య, పిల్లలు అంతా కలిసి తనను ఒంటరిని చేశారని, తాను ఎవరి కోసం బతకాలని సురేందర్‌రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారే లేనప్పుడు తాను ఎందుకు బతకాలి? అని రోదిస్తున్నట్లు తెలిసింది. పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరమూ కష్టపడుతున్నామని, అయినా వారు ఎందుకు ఇలా చేశారో అంతుచిక్కడం లేదని సురేందర్‌రెడ్డి పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ డేటా వస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.


city4.2.jpg

నాకు ఈ లైఫ్‌ నచ్చలేదు...

పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏదో కారణం ఉండి ఉండొచ్చని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే డీఎస్పీ జావీద్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ విజయారెడ్డి రాసి న సూసైడ్‌ నోట్‌ కారులో దొరికిందన్నారు. పార్కింగ్‌ స్లిప్‌ వెనుక భాగంలో సూసైడ్‌ నోట్‌ రాసినట్లు తెలిపారు. ‘‘అ మ్మా.. ఐ యామ్‌ సారీ.. నాకు ఈ లైఫ్‌ నచ్చలేదు. చాలా ట్రై చేశాను బతకడానికి. కానీ అవ్వట్లేదు. నా పిల్లల్ని వదిలేసి నేను పోలేను. అందుకే వాళ్లని తీసుకొని పోతున్నా. మా చావుకు ఎవరూ కారణం కాదు. మా ఇష్టంతోనే పోతున్నాం.’’ అని రాసి ఉందని డీఎస్పీ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 03 , 2026 | 08:15 AM